gas pipe line
-
పైపులైన్ ద్వారా వంట గ్యాస్.. తుది దశకు గ్యాస్ స్టేషన్ పనులు
ఫెర్టిలైజర్‌సిటీ(రామగుండం): రాష్ట్రంలో తొలిసారిగా ఇంటింటికీ పైపులైన్ ద్వారా గ్యాస్ సరఫరా చేసేందుకు చేపడుతున్న పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దీన్ని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. తొలిదశలో పెద్దపెల్లి జిల్లాలోని ఆర్ఎఫ్సీఎల్ టౌన్షిప్, రామగుండం కార్పొరేషన్ 39వ డివిజన్లోని గౌతమినగర్, శాంతినగర్‌లలో ఇంటింటికీ గ్యాస్ సరఫరా చేసేందుకు పైపులైన్ నిర్మాణ పనులు పూర్తి చేశారు. ఎన్టీపీసీ టౌన్షిప్, సింగరేణి ఇతర ప్రాంతాల్లో పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఆర్ఎఫ్సీఎల్ టౌన్షిప్, శాంతినగర్, గౌతమినగర్‌లో ఇంటింటికీ గ్యాస్ కనెక్షన్ కోసం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) వినియోగదారులకు రూ.618లతో రిజిస్ట్రేషన్ ప్రారంభించారు. ఈ ఫీజు చెల్లించిన వినియోగదారుల ఇళ్లకు గ్యాస్ మీటర్లు బిగించారు. ఆగస్టు 1 నాటికి ఇంటింటికీ గ్యాస్ సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. మూడు జిల్లాల్లో పనులు పూర్తి.. రాష్ట్రంలోని గ్యాస్ ఆధారిత భారీ, చిన్న తరహా పరిశ్రమలకు పైపులైన్ ద్వారా గ్యాస్ సరఫరాతో మేలు జరుగుతుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాలకు సరఫరా చేసేందుకు పైపులైన్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. వీటితోపాటు సీఎన్జీ బంకులను అందుబాటులోకి తీసుకురానున్నారు. మల్లవరం పోర్టు నుంచి పైపులైన్ ద్వారా రామగుండం ఫెర్టిలైజర్ కెమికల్ లిమిటెడ్ కర్మాగారంలోని గ్యాస్ స్టేషన్‌కు ఇప్పటికే గ్యాస్ సరఫరా అవుతోంది. నూతనంగా నిర్మించిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ స్టేషన్‌కు గ్యాస్ తరలింపుపై ట్రయల్ రన్ నిర్వహించారు. లీకేజీ అవకాశాలు తక్కువ.. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌తో పోలిస్తే పైపులైన్ ద్వారా సరఫరా అయ్యే గ్యాస్ ధర 30 శాతం వరకు తక్కువగా ఉండనుంది. పైపులైన్ ద్వారా వచ్చే గ్యాస్ బరువు తక్కువగా ఉండటంతో లీకేజీ, అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశాలు తక్కువ. వినియోగదారుల ఇళ్లకు మీటర్లు బిగించి, యూనిట్ల ఆధారంగా బిల్లు వసూలు చేస్తారు. -
ఏసీలు పేలి 17 మంది మృతి
ఢాకా: బంగ్లా రాజధాని శివార్లలోని మసీదులో ఆరు ఎయిర్‌కండీషనర్లు పేలడంతో 17మంది మరణించారు. అండర్‌గ్రౌండ్ గ్యాస్‌పైప్‌లో లీకేజ్ కారణంగా ఈ పేలుడు సంభవించి ఉండొచ్చని భావిస్తున్నారు. పేలుళ్లలో దాదాపు 20 మంది గాయపడ్డారని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. నారాయణ్‌గంజ్ పోర్టుటవున్‌లోని బైతుల్‌సలాత్ మసీద్‌లో శుక్రవారం ప్రార్ధనలకు భక్తులు సమవేశమయ్యారు. ఈ సమయంలో జరిగిన పేలుడులో చిన్నారితో సహా 11 మంది మృతి చెందారు. గాయపడినవారి పరిస్థితి విషమంగానే ఉందని, ఎక్కువమంది శరీరాలు దాదాపు 90 శాతం వరకు కాలిపోయాయని, సగంమందికి ఊపిరితిత్తుల మార్గంలో గాయాలయ్యాయని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ప్రమాదం పట్ల ప్రధాని షేక్ హసీనా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు సరైన వైద్యసాయం అందించాలని ఆదేశించారు. మసీదు దిగువన టైటస్ కంపెనీకి చెందిన గ్యాస్ పైప్‌లైన్ ఉందని, దీనిలోంచి గ్యాస్ లీకై మసీదులో నిండి ఉండొచ్చని, ఇదే సమయంలో ఏసీ లేదా ఫ్యాన్ ఆన్ చేయడంతో ఒక్కసారిగా అంటుకొని ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. గతంలోనే ఈ పైప్‌లైన్ లీకేజ్‌లపై మసీదు కమిటీ ఫిర్యాదు చేసింది. -
లక్ష ఇళ్లకు పైపు గ్యాస్
నగరానికి రెండేళ్లలో అందిస్తాం: కేంద్రమంత్రి ధర్మేంద్ర ఒడిశా నుంచి తెలంగాణకు ప్రత్యేక చమురు లైన్ నగరంలో సీఎన్జీ బంకులు మరిన్ని ఏర్పాటు చేస్తాం రామగుండం ఎరువుల కంపెనీకి మల్లవరం నుంచి గ్యాస్ అందిస్తాం సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు పెట్రోలు, డీజిల్, కిరోసిన్ సరఫరాలో అంతరాయాలు లేకుండా ఒడిశాలోని పారాదీప్ రిఫైనరీ నుంచి ప్రత్యేక పైప్ లైన్ నిర్మిస్తున్నట్టు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. మరో రెండేళ్లలో హైదరాబాద్‌లో లక్ష ఇళ్లకు పైప్ లైన్ ద్వారా వంటగ్యాస్ (పీఎన్జీ)ని సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం హైదరాబాద్‌కు పీఎన్జీని సరఫరా చేస్తున్న భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్‌ను