ఎంపీ పండుల రవీంద్రబాబు, మాజీ ఎంపీ హర్షకుమార్, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావులపై జనం ఆగ్రహం ప్రదర్శించారు.
కాకినాడలో మురళీమోహన్‌తో వాగ్వాదం
మామిడికుదురు/ అమలాపురం (తూర్పు గోదావరి జిల్లా): గ్యాస్ పైపులైను పేలుడు ప్రాంతాన్ని సందర్శించేందుకు శనివారం నగరం గ్రామానికి వచ్చిన అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు, మాజీ ఎంపీ హర్షకుమార్, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావులపై జనం ఆగ్రహం ప్రదర్శించారు. ఎంపీ రవీంద్రబాబు తొలుత గ్రామాన్ని సందర్శించి, బాధితులను పరామర్శించగా స్థానికులు ప్రమాదం జరిగిన రోజే ఎందుకు రాలేదని నిలదీశారు. రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు, మాజీ ఎంపీ హర్షకుమార్ మధ్యాహ్నం వచ్చీరాగానే టీవీ చానళ్ల వారితో మాట్లాడుతూ పైపులైన్ల నిర్వహణ సక్రమంగా లేదని చమురు సంస్థలను విమర్శించారు. అప్పటికే వారిని చుట్ట్టుముట్టిన స్థానికులు... అధికారంలో ఉన్న పదేళ్లూ మీరేం చేశారంటూ హర్షకుమార్‌పై ధ్వజమెత్తారు. ‘గో బ్యాక్ హర్షకుమార్... డౌన్ డౌన్ హర్షకుమార్’ అంటూ 216 జాతీయ రహదారిపై కొద్దిసేపు ధర్నా చేశారు. కాకినాడ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించేందుకు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావుతో కలసి వచ్చిన రాజమండ్రి ఎంపీ మురళీమోహన్‌ను బాధిత కుటుంబాలకు చెందిన వారు నిలదీశారు.