అమలాపురం టౌన్ : గెయిల్ పైపులైన్ విస్ఫోటం నగరం గ్రామవాసులను ఇంకా వెన్నాడుతూనే ఉంది. చీకటి మాటు నుంచి మంటలు దూసుకువస్తుంటే.. అనేకమంది ప్రాణభీతితో దిక్కూదరీ ఎంచకుండా చెల్లాచెదురయ్యారు. ఇప్పుడిప్పుడే వారు మళ్లీ గ్రామానికి వస్తున్నారు. వీరిలో వాకా వీరాస్వామి కుటుంబం ఒకటి. శుక్రవారం ఉదయమే గ్రామానికి చెందిన వాకా వీరాస్వామి, కాండ్రేగుల సత్యనారాయణ, కొల్లాబత్తుల ఏసు కాలకృత్యాల కోసం వాడ్రేవుపల్లి డ్రెయిన్ ప్రాంతానికి వెళ్లారు. ఇంతలో పెద్ద శబ్దం వచ్చింది. ఆ వెంటనే పెద్ద ఎత్తున ఎగసిపడ్డ మంటలు రోడ్డు వైపు దూసుకువచ్చాయి. క్షణంలో మంటలు చుట్టుముడతాయనగా ముగ్గురూ మురుగు కాల్వలోకి దూకేశామని వీరాస్వామి చెప్పారు. మురుగు నీరైనా, కొద్దిసేపు భరించారు. ఊపిరాడకపోవడంతో చేసేది లేక కాల్వలోంచి ఒక్క ఉదుటున గట్టుపైకి వచ్చి కొబ్బరి తోటలకు అడ్డంపడి మంటలకు అందనంత దూరానికి పారిపోయారు. తమలాగే మరికొందరు కూడా మురుగుకాల్వలో దూకి ప్రాణాలు దక్కించుకున్నట్టు వీరాస్వామి చెప్పాడు. వీరాస్వామి కుమార్తెలు దుర్గ, నాగవేణిలు ఇంటి ప్రహరీ దూకి, ప్రాణాలు దక్కించుకున్నారు. పైపులైను పేలిన సమయంలో వారిద్దరూ ఇంట్లో నిద్రిస్తున్నారు. తండ్రి బయటకు వెళ్లినప్పుడు వారిద్దరూ గాఢనిద్రలో ఉన్నారు. ఇంటి ముఖ ద్వారం తలుపుల సందు నుంచి పొగలు రావడాన్ని దుర్గ గమనించింది. వెంటనే చెల్లిని లేపి కిటికీ తలుపులు తీసి చూసింది. ముఖద్వారానికి ఉన్న కర్టెన్ కాలిపోతూ కనిపించింది. ఇంటికెదురుగా ఉన్న పెంకుటింట్లోని వారు మంటల్లో చిక్కుకుని హాహాకారాలు చేస్తూ కనిపించారు. భీతావహులైన అక్కాచెల్లెళ్లు ఇంటి వెనుకే ఉన్న నగరం మార్కెట్ కమిటీ కార్యాలయం ప్రహారీని అతికష్టంపై దూకి గండం నుంచి బయటపడ్డారు. అప్పటికే వారి ఇంటిని అగ్నికీలలు చుట్టుముట్టాయి. ఇల్లు పాక్షికంగా కాలిపోయింది. తండ్రికి ఆసరాగా దుర్గ ఇంట్లోనే నిర్వహిస్తున్న ఫొటో స్టూడియో కెమెరాలు, ఇతర ఉపకరణాలు కాలిపోయాయి.
మురుగు కాల్వలో దూకి తండ్రి.. ప్రహరీ దూకి కుమార్తెలు
Published Sun, Jun 29 2014 2:02 AM | Last Updated on Sat, Sep 2 2017 9:31 AM
Advertisement
Advertisement