
తెలుగులో చంద్రమోహన్-జయసుధ నటించిన కలికాలం అనే సినిమా ఒకటుంది. సమాజంలో.. తల్లిదండ్రుల పట్ల పిల్లలు వ్యవహరించే తీరును సమకాలీన అంశాల ఆధారంగా అప్పట్లో చూపించారు దర్శకుడు ముత్యాల సుబ్బయ్య. అయితే ఆనాటికి.. ఈనాటికి ఆ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదని నిరూపించిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది.
హరేంద్ర మౌర్య(46).. మోరెనా టౌన్‌లో ఎలక్ట్రీషియన్ పని చేసేవారు. ఆయనకు ముగ్గురు కూతుళ్లు.. ఓ కొడుకు. మార్చి 1వ తేదీన ఒకేసారి ఇద్దరు కూతుళ్లకు అంగరంగ వైభవంగా వివాహం చేశాడాయన. అయితే కొన్ని గంటలకే ఆ ఇంట విషాదం నెలకొంది. ఓ గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్న హరేంద్ర.. ఎంత సేపటికి బయటకు రాలేదు. దీంతో తలుపులు బద్ధలు కొట్టి చూడగా ఆయన ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించారు. కిందకు దించి ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని.. మృతదేహాన్ని గ్వాలియర్ మెడికల్ కాలేజీకి తరలించారు.
భార్య విడాకులు తీసుకుంటుందనే ఇలా అఘాయిత్యానికి పాల్పడ్డాడని బంధువుల్లో కొందరు.. ఇంట్లో మనస్పర్థలవల్లే ఆయన చనిపోయాడని చుట్టుపక్కలవాళ్లు.. సొంత తండ్రి, సోదరుడే హరేంద్రను చంపారని భార్య తరఫు బంధువులు.. ఇలా ఎవరికి తోచినట్లు వాళ్లు మాట్లాడుకోసాగారు. ఈలోపు ఓ భయంకరమైన విషయం వెలుగు చూసింది.
హరేంద్రను అతని భార్య, కూతుళ్లు కలిసి దారుణంగా హింసించిన వీడియో ఒకటి సోషల్ మీడియాకు ఎక్కింది. భార్య ఆయన కాళ్లను పట్టుకుంటే.. ఓ కూతురు చేతులు పట్టుకుంది. మిగతా ఇద్దరు కూతుళ్లు కర్రలతో ఆయన్ని విచక్షణ రహితంగా చితకబాదారు. ఆ బాధతో ఆయన అరుస్తున్న దృశ్యాలు అందులో రికార్డు అయ్యాయి. కొడుకు ఆ తండ్రిని రక్షించే ప్రయత్నం చేయగా.. అతన్ని వారించి మరీ హరేంద్రను హింసించడం ఆ వీడియోలో ఉంది. ఆ వీడియోను ఎవరు చిత్రీకరించారో.. ఎవరు బయట పెట్టారో తెలియదుగానీ.. హరేంద్ర మరణించిన తర్వాత బయటకు రావడంతో తీవ్ర చర్చనీయాంశమైంది.
Note: కలవరపరిచే దృశ్యాలు ఉన్న కారణంగా.. వీడియోను అప్‌లోడ్ చేయలేకపోతున్నాం
ఈ వీడియో ఆధారంగా హరేంద్రది బలవన్మరణం కాదని.. అతన్ని హింసించి హత్య చేశారని అతని బంధువులు ఆరోపిస్తున్నారు. ఫిబ్రవరి 1వ తేదీన ఆ వీడియో రికార్డు చేసినట్లు ఉండగా.. పోలీసులు ఈ వీడియో ఆధారం దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆ తండ్రికి ఎలాగైనా న్యాయం చేయాలంటూ పలువురు నెట్టింట డిమాండ్ చేస్తున్నారు.
ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి.
ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com
Comments
Please login to add a commentAdd a comment