కాపు సామాజికవర్గానికి వస్తున్న ఎస్‌ఎంఎస్‌లు
ఎస్‌ఎంఎస్‌లతో మంత్రుల వేడుకోలు
అమలాపురం: ‘ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల హామీని నెరవేర్చి కాపులను బీసీల్లో చేరుస్తాం. ఎన్నో ఏళ్లుగా తెగని సమస్యకు చిత్తశుద్ధితో పరిష్కారం చెబుతాం. మాకు కాపుల మద్దతు ఎప్పుడూ ఉంది. రిజర్వేషన్లు కల్పించి కాపుల రుణం తీర్చుకోవడమే మా విద్యుక్తధర్మం. విపక్ష నేత కుట్రలో భాగం కావద్దు. ఆలోచించండి’ అంటూ రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్న కాపు మంత్రులు ఎస్‌ఎంఎస్‌లతో వేడుకుంటున్నారు. మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, గంటా శ్రీనివాసరావు, నారాయణ, కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామాంజనేయులు పేర్లతో శుక్రవారం ఉదయం నుంచి ఎస్‌ఎంఎస్‌లు వెల్లువలా వచ్చిపడుతున్నాయి.
మరోవైపు బీసీల సంక్షేమానికి పాటుపడతామని, కాపుల రిజర్వేషన్లతో బీసీలకు ఎటువంటి ఇబ్బందీ లేదని ఆ సామాజికవర్గానికి చెందిన మంత్రి అయ్యన్నపాత్రుడు వంటివారి పేరిట ఎస్‌ఎంఎస్‌లు వస్తున్నాయి. రిజర్వేషన్లు ఇస్తారా, ఇస్తే ఎప్పుడు ఇస్తారనేది చెప్పకుండా ఈ ప్రచారం గోలేమిటని ఆయా వర్గాలు మండిపడుతున్నాయి.