పటిష్టపరచాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. అదనపు పైప్లైన్ల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియను పూర్తి చేశామని, త్వరలో పనులు మొదలవుతాయని చెప్పారు. యూపీఏ హయాంలో పైప్ లైన్ల పనులు కొంతమేర పూర్తయినా.. పర్యవేక్షణలో లోపం వల్ల ఇళ్లకు వంటగ్యాస్ పైపులైన్ల అనుసంధానం జరగలేదన్నారు. ప్రస్తుతం కేవలం 1,140 ఇళ్లకే అందుతున్న పీఎన్జీని 2021 నాటికి రెండున్నర లక్షల ఇళ్లకు అందిస్తామని వెల్లడించారు. రెండేళ్ల ఎన్డీఏ పాలన విజయాలను ప్రజల మందుంచే ‘వికాస్ పర్వ్’ కార్యక్రమంలో భాగంగా ఆయన కేంద్ర మంచినీరు, పారిశుధ్య శాఖ సహాయ మంత్రి రామ్‌కృపాల్ యాదవ్‌తో కలిసి హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భారత్‌ను కాలుష్యరహితంగా మార్చేందుకు ప్రధాని మోదీ ప్రణాళికలు రూపొందిస్తున్నారని, ఇందులో భాగంగా వాహనాల్లో సీఎన్జీ వినియోగాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ధర్మేంద్ర పేర్కొన్నారు. అత్యధిక సంఖ్యలో వాహనాలున్న నగరాల్లో హైదరాబాద్ ముందు వరుసలో ఉన్నందున ఇక్కడ సీఎన్జీ వాడకాన్ని పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ప్రస్తుతం నగరంలో 23 వేల వాహనాలకు మాత్రమే సీఎన్జీ అందుబాటులో ఉందని, అదే ఢిల్లీలో 10 లక్షల వాహనాలకు సరఫరా అవుతోందన్నారు. దీన్ని వీలైనంత మేర విస్తరించేందుకు నగరంలో మరిన్ని సీఎన్జీ బంకులను అందుబాటులోకి తెస్తామన్నారు. భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్‌ను విస్తరించే క్రమంలో మరోసారి హైదరాబాద్‌కు వచ్చి క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని చెప్పారు. రామగుండం ఎరువుల కర్మాగారానికి గ్యాస్ పైప్‌లైన్ కరీంనగర్ జిల్లా రామగుండంలోని ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరించేందుకు కట్టుబడి ఉన్నామని ధర్మేంద్ర ప్రదాన్ పేర్కొన్నారు. ఇందుకు ఆంధ్రప్రదేశ్‌లోని మల్లవరం నుంచి రామగుండానికి ప్రత్యేక గ్యాస్‌పైప్‌లైన్ నిర్మిస్తున్నట్టు వెల్లడించారు. కేజీ బేసిన్లో 3 వేల మీటర్ల లోతుకు వెళ్తేగానీ సహజవాయువు నిక్షేపాలు లభించటం లేదని, గ్యాస్ వెలికితీత భారీ ఖర్చుతో కూడుకున్నదని చెప్పారు. ఇప్పుడు ఆధునిక పరిజ్ఞానంతో మరింత లోతులోని నిక్షేపాలను వెలికితీసే ప్రయత్నాలు ప్రారంభించామన్నారు. ‘‘కేజీ బేసిన్లో అత్యంత విలువైన గ్యాస్ హైడ్రేట్ నిక్షేపాలున్నాయి. వాటిని వెలికితీస్తాం. అప్పుడు ఈ ప్రాంతం చమురు, గ్యాస్ హబ్‌గా మారుతుంది. అది యావత్తు దేశానికి ఉపయోగపడుతుంది. ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకం ద్వారా మూడేళ్లలో ఐదు కోట్ల పేద కుటుంబాలకు ఎల్పీజీ కనెక్షన్లు ఇస్తాం. ఇందుకు ప్రభుత్వం రూ.8 వేల కోట్లు ఖర్చు చేయబోతోంది’’ అని వివరించారు. ‘మరుగుదొడ్ల’లో తెలంగాణ వెనుక బాటు స్వచ్ఛ భారత్‌లో భాగంగా ఇంటింటికి మరుగుదొడ్ల నిర్మాణం విషయంలో తెలంగాణ వెనుకబడిందని కేంద్రమంత్రి రామ్‌కృపాల్ యాదవ్ పేర్కొన్నారు. మరుగుదొడ్ల ఏర్పాటు జాతీయ స్థాయిలో 52.25 శాతంగా నమోదుకాగా తెలంగాణలో కేవలం 38 శాతంగానే ఉందన్నారు. ఈ విషయంలో తెలంగాణ పనితీరు మెరుగుపడాల్సి ఉందన్నారు. తెలంగాణలో ఇంటింటికి మంచినీటి సరఫరా విషయంలో కేంద్రం చేయూతనందిస్తోందన్నారు. ముద్రబ్యాంకు ద్వారా 3.45 కోట్ల మందికి రూ.1.38 లక్షల కోట్ల మేర రుణాలందాయని, ఇందులో తెలంగాణకు సంబంధించి 4.76 లక్షల మందికి రూ.3,694 కోట్లు అందాయని చెప్పారు. పీఎం గ్రామీణ సడక్ యోజన ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 29 వేల కోట్లతో పనులు చేపడుతున్నామని, 2019 నాటికి ఆరున్నర వేల గ్రామాలకు రోడ్డు వసతి సమకూరుతుందన్నారు. 2014 నాటికి యూపీఏ ఆధ్వర్యంలో రోజుకు 73 కి.మీ. మేర రోడ్ల నిర్మాణం జరిగితే దాన్ని ఇప్పుడు 100 కి.మీ. పెంచినట్టు వెల్లడించారు. కార్యక్రమంలో జాతీయ కిసాన్‌మోర్చా అధ్యక్షుడు విజయ్‌పాల్‌సింగ్ తోమర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, బీజేఎల్పీ నేత కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మేడ్చల్‌లో గ్యాస్ పైప్‌లైన్ లీకేజీ.. భారీగా మంటలు
రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలోని మేడ్చల్ మండలం కిష్టాపూర్‌లో ఆదివారం ఓ గ్యాస్‌పైప్ లైన్ లీకేజీ అయింది. దాంతో మంటలు అలుమకుని భారీగా ఎగసిపడుతున్నాయి. పరిసరప్రాంతాల్లో నివసించే ప్రజలంతా భయాందోళనలో ఉన్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అయోమయం... అదే భయం!
కాకినాడ క్రైం : గ్యాస్‌పైపులైను పేలుడు ఘటనలో మృత్యుఘోష ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకూ 20 మంది మృతి చెందగా, మంగళవారం అర్ధరాత్రి వానరాశి వెంకటరత్నం(46) మృతి చెందడంతో మృతుల సంఖ్య 21కి చేరింది. కాకినాడ ట్రస్ట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్టు వైద్యులు చెబుతున్నారు. చికిత్స పొందుతున్న వారు వీరే... కాకినాడ అపోలో ఆస్పత్రిలో వానరాశి దుర్గాదేవి, ఆమె కుమారులు ఏడేళ్ల వానరాశి మోహన వెంకటకృష్ణ, ఎనిమిదేళ్ల మధుసూదన్, ఇన్స్పెక్టర్ కృష్ణన్, అతడి భార్య మేఘన, 65 ఏళ్ల బోణం పల్లాలమ్మ చికిత్స పొందుతున్నారు. ట్రస్ట్ ఆస్పత్రిలో పల్లాలమ్మ కుమారుడు బోణం పెద్దిరాజు, కోడలు రత్నకుమారి, మనుమరాళ్లు అర్చిక, ఝాన్సీ, కళ్యాణి, కుమార్తె రేకపల్లి సత్యవతి, సాయిసుధలో రుద్ర సూరిబాబు చికిత్స పొందుతున్నారు. వారిలో ఏడేళ్ల మోహన్ కృష్ణ, 65 ఏళ్ల పల్లాలమ్మ, 40 ఏళ్ల పెద్దిరాజు, 35 ఏళ్ల రత్నకుమారి, 56 ఏళ్ల కృష్ణన్ పరిస్థితి విషమంగానే ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. గ్యాస్ పేలుడు ధాటికి వారి శరీరాలతో పాటు అంతర్భాగాలు కాలిపోయి, వారి పరిస్థితి విషమిస్తోందంటున్నారు. అంతర్భాగాలు పనిచేయక పోవడం వల్ల మృత్యువాత పడుతున్నారని చెబుతున్నారు. ఓఎన్జీసీ సీఐఎస్ఎఫ్లో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న కృష్ణన్, అతడి భార్య మేఘన ప్రమాదంలో గాయపడి రాజమండ్రి స్వతంత్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నప్పటికీ, తొలుత వారిని అధికారులు గుర్తించలేదు. అనంతరం విషయం తెలుసుకుని వారిని మెరుగైన చికిత్స కోసం కాకినాడ అపోలో ఆస్పత్రికి తరలించారు. అయితే తన తల్లిదండ్రులను మెరుగైన చికిత్స కోసం చెన్నై తరలిస్తామని వారి కుమారుడు అధికారులకు తెలిపాడు. అత్యంత పవర్ఫుల్ మందులు వినియోగిస్తున్నందున సాధ్యమైనంత వరకు వారిని ఇక్కడే ఉంచాలని వైద్యులు సూచించడంతో ఆ ఆలోచనను విరమించుకున్నారు. 13 మంది కాకినాడలో... ప్రస్తుతం కాకినాడలోని మూడు ఆస్పత్రుల్లో 13 మంది చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారు ఒక్కొక్కరుగా మృతి చెందుతుండడంతో క్షతగాత్రుల కుటుంబ సభ్యులు, బంధువుల్లో ఆందోళన నెలకొంది. చిన్నారి మోహన్ కృష్ణ తల వెనుక భాగం, ముఖం తీవ్రంగా కాలిపోవడంతో అతడి తండ్రి నరసింహమూర్తి వేదనకు అంతే లేకుండా పోతోంది. -
గెయిల్ బాధితులకు పరిహారం పంపిణీ
హైదరాబాద్: తూర్పుగోదావరి జిల్లా నగరంలో గెయిల్ గ్యాస్ పైపులైను పేలిన సంఘటనలో బాధిత కుటుంబాలకు నష్టపరిహారం పంపిణీ చేశారు. హోంశాఖ మంత్రి చినరాజప్ప, గెయిల్ ప్రతినిధులు నష్టపరిహారం అందజేశారు. నగరం గ్రామాన్ని దత్తత తీసుకుంటామని గెయిల్ ప్రతినిధులు చెప్పారు. నగరాన్ని మోడల్ విలేజ్‌గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. గెయిల్ దుర్ఘటనలో 21 మంది మరణించగా, మరికొందరు తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. -
గ్యాస్ లీకేజీపై అఖిలపక్షం వేయండి: సీపీఐ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గ్యాస్ లీకేజీ వంటి దుర్ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ కోరారు. ఈ విషయంపై అందరి అభిప్రాయాలూ తెలుసుకునేందుకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు శనివారం లేఖ రాశారు. -
అధైర్యపడకండి.. అండగా ఉంటాం
- గ్యాస్ పైపులైన్ పేలుడు బాధితులకు జగన్ భరోసా - నగరంలో మృతుల కుటుంబాలను ఊరడించిన వైఎస్సార్ సీపీ అధినేత - ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు పరామర్శ - బాధలు చెప్పుకొని కన్నీరుమున్నీరైన బాధితులు సాక్షి ప్రతినిధి, కాకినాడ : ‘నిన్నటి దుర్ఘటనలో సర్వస్వం బుగ్గిపాలైంది. కళ్లెదుటే కుటుంబ సభ్యులు సజీవ దహనమైపోతుంటే..ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని పరుగెత్తడం తప్ప ఏమీ చేయలేకపోయాం. మమ్మల్ని మీరే ఆదుకోవాలన్నా’ అంటూ గ్యాస్ పైపులైన్ విస్ఫోటం బాధితులు, మరొక పక్క ‘ఈ బాధ భరించలేకపోతున్నా.. తట్టుకోవడం నా వల్ల కావడం లేదు.. నిజంగా ప్రత్యక్షనరకంలా ఉందన్నా’ అంటూ ఆస్పత్రుల్లో క్షతగాత్రులు వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని పట్టుకొని కన్నీరు మున్నీరయ్యారు. మృతుల కుటుంబాలను ఓదారుస్తూ..తీవ్రంగా గాయపడి చావుబతుకుల మధ్య ఆస్పత్రుల్లో కొట్టుమిట్టాడుతున్న క్షతగాత్రులను పరామర్శిస్తూ శనివారం జిల్లాలో జగన్మోహన్రెడ్డి పర్యటనసాగింది. హైదరాబాద్ నుంచి విమానంలో శనివారం మధ్యాహ్నం ఒంటిగంటన్నరకు మధురపూడి చేరుకున్న జగన్ నేరుగా మామిడికుదురు మండలం నగరం చేరుకొని ఘటనాప్రాంతాన్ని పరిశీలించారు. పేలుడు సంభవించిన ప్రాంతంలో ఏర్పడిన గొయ్యిని పరిశీలించారు. కాలిబూడిదైన పంటపొలాలు, కొబ్బరి చెట్లను పరిశీలించారు. సంఘటన జరిగిన తీరును స్థానికులు, ప్రత్యక్షసాక్షులను అడిగి తెలుసుకున్నారు. స్థానికులు రాయుడు జనార్దనరావు, బొలిశెట్టి భగవాన్, బండారు కాశి, రొక్కం రత్నాకర్ జగన్‌తో మాట్లాడారు. తెల్లవారుజామున పైపులైన్ జాయింట్ నుంచి గ్యాస్ లీకై దట్టమైన పొగమంచు మాదిరిగా కమ్ముకుందని, అదే సమయంలో సమీపంలోని హోటల్లోపొయ్యి వెలిగించడంతో ఒక్కసారిగా ఎగసిపడిన మంటలు క్షణాల్లో వ్యాపించాయని, తేరుకునే లోగానే అంతా అయిపోయిందని స్థానికులు జగన్‌కు వివరించారు. ఎవరికి వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీయడం తప్ప ఏమీ చేయలేకపోయామని, తప్పించుకోలేని వారు సజీవదహనమైపోయారని, మరికొందరు కాలిపోయి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కనీస రక్షణా చర్యలు పాటించకుండా తమ ప్రాణాలతో గెయిల్, ఓఎన్జీసీలు చెలగాటమాడుతున్నాయంటూ వారు జగన్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ‘మా ప్రాంతంలో లభ్యమవుతున్న గ్యాస్‌లో మాకు వాటా లేదు కానీ...ఆయిల్ కంపెనీల నిర్లక్ష్యానికి మాత్రం మేము భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తోంది’ అని వాపోయారు. ఆయిల్ కంపెనీలను ఇక్కడ నుంచి తరలించాలని డిమాండ్ చేశారు. అనంతరం జగన్ గ్రామంలో మృతుల కుటుంబాలను పరామర్శించారు. మొండిగోడల మధ్యకు వెళ్లి వారిని ఓదార్చారు. ‘అసలేం జరిగింది? ఎంతమంది మృత్యువాతపడ్డారు? ఎంతమంది గాయపడ్డారు?’ అని అడిగి తెలుసుకున్నారు. వారి ఆర్థిక పరిస్థితి, ఏ పనిచేస్తుంటారు వంటి విషయాలను కూడా ఆరా తీశారు. బాధితులు తమ గోడు వెళ్లబోసుకుంటున్నప్పుడు జగన్ చలించిపోయారు. కొండంత ధైర్యం వచ్చింది.. గటిగంటి శ్రీనివాసరావుతో పాటు అతడి కుటుంబంలోని ఐదుగురు సభ్యులు మృత్యువాత పడగా ఒంటరిగా మిగిలిన అతడి మామ చిలువూరి వెంకట్రావును జగన్ తొలుత పరామర్శించి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మృతుడు గటిగంటి మధుకృష్ణ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. విజయవాడ దగ్గర పెనుమలూరులో హోటల్ నిర్వహించుకుంటూ జీవనం పొందుతున్నామని, బంధువుల ఇంటికి వచ్చి తన భర్త మృత్యువాత పడ్డాడని మధు భార్య ధనలక్ష్మి విలపించింది. ఐదేళ్ల కుమార్తె రూపిత, అత్త సత్యవతి, మామ సాంబమూర్తిలను చూసుకోవలసిన బాధ్యత తనపైనే ఉందని, ఆదుకోవాలని మొరపెట్టుకుంది.. తనకు కనీసం ప్రభుత్వ ఉద్యోగమైనా ఇప్పించాలని కోరుతూ జగన్‌కు వినతిపత్రాన్ని అందజేసింది. మరో కుటుంబానికి చెందిన వానరాసి శ్రీరామలక్ష్మి, వానరాసి ఆదినారాయణ, నరసింహమూర్తి మృతి చెందగావారి బంధువులైన త్రిమూర్తులు, అమ్మాజీ, సుబ్బారావు, భగవాన్‌లను జగన్ పరామర్శించారు. ‘ఇళ్లన్నీ కాలిబూడిదైపోయాయి. ఇంట్లోనే కుప్పకూలి మా వారు సజీవ దహనమయ్యారు. వచ్చి చూడమని ఎంత బ్రతిమలాడినా ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోలేదు. మీరు ఏకంగా మా మొండి గోడల మధ్యకు వచ్చి మమ్మల్ని పరామర్శిస్తుంటే కొండంత ధైర్యం వచ్చినట్టయ్యింది’ అని అమ్మాజీ జగన్ చేతులు పట్టుకొని కన్నీరుమున్నీరైంది. మా తరఫున అసెంబ్లీలో పోరాటం చేయాలని త్రిమూర్తులు జగన్‌ను కోరాడు. కాలగా మిగిలిన శిథిలాలతో, మంటలను ఆర్పిన అనంతరం బురదబురదగా మారిన ఇళ్లకు జగన్ స్వయంగా వెళ్లారు. ఆ గ్రామంలో దాదాపు రెండుగంటలు ఉండి విస్ఫోటం సృష్టించిన విధ్వంసాన్ని పరిశీలించి, చలించిపోయారు. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ రత్నాకర్ జగన్‌ను కలిసి దుర్ఘటనకు కారకులైన గెయిల్ అధికారులపై హత్య కేసు నమోదుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయాలని కోరారు. ఆదుకునేలా చూస్తాం అనంతరం జగన్ అమలాపురం చేరుకుని అక్కడి కిమ్స్ ఆస్పత్రిలో, ఆ తర్వాత కాకినాడ చేరుకొని అపోలో, ట్రస్ట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. రోగులను పలకరించి ‘ధైర్యంగా ఉండండి.. త్వరలోనే కోలుకుంటారు.. మీకు అండగా నేను ఉంటా’నంటూ వారి నుదుటిపై చేయి వేస్తూ ధైర్యం చెప్పారు. కొంతమంది క్షతగాత్రులు జగన్‌ను చూడగానే కన్నీరుమున్నీరయ్యారు. అమలాపురం కిమ్స్‌లో చికిత్స పొందుతున్న వానరాసి దుర్గ జగన్‌ను చూడగానే ‘కాలిన గాయాల బాధలు భరించలేకపోతున్నా. తట్టుకోవడం నా వల్ల కావడం లేదు’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె నుదుటిపై జగన్ చేయివేసి ‘ధైర్యంగా ఉండమ్మా’ అని చెప్పారు. మరో క్షతగాత్రురాలు రేకపల్లి సత్యవతి జగన్ రెండు చేతులు పట్టుకుని కన్నీరు పెట్టుకుంది. ‘ఏడాది కిందట నా కొడుకు ప్రమాదంలో పోయాడు. ఇప్పుడు మా కుటుంబానికి చెందిన ఆరుగురు మంటల్లో కాలిపోయి కాకినాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మమ్మల్ని ఆదుకోవా’లంటూ రెండు చేతులు జోడించి వేడుకుంది. ప్రభుత్వపరంగా సహాయం అందేలా పోరాటం చేస్తామని, బాధితులకు అండగా ఉంటానని జగన్ ధైర్యం చెప్పారు. మెరుగైన వైద్యసేవలు అందించండి.. కాకినాడ అపోలో, ట్రస్ట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని జగన్ పరామర్శించారు. క్షతగాత్రులతో పాటు వారి కుటుంబ సభ్యుల కన్నీటితో జరిగిన దుర్ఘటన ను వివరించారు. తమను ఆదుకోవాలని మొరపెట్టుకున్నారు. ధైర్యంగా ఉండాలని, అన్ని విధాలా సహాయం అందేలా పోరాడుతూ అండగా ఉంటామని జగన్ భరోసా ఇచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని అపోలో ఏఓ రంజిత్‌రెడ్డి, ట్రస్ట్ ఆస్పత్రి మేనేజింగ్ డెరైక్టర్ కల్యాణ్ చక్రవర్తి, కిమ్స్ ఎండీ, ఎమ్మెల్సీ రవికిరణ్‌వర్మ, సూపరింటెండెంట్ వెంకట్రావులను కోరారు. మెడికల్ రికార్డులు నమోదు చేయాలని, అంగవైకల్యం పొందితే పింఛన్లు, ప్రభుత్వ పథకాలు అమల్లో ఇబ్బంది తలెత్తకుండా అవసరమైన అన్ని సర్టిఫికెట్లు జారీ చేయాలని జగన్ అధికారులకు సూచించారు. ఈ పర్యటనలో జగన్ వెంట వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కుడుపూడి చిట్టబ్బాయి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, చిర్ల జగ్గిరెడ్డి, దాడిశెట్టి రాజా, వంతల రాజేశ్వరి, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, పార్టీ సీఈసీ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్, సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, పార్టీ మహిళా విభాగం రాష్ర్ట కన్వీనర్ కొల్లి నిర్మలాకుమారి, కాకినాడ, రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ కో ఆర్డినేటర్లు చలమలశెట్టి సునీల్, బొడ్డు అనంత వెంకటరమణచౌదరి, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, పెండెం దొరబాబు, అల్లూరు కృష్ణంరాజు, కాకినాడ, రాజమండ్రి సిటీల అధ్యక్షులు ఆర్‌వీజేఆర్ కుమార్, బొమ్మన రాజ్‌కుమార్. కో ఆర్డినేటర్లు చెల్లుబోయిన వేణు, ఆకుల వీర్రాజు, కొండేటి చిట్టిబాబు, గుత్తుల సాయి, బొంతు రాజేశ్వరరావు, డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, రాష్ర్ట సేవాదళ్ కార్యదర్శి సుంకర చిన్ని, అనుబంధ కమిటీల కన్వీనర్లు కర్రి పాపారాయుడు, అనంత ఉదయభాస్కర్, శెట్టిబత్తుల రాజబాబు, మంతెన రవిరాజు, పంపన రామకృష్ణ, రావూరి వెంకటేశ్వరరావు, డాక్టర్ యనమదల మురళీకృష్ణ, నలమాటి లంకరాజు. పార్టీ రాష్ర్ట యూత్, మహిళా, రైతువిభాగం కమిటీ సభ్యులు తాడి విజయభాస్కరరెడ్డి, వసుంధర, జక్కంపూడితాతాజీ, జిల్లా అధికార ప్రతినిధులు పికె రావు,కొమ్మిశెట్టి బాలకృష్ణ, పార్టీ నాయకులు జక్కంపూడి రాజా, గుర్రం గౌతమ్, విప్పర్తి వేణుగోపాలరావు, మిండగుదిటి మోహన్, కొవ్వూరి త్రినాధరెడ్డి, ఆర్వి సత్యనారాయణ చౌదరి, సంగిశెట్టి అశోక్, సిరిపురపు శ్రీనివాసరావు, వట్టికూటి రాజశేఖర్ పాల్గొన్నారు. -
పండుల, వీహెచ్, హర్షలపై జనం కన్నెర్ర
కాకినాడలో మురళీమోహన్‌తో వాగ్వాదం మామిడికుదురు/ అమలాపురం (తూర్పు గోదావరి జిల్లా): గ్యాస్ పైపులైను పేలుడు ప్రాంతాన్ని సందర్శించేందుకు శనివారం నగరం గ్రామానికి వచ్చిన అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు, మాజీ ఎంపీ హర్షకుమార్, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావులపై జనం ఆగ్రహం ప్రదర్శించారు. ఎంపీ రవీంద్రబాబు తొలుత గ్రామాన్ని సందర్శించి, బాధితులను పరామర్శించగా స్థానికులు ప్రమాదం జరిగిన రోజే ఎందుకు రాలేదని నిలదీశారు. రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు, మాజీ ఎంపీ హర్షకుమార్ మధ్యాహ్నం వచ్చీరాగానే టీవీ చానళ్ల వారితో మాట్లాడుతూ పైపులైన్ల నిర్వహణ సక్రమంగా లేదని చమురు సంస్థలను విమర్శించారు. అప్పటికే వారిని చుట్ట్టుముట్టిన స్థానికులు... అధికారంలో ఉన్న పదేళ్లూ మీరేం చేశారంటూ హర్షకుమార్‌పై ధ్వజమెత్తారు. ‘గో బ్యాక్ హర్షకుమార్... డౌన్ డౌన్ హర్షకుమార్’ అంటూ 216 జాతీయ రహదారిపై కొద్దిసేపు ధర్నా చేశారు. కాకినాడ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించేందుకు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావుతో కలసి వచ్చిన రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ను బాధిత కుటుంబాలకు చెందిన వారు నిలదీశారు. -
‘గెయిల్’ అధికారులపై సెక్షన్ 304ఎ కేసు
ఉత్తరకోస్తా జిల్లాల ఐజీ అతుల్‌సింగ్ సాక్షి, రాజమండ్రి: నిర్లక్ష్యంగా వ్యవహరించి పలువురి ప్రాణాలు పోవడానికి కారకులైన ‘గెయిల్’ అధికారులపై సెక్షన్ 304ఎ కింద కేసు నమోదు చేసినట్టు ఉత్తరకోస్తా జిల్లాల ఐజీ అతుల్‌సింగ్ తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో శుక్రవారం గెయిల్ గ్యాస్ పైపులైన్ పేలి పలువురు మరణించగా, కోట్లాది రూపాయల ఆస్తి నష్టం వాటిల్లడం తెలిసిందే. ఐజీ సింగ్ రాజమండ్రి పోలీసు అతిథి గృహంలో శనివారం విలేకరులతో మాట్లాడుతూ విచారణ పూర్తయ్యాక అవసరమైతే సెక్షన్లు మారుస్తామన్నారు. అమలాపురం డీఎస్పీ ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. ఫొరెన్సిక్ నిపుణుల బృందాన్ని కూడా రప్పిస్తున్నట్టు తెలిపారు. విలేకరుల సమావేశంలో అర్బన్ జిల్లా ఎస్పీ టి.రవికుమార్‌మూర్తి, ఓఎస్డీ రమాదేవి, డీఎస్పీలు నామగిరి బాబ్జీ, ఉమాపతివర్మ, మురళీకృష్ణ పాల్గొన్నారు. -
మురుగు కాల్వలో దూకి తండ్రి.. ప్రహరీ దూకి కుమార్తెలు
అమలాపురం టౌన్ : గెయిల్ పైపులైన్ విస్ఫోటం నగరం గ్రామవాసులను ఇంకా వెన్నాడుతూనే ఉంది. చీకటి మాటు నుంచి మంటలు దూసుకువస్తుంటే.. అనేకమంది ప్రాణభీతితో దిక్కూదరీ ఎంచకుండా చెల్లాచెదురయ్యారు. ఇప్పుడిప్పుడే వారు మళ్లీ గ్రామానికి వస్తున్నారు. వీరిలో వాకా వీరాస్వామి కుటుంబం ఒకటి. శుక్రవారం ఉదయమే గ్రామానికి చెందిన వాకా వీరాస్వామి, కాండ్రేగుల సత్యనారాయణ, కొల్లాబత్తుల ఏసు కాలకృత్యాల కోసం వాడ్రేవుపల్లి డ్రెయిన్ ప్రాంతానికి వెళ్లారు. ఇంతలో పెద్ద శబ్దం వచ్చింది. ఆ వెంటనే పెద్ద ఎత్తున ఎగసిపడ్డ మంటలు రోడ్డు వైపు దూసుకువచ్చాయి. క్షణంలో మంటలు చుట్టుముడతాయనగా ముగ్గురూ మురుగు కాల్వలోకి దూకేశామని వీరాస్వామి చెప్పారు. మురుగు నీరైనా, కొద్దిసేపు భరించారు. ఊపిరాడకపోవడంతో చేసేది లేక కాల్వలోంచి ఒక్క ఉదుటున గట్టుపైకి వచ్చి కొబ్బరి తోటలకు అడ్డంపడి మంటలకు అందనంత దూరానికి పారిపోయారు. తమలాగే మరికొందరు కూడా మురుగుకాల్వలో దూకి ప్రాణాలు దక్కించుకున్నట్టు వీరాస్వామి చెప్పాడు. వీరాస్వామి కుమార్తెలు దుర్గ, నాగవేణిలు ఇంటి ప్రహరీ దూకి, ప్రాణాలు దక్కించుకున్నారు. పైపులైను పేలిన సమయంలో వారిద్దరూ ఇంట్లో నిద్రిస్తున్నారు. తండ్రి బయటకు వెళ్లినప్పుడు వారిద్దరూ గాఢనిద్రలో ఉన్నారు. ఇంటి ముఖ ద్వారం తలుపుల సందు నుంచి పొగలు రావడాన్ని దుర్గ గమనించింది. వెంటనే చెల్లిని లేపి కిటికీ తలుపులు తీసి చూసింది. ముఖద్వారానికి ఉన్న కర్టెన్ కాలిపోతూ కనిపించింది. ఇంటికెదురుగా ఉన్న పెంకుటింట్లోని వారు మంటల్లో చిక్కుకుని హాహాకారాలు చేస్తూ కనిపించారు. భీతావహులైన అక్కాచెల్లెళ్లు ఇంటి వెనుకే ఉన్న నగరం మార్కెట్ కమిటీ కార్యాలయం ప్రహారీని అతికష్టంపై దూకి గండం నుంచి బయటపడ్డారు. అప్పటికే వారి ఇంటిని అగ్నికీలలు చుట్టుముట్టాయి. ఇల్లు పాక్షికంగా కాలిపోయింది. తండ్రికి ఆసరాగా దుర్గ ఇంట్లోనే నిర్వహిస్తున్న ఫొటో స్టూడియో కెమెరాలు, ఇతర ఉపకరణాలు కాలిపోయాయి. -
ఎటు చూసినా బూడిద కుప్పలే
మరుభూమిలా మారిన నగరం సన్నిహితుల శవాలు, కాలిన ఇళ్లను చూసి విలపిస్తున్న గ్రామస్తులు అమలాపురం/ మామిడికుదురు/కాకినాడ క్రైం: ఎటు చూసినా పచ్చటి పొలాలు, గుబురు చెట్లు.. ఆకాశాన్నంటే కొబ్బరి తోటలు.. సెలయేర్లలో తామర, కలువ పూల హొయలు.. పాడి పశువులతో కళకళలాడే పశువుల కొట్టాలు.. పక్షుల కిలకిలారావాలు.. ప్రకృతికి పట్టుగొమ్మలా ఉండే నగరం గ్రామం మొన్నటి చిత్రమిది. నేడు.. అదో రగులుతున్న చితి. ప్రకృతిని వికృతిగా మార్చిన నిర్లక్ష్యానికి బలైన గ్రామం. చైనా డ్రాగన్‌లా బుసలుకొడుతూ విరుచుకుపడిన అగ్నిగోళాలకు గ్రామం మొత్తం మాడి మసైపోయింది. తెలతెలవారుతుండగా పక్షుల కిలకిలలతో నిద్ర లేవాల్సిన ఆ ప్రాంతం హాహాకారాలతో మిన్నంటింది. లేగదూడల పరుగులు, పశువుల పదఘట్టనలకు లేచే దుమ్ముతో, కమ్మని మట్టి వాసనతో దినచర్య మొదలెట్టాల్సిన గ్రామం అగ్నిగోళాల మధ్య చిక్కుకుని విలవిల్లాడింది. పల్లె జనం దిక్కూతెన్నూ తెలియకుండా పరుగులెత్తారు. శుక్రవారం గెయిల్ గ్యాస్ పైపు లైను సృష్టించిన విధ్వంసానికి గ్రామం గ్రామమే వల్లకాడులా మారింది. శనివారం ఆ గ్రామానికి వెళ్లిన వారికి అదో మరుభూమిలా కనిపించింది. ప్రకృతి సోయగం మాయమైంది. ఎటు చూసినా బూడిద కుప్పలే దర్శనమిచ్చాయి. కాలిపోయిన ఇళ్లు, మొండిగోడలే దర్శనమిస్తున్నాయి. నిండు గెలలతో ఉండాల్సిన కొబ్బరి చెట్లు ఇప్పుడు మాడిపోయి నల్లగా మారిపోయాయి. మసిబొగ్గులా మారిన పశువులు, పక్షులు అక్కడక్కడా పడి ఉన్నాయి. అక్కడక్కడా నిప్పు రగులుతూనే ఉంది. పెను మంటల్లో కాలిపోయిన దేహాల వాసన ఇంకా వస్తూనే ఉంది. పారిపోయి ప్రాణాలు దక్కించుకున్న వారు ఒక్కొక్కరుగా తిరిగి వస్తున్నారు. తమ వారి కోసం వెదుక్కుంటున్నారు. సన్నిహితులు, బంధువులు, తోటి గ్రామస్తులు మరణించిన విషయం తెలుసుకొని బోరుమంటున్నారు. కాలిపోయిన ఇళ్లు, విలువైన వస్తువులను చూసి కన్నీరుమున్నీరవుతున్నారు. తమ బతుకులేమిటంటూ కుమిలిపోతున్నారు. ఈ విషాదం తమ జీవితాల్లో మరువలేనిదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చికిత్స పొందుతున్న వారిలో మరో ఇద్దరి మృతి గెయిల్ గ్యాస్ పైపులైను పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వారిలో మరో ఇద్దరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 18కి పెరిగింది. పేలుడు జరిగిన శుక్రవారంనాడే 16 మంది మృత్యు వాత పడగా, 27 మంది తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. కాకినాడ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాయుడు సూర్యనారాయణ (20), మహమ్మద్ తక్వి (42) శనివారం మరణించారు. మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. కాకినాడ అపోలోలో చికిత్స పొందుతున్న కాశి చిన్నా, తాటికాయల రాజ్యలక్ష్మి, ట్రస్టు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వానరాశి వెంకటరత్నం, బోణం రత్నకుమారి, బోణం పెద్దిరాజు, సాయిసుధ ఆస్పత్రిలో ఉన్న రుద్ర సూరిబాబుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. పేలుడు ప్రాంతాన్ని పరిశీలించిన హైపవర్ కమిటీ గ్యాస్ పైపులైన్ పేలుడు ఘటనపై కేంద్ర ప్రభుత్వం నియమించిన ఉన్నతస్థాయి (హైపవర్) కమిటీ శనివారం నగరం గ్రామానికి వచ్చింది. ఘటనా స్థలాన్ని పరిశీలించింది. కేంద్ర పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి (రిఫైనరీల విభాగం) ఆర్.పి.సింగ్ నేతృత్వంలోని నలుగురు సభ్యులతో కూడిన ఈ బృందం పేలుడుకు దారి తీసిన పరిస్థితులపై ఆరా తీసింది. పేలుడు సంభవించిన ప్రాంతంలో మట్టి, పైపుల నమూనాలను సేకరిస్తోంది. ఈ కమిటీలో చమురు సంస్థల భద్రత డెరైక్టరేట్, జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్లకు చెందిన అధికారులున్నారు. జనావాసాల మధ్య నుంచి పైపులైన్ వెళ్లడంపై సింగ్ విస్మయం వ్యక్తంచేశారు. పేలుడుకు కారణాలను ఒకట్రెండు రోజుల్లో తేలుస్తామని ఆయన చెప్పారు. నష్టం అంచనాకు సర్వే బృందాలు పేలుడు వల్ల జరిగిన నష్టంపై పూర్తిస్థాయి అంచనాకు ప్రభుత్వం సర్వే బృందాలను నియమించింది. ఈ బృందాలు నష్టాన్ని అంచనా వేస్తున్నాయి. రెవెన్యూ శాఖకు చెందిన ఒక తహసీల్దారు, ఒక డిప్యూటీ తహసీల్దారు, ఆర్ఐ, హౌసింగ్, విద్యుత్, ఆరోగ్యం, ఇతర శాఖలకు చెందిన అధికారులతో ఆరు బృందాలను ఏర్పాటు చేశారు. పారిశుద్ధ్య నిర్వహణకు 50 మందితో ఐదు బృందాలను ఏర్పాటు చేశారు. -
రూ.కోటి పరిహారం ఇవ్వాలి: నగరంలో వైఎస్ జగన్ డిమాండ్
ఇది ముమ్మాటికీ మానవ తప్పిదమే పాతిక లక్షల పరిహారం సరిపోదు, విదేశాల్లో ఇస్తున్నట్టు భారీగా ఇవ్వాలి.. ఆయిల్ కంపెనీలకు భయం పుట్టేలా పరిహారం ఉండాలి పరిహారంగా ఎకరా కొబ్బరి తోటకు రూ. 20 లక్షలు, ప్రతి ఇంటికీ రూ. 30 లక్షలు, క్షతగాత్రులకు నెలకు రూ. 20 వేల పింఛన్ ఇవ్వాలి బాబు ఇప్పటికైనా కళ్లు తెరిచి కేజీ బేసిన్లో మన వాటా కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలి బాధితులకు వైఎస్సార్సీపీ అండగా ఉండి పోరాడుతుంది సాక్షి, కాకినాడ: ‘‘ఇది ముమ్మాటికీ మానవ తప్పిదమే. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే విదేశాల్లో మాదిరిగా ఆయిల్ కంపెనీలకు భయం పుట్టుకునేలా పరిహారం ఇప్పించాలి. ఒక్కసారి ఇతర దేశాలకు వెళ్లి చూడండి. అక్కడ ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మరోసారి పునరావృతం కాకుండా చూసేందుకు ఆ కంపెనీలకు, యాజమాన్యాలకు భయం కల్పించేందుకు వాళ్లు ఇస్తున్న పరిహారం లెక్క చూడండి. నగరం దుర్ఘటనలో మృతి చెందినవారి కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఎంత మాత్రం సరిపోదు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే గెయిల్‌కు కాని, ఓఎన్జీసీకి కాని ఒంట్లో భయం పుట్టాలంటే కనీసం కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా. మృతుల కుటుంబాలనే కాదు.. కాలిపోయి ఏ మాత్రం పనులు కూడా చేసుకోలేని వారి కుటుంబాలను అన్నివిధాలా ఆదుకోవాలి’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, శాసనసభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పటికైనా కళ్లు తెరచి, కేజీ బేసిన్లో మనకు రావాల్సిన వాటా కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరంలో పైపులైన్ పేలుడు ప్రాంతాన్ని శనివారం పరిశీలించి, బాధితులను పరామర్శించిన జగన్ అనంతరం మీడియాతో మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. ఇది ముమ్మాటికీ మానవ తప్పిదం. ఈ ప్రాంతంలో ఇది తొలిసారి జరిగింది కాదు. ఇక్కడి ప్రజలు దాదాపు సంవత్సరం నుంచి అడపాదడపా కంప్లయింట్ చేస్తూనే ఉన్నారు. గెయిల్ వాళ్లు అప్పటికప్పుడు వచ్చి కాస్త తవ్వి, కాస్త సిమెంట్ వేసి మరమ్మతు అయిపోయిందని వదిలేస్తున్నారు. గ్యాస్ ఒక మేఘంలా దాదాపు 300 మీటర్ల విస్తీర్ణంలో కమ్ముకుని... ఒకరు వంట చేసుకునేందుకు పొయ్యి వెలిగిస్తే ఊరంతా బాంబులా పేలిందంటే... పరిస్థితి ఎంత భయానకంగా ఉందో చెప్పనవసరం లేదు. గెయిల్, ఓఎన్జీసీ.. కంపెనీ ఏదైతేనేం ఇక్కడనుంచి వస్తున్న గ్యాస్ ద్వారా రూ.వేలకోట్లు సంపాదిస్తున్నాయి. కానీ స్థానిక ప్రజలకు, పరిసర ప్రాంతాలకు, పర్యావరణానికి ఏ రకంగా న్యాయం చేస్తున్నామనేది కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఆలోచన చేయాలి. గ్యాస్ వల్ల ఏ నష్టం జరిగినా మన రాష్ట్రానికే. ఆఫ్‌షోర్‌లో సముద్రం లోపల డ్రిల్లింగ్ చేస్తే కిలోమీటర్.. రెండున్నర కిలోమీటర్ల మేరకు డ్రిల్లింగ్ చేస్తారు. చేసినప్పుడు దాని సిస్మిక్ యాక్టివిటీ వల్ల నష్టం జరిగేది మన ప్రాంతానికే. గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ మెకానిజమ్‌లో పొరపాట్లు జరిగితే ప్రాణాలు కోల్పోయేది.. నష్టం జరిగేది మన ప్రాంతానికే. కానీ ఆ గ్యాస్ వల్ల మనకెలాంటి లాభం లేకపోవడం బాధ కలిగిస్తుంది. ఆఫ్‌షోర్‌లో డ్రిల్లింగ్ జరిగితే కాస్తో కూస్తో ఏదో శనక్కాయలు వేసినట్టుగా రాయల్టీ ఇస్తారు. ఆన్‌షోర్ డ్రిల్లింగ్ జరిగితే అదీ రాదు. బొగ్గు ఉత్పత్తి చేసే సింగరేణి కాలరీస్‌లో కేంద్రానికి 50 శాతం, రాష్ట్రానికి 50 శాతం వాటా. రాష్ట్రాన్ని విడగొట్టిన తర్వాత సింగరేణి కాలరీస్‌లో మనకు రావాల్సిన వాటా పూర్తిగా తీసేశారు. రాష్ట్రంలో గ్యాస్ పుష్కలంగా ఉందనుకుంటే... మన రాష్ర్టం అవసరాలకు మాత్రం ఒక్క రవ్వ కూడా గ్యాస్ ఇవ్వరు. నష్టాలు మనకు, లాభాలు పరాయి రాష్ట్రాలకు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కళ్లుతెరవాలి. కేజీ బేసిన్లో కేంద్రం నుంచి మన రాష్ట్రానికి రావాల్సిన వాటా అడిగి తీసుకోవాలి. ఈ మేరకు డబ్బులు మనకు వస్తే గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ మీద మనకు కంట్రోల్ వస్తుంది. మన రాష్ర్ట అవసరాలను మనం తీర్చుకునే అవకాశం వస్తుంది. సరసమైన ధరలకు మనవాళ్లకు మనం గ్యాస్ ఇవ్వవచ్చు. ఈ ప్రాంతంలో ఏమైనా నష్టాలు జరిగితే మన వాటా ప్రకారం వచ్చిన వేలకోట్లలో కొంత ఇక్కడ ప్రజలకు.. ఇక్కడి అవసరాలకు.. ఇక్కడి పర్యావరణ పరిరక్షణకు, ఇక్కడ నష్టం జరగకుండా చూసుకునేందుకు ఖర్చు చేసుకోవచ్చు. నాకందిన సమాచారం మేరకు 20 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. మరో 25 మందికి పైగా తీవ్రంగా గాయపడి ఆస్పత్రుల్లో ఉన్నారు. వారికి ముష్టి వేసినట్టుగా కేవలం 25 లక్షలు రూపాయలు ఇచ్చి దులుపుకుంటున్నారు. ఇందులో గెయిల్, కేంద్రం 20 లక్షలు, పీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రెండు లక్షలు, రాష్ర్ట ప్రభుత్వం 3 లక్షలు ముష్టిలా ఇస్తారట. శరీరం పూర్తిగా కాలిపోయి మున్ముందు ఎలాంటి పనులు చేసుకోలేని వారికి రూ.5 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటారట. ఇంతకన్నా దారుణం ఏముంది? మనిషి ప్రాణం విలువ 25 లక్షలేనా? గెయిల్, ఓఎన్జీసీ, కేంద్ర ప్రభుత్వం, చంద్రబాబు కాస్త మానవతా దృక్పథంలో ఆలోచించాలి. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలి. తీవ్రంగా గాయపడిన వారికి ప్రతినెలా కనీసం రూ.20 వేలు పింఛన్ వచ్చేటట్టు చర్యలు తీసుకోవాలి. ఇక పంట పొలాలను ఒక్కసారి చూడండి. పచ్చని కొబ్బరిచెట్లు నిలువెల్లా మాడిపోయాయి. కాలిపోయిన కొబ్బరి చెట్లు పూర్తిగా తొలగించి కొత్త చెట్లు వేయాలి. వాటిని ఈ స్థాయికి వచ్చే వరకూ కాపాడుకోవాలి. మరోసారి ఇలాంటి ఘటన జరగకుండా చూసుకునేందుకు ఎకరాకు కనీసం అంటే రూ.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్లకు కనీసం పదిహేను లక్షలు.. రెండు ఫ్లోర్లున్న వారికి కనీసంగా రూ.30 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలి. అలాగే ఇళ్లు లేని వారికి ప్రభుత్వమే ఇళ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా. ఈ గ్యాస్ కలెక్షన్ పాయింట్లన్నీ ఊళ్లకు దూరంగా షిఫ్ట్ చేయాలి. మొత్తంగా కొత్త పైపులైన్ వేసి ఈ ప్రాంత ప్రజలకు భద్రత కల్పించాలి. బాధితులకు మా పార్టీ అండగా ఉంటుంది. మా ఎంపీలు కేంద్ర ప్రభుత్వంతో పాటు గెయిల్, ఓఎన్జీసీ, పెట్రోలియం మంత్రులను కలిసి ఒత్తిడి తీసుకొస్తారు. అండగా ఉంటాం: జగన్ సాక్షి, కాకినాడ: ధైర్యంగా ఉండండి.. త్వరలోనే కోలుకుంటారు.. మీకు అండగా నేను ఉంటానంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నగరం గ్యాస్ ప్రమాద బాధితులకు ధైర్యం చెప్పారు. హైదరాబాద్ నుంచి విమానంలో శనివారం మధ్యాహ్నం ఒంటిగంటన్నరకు మధురపూడి చేరుకున్న జగన్ నేరుగా మామిడికుదురు మండలం నగరం చేరుకొని ఘటనాప్రాంతాన్ని పరిశీలించారు. సంఘటన జరిగిన తీరును స్థానికులు, ప్రత్యక్షసాక్షులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో మృతుల కుటుంబాలను పరామర్శించారు. దాదాపు రెండుగంటలపాటు గ్రామంలోనే ఉండి విస్ఫోటం సృష్టించిన విధ్వంసాన్ని పరిశీలించి చలించిపోయారు. అనంతరం అమలాపురం చేరుకుని అక్కడి కిమ్స్ ఆస్పత్రిలో, ఆ తర్వాత కాకినాడ చేరుకొని అపోలో, ట్రస్ట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు.