ఆర్‌ఎఫ్‌సీఎల్ వద్ద ఐవోసీ గ్యాస్ స్టేషన్
ఫెర్టిలైజర్‌సిటీ(రామగుండం): రాష్ట్రంలో తొలిసారిగా ఇంటింటికీ పైపులైన్ ద్వారా గ్యాస్ సరఫరా చేసేందుకు చేపడుతున్న పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దీన్ని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. తొలిదశలో పెద్దపెల్లి జిల్లాలోని ఆర్‌ఎఫ్‌సీఎల్ టౌన్‌షిప్, రామగుండం కార్పొరేషన్ 39వ డివిజన్‌లోని గౌతమినగర్, శాంతినగర్‌లలో ఇంటింటికీ గ్యాస్ సరఫరా చేసేందుకు పైపులైన్ నిర్మాణ పనులు పూర్తి చేశారు. ఎన్టీపీసీ టౌన్‌షిప్, సింగరేణి ఇతర ప్రాంతాల్లో పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఆర్‌ఎఫ్‌సీఎల్ టౌన్‌షిప్, శాంతినగర్, గౌతమినగర్‌లో ఇంటింటికీ గ్యాస్ కనెక్షన్ కోసం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) వినియోగదారులకు రూ.618లతో రిజిస్ట్రేషన్ ప్రారంభించారు. ఈ ఫీజు చెల్లించిన వినియోగదారుల ఇళ్లకు గ్యాస్ మీటర్లు బిగించారు. ఆగస్టు 1 నాటికి ఇంటింటికీ గ్యాస్ సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.
మూడు జిల్లాల్లో పనులు పూర్తి..
రాష్ట్రంలోని గ్యాస్ ఆధారిత భారీ, చిన్న తరహా పరిశ్రమలకు పైపులైన్ ద్వారా గ్యాస్ సరఫరాతో మేలు జరుగుతుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాలకు సరఫరా చేసేందుకు పైపులైన్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. వీటితోపాటు సీఎన్‌జీ బంకులను అందుబాటులోకి తీసుకురానున్నారు. మల్లవరం పోర్టు నుంచి పైపులైన్ ద్వారా రామగుండం ఫెర్టిలైజర్ కెమికల్ లిమిటెడ్ కర్మాగారంలోని గ్యాస్ స్టేషన్‌కు ఇప్పటికే గ్యాస్ సరఫరా అవుతోంది. నూతనంగా నిర్మించిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ స్టేషన్‌కు గ్యాస్ తరలింపుపై ట్రయల్ రన్ నిర్వహించారు.
లీకేజీ అవకాశాలు తక్కువ..
ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్‌తో పోలిస్తే పైపులైన్ ద్వారా సరఫరా అయ్యే గ్యాస్ ధర 30 శాతం వరకు తక్కువగా ఉండనుంది. పైపులైన్ ద్వారా వచ్చే గ్యాస్ బరువు తక్కువగా ఉండటంతో లీకేజీ, అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశాలు తక్కువ. వినియోగదారుల ఇళ్లకు మీటర్లు బిగించి, యూనిట్ల ఆధారంగా బిల్లు వసూలు చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment