రుణాలు ఎగ్గొట్టిన కేసులో టీడీపీ ఎమ్మెల్యేకు బ్యాంకు ఝలక్
మొత్తం రూ.390 కోట్ల రికవరీకి చర్యలు
ఇప్పటికే పలుమార్లు నోటీసులిచ్చిన ఇండియన్ బ్యాంకు
అయినా స్పందించని గంటా, ఆయన బంధువులు
ఆగస్టు 8న ఆస్తులు వేలం వేస్తామని బ్యాంకు ప్రకటన జారీ
సాక్షి, విశాఖపట్నం: మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆయన బంధువులు రూ.వందల కోట్ల మేర రుణాలను ఎగ్గొట్టిన కేసులో వారికి అప్పులిచ్చిన ఇండియన్ బ్యాంకు ఆస్తుల వేలానికి ఉపక్రమించింది. రుణాలను వడ్డీతో సహా వసూలు చేసుకునేందుకు వరుసగా డిమాండ్ నోటీసులు జారీచేసినా గంటా బ్యాచ్ పట్టించుకోకపోవడంతో తనఖా పెట్టిన వాటిలో పలు ఆస్తులను ఇప్పటికే స్వాధీనం చేసుకున్న బ్యాంకు వాటి వేలానికి రంగం సిద్ధంచేసి అందుకు సంబంధించిన తేదీని తాజాగా ప్రకటించింది. గంటా రుణాల ఎగవేత కేసులకు సంబంధించిన వివరాలు ఏమిటంటే..
విశాఖపట్నం వన్‌టౌన్‌లోని లక్ష్మీటాకీస్ వద్ద ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో మాన్యుఫ్యాక్చరింగ్, మిషనరీ అండ్ ఎక్విప్‌మెంట్ కార్యకలాపాల కోసం రిజిస్ట్రేషన్ నం.047165తో 2005 ఆగస్టు 18న రిజిస్ట్రర్ అయ్యింది. రూ.500 కోట్ల ఆథరైజ్డ్ క్యాపిటల్, రూ.240.671 కోట్ల పెయిడ్ అప్ కాపిటల్‌తో ఈ సంస్థ ఏర్పడింది. కంపెనీలో యాక్టివ్ డైరెక్టర్లుగా గంటా తోడల్లుడైన పరుచూరి వెంకట భాస్కరరావు, ఆయన సోదరులు రాజారావు, వెంకయ్య, ప్రభాకరరావు ఉన్నారు.
ఈ కంపెనీకి భీమిలి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో పాటు కొండయ్య, బాలసుబ్రహ్మణ్యం, నార్నే అమూల్యలు హామీదారులుగా ఉన్నారు. కంపెనీ విస్తరణ పేరుతో డాబా గార్డెన్స్ శారదా వీధిలో ఉన్న ఇండియన్ బ్యాంకు నుంచి రుణాలు పొందారు. ఇవి పొందినప్పటి నుంచి ఒక్క వాయిదా కూడా చెల్లించలేదు. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరి 29 నాటికి ఒక దఫా తీసుకున్న రుణం తాలుకా బకాయిలు అక్షరాలా రూ.390.58 కోట్లుగా బ్యాంకు అధికారులు లెక్కగట్టారు. మరో దఫా రుణానికి సంబంధించి వడ్డీతో కలిసి రూ.141.68 కోట్లు బకాయిలుగా పేరుకుపోయాయని ఇండియన్ బ్యాంకు జారీచేసిన నోటీసుల్లో పేర్కొంది.
నోటీసులిచ్చినా బేఖాతరు.. ఆస్తుల స్వాధీనం..
ఈ నేపథ్యంలో.. 2016 అక్టోబరు 4 నుంచి పలు దఫాలుగా బ్యాంకు అధికారులు నోటీసులు జారీచేసి వడ్డీతో సహా కలిపి బకాయిలు చెల్లించాలని కోరారు. అయినాసరే ఒక్క రూపాయి కూడా చెల్లించకపోవడం.. మరోపక్క గడువు ముగియడంతో బ్యాంకు ఆస్తులు స్వాధీనం చేసుకోవడం మొదలుపెట్టింది. అయినప్పటికీ గంటా ముందుకు రాకపోవడం.. బకాయిలు చెల్లించకపోవడంతో మరోసారి ