
టీడీపీలో మిర్చి చిచ్చు
⇔జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఎదుటే మాటల యుద్ధం
⇔గుంటూరు ఏఎంసీ చైర్మన్ విషయంలో గరంగరం
⇔ఎమ్మెల్యే మోదుగుల, బోనబోయిన మధ్య వాగ్వాదం
⇔వెన్నాకే ఇవ్వాలని కోరిన వేణుగోపాల్‌రెడ్డి
⇔అభ్యంతరం చెప్పిన బోనబోయిన
కొరిటెపాడు(గుంటూరు): టీడీపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ చిచ్చురేపింది. గుంటూరు మిర్చిఘాటును జిల్లా ఇన్‌చార్జి మంత్రి, ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పకు జిల్లా నాయకులు రుచి చూపించారు. నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఎమ్మెల్యే మోదుగుల, టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు, ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్రకుమార్, నక్కా ఆనందబాబు, రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి మన్నవ సుబ్బారావు, పార్టీ నాయకులు బోనబోయిన ఇతర నాయకులతో శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో చినరాజప్ప సమావేశం నిర్వహించారు.
పార్టీని నమ్ముకున్న వారికి పదవులు ఇవ్వాలి: మోదుగుల
ప్రధానంగా గుంటూరు మిర్చియార్డు చైర్మన్ పదవిని భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు చినరాజప్ప నాయకులకు తెలిపారు. దీనికి గాను పేరును సూచించాలని ఆయన నాయకులను కోరారు. ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి ఏఎంసీ ఛైర్మన్ పోస్టుకు వెన్నా సాంబశివారెడ్డి పేరును ప్రతిపాదించారు. దీంతో టీడీపీ నగర అధ్యక్షుడు బోనబోయిన శ్రీనివాస్‌యాదవ్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ పోస్టు నాలుగు నియోజకవర్గాల నేతలకు సంబంధించిందని, ఒక్క పేరే ఎలా సూచిస్తారని ప్రశ్నించారు. దీనికి మోదుగుల సమాధానం చెబుతూ పార్టీ కష్టకాలంలో సైతం అండగా నిలబడటమే కాకుండా, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణపై రెండుసార్లు పోటీచేసి ఆర్థికంగా వెన్నా సాంబశివారెడ్డి చితికిపోయారని తెలిపారు. కాంగ్రెస్‌పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా పార్టీ మారకుండా చిత్తశుద్ధితో పార్టీ కోసం పనిచేశారన్నారు. అదే సమయంలో ప్రత్తిపాడుకు ప్రత్యేకంగా మార్కెట్ కమిటీ ఉందని, ఏఎంసీ పశ్చిమ నియోజకవర్గంలో పరిధిలో ఉన్నందున నా అభిప్రాయం తీసుకోవాల్సిందే అన్నారు.
నలుగురి పేర్లు పరిగణలోకి తీసుకోవాలి: బోనబోయిన
దీంతో మరింత రెచ్చిపోయిన బోనబోయిన పార్టీలో ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు వ్యవహరిస్తున్నారని, యార్డు పదవులకు నాలుగురి పేర్లు పరిగణలోనికి తీసుకోవాల్సిందే అని పట్టుబట్టారు. దీంతో మోదుగుల, బోనబోయినల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. పార్టీని నమ్ముకున్న వారికి పదవులు ఇవ్వకుంటే అన్యాయం చేసినట్లే అని మోదుగుల తీవ్రంగా స్పందించారు. దీంతో ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప కలుగజేసుకొని వారి ఇద్దరికీ సర్దిచెప్పారు. చివరికి వెన్నా సాంబశివారెడ్డితో పాటు జిల్లా అధ్యక్షుడు ఎవరి పేరైనా సూచిస్తే అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. ఇదేసమయంలో వెన్నాకు మద్దతుగా పార్టీలోని నాయకులు ముఖ్యమంత్రికి వినతిపత్రం అందజేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. బోనబోయిన వ్యవహరశైలిపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయానికి వచ్చారు. రెండు, మూడు రోజుల్లో పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసి జిల్లాలో భర్తీచేసే నామినేటెడ్ పోస్టులకు పేర్లను ఇవ్వాలని మోదుగుల, ఇతర నాయకులు నిర్ణయించారు. ఏది ఏమైనా చలికాలంలో టీడీపీలో మిర్చియార్డు చైర్మన్ పదవి కాక రేపుతోంది.