'పైప్లైన్పై చేయి వేస్తే ఆరేళ్లు జైలన్నారు'
గ్యాస్ పైప్లైన్లు తుప్పు పట్టాయని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవటం లేదని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. గెయిల్ పేలుడు ఘటనా స్థలాన్ని సందర్శించిన ఆయన మాట్లాడుతూ ఈ దుర్ఘటనకు గెయిల్ సంస్థ బాధ్యత వహించాలన్నారు. ఇప్పటికైనా పాడైపోయిన పైప్లైన్ల స్థానంలో కొత్త పైప్లైన్లు వేయాలని హర్షకుమార్ డిమాండ్ చేశారు.
పైప్లైన్ల లీకేజి విషయంలో తాను కేంద్రానికి మూడుసార్లు లేఖ రాసినా, అధికార పక్షంలో ఉన్న ఎంపీ అయినా కూడా తన లేఖను ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. అంతే కాకుండా 1960 నాటి పైపులైను చట్టం ప్రకారం పైప్లైన్లపై చేయి వేస్తే ఆరేళ్ల జైలు శిక్ష విధిస్తామన్నారని, ఆ నిబంధన మార్పుతో పాటు, గ్యాస్ లీక్ వల్ల ప్రమాదాలు జరిగితే బాధితులకు నష్టపరిహారం చెల్లించాలనే అంశాన్ని చేర్చాలని ప్రతిపాదించినా ఫలితం లేకపోయిందన్నారు. యూపీఏ ప్రభుత్వంలోని చమురు మంత్రిత్వశాఖ ఏమాత్రం పట్టించుకోలేదన్నారు.
పైప్లైన్ లీక్ వల్ల ఎకరం మేరకు గ్యాస్ వ్యాపించిందని, అగ్గిపుల్ల వెలిగించటంతో పేలుడు జరిగిందని హర్షకుమార్ అన్నారు. అదే ఏ పదో లేక ఇరవయ్యో ఎకరాల మేరకు గ్యాస్ వ్యాపించి ఉంటే పెను ప్రమాదమే జరిగి ఉండేదన్నారు. ఓఎన్జీసీ, గెయిల్ నిర్లకక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, ఇప్పటికైనా ఆ సంస్థలు ప్రజల ప్రాణాలకు భరోసా ఇవ్వాలన్నారు. లేకుంటే కోనసీమ ప్రజలు గ్యాస్ వెలికితీత కార్యక్రమాలను పూర్తిగా బహిష్కరించే అవకాశం ఉందని హర్షకుమార్ అన్నారు. ప్రభుత్వాలు స్పందించి ప్రజలకు భద్రతతో పాటు భరోసా కల్పించాలని ఆయన కోరారు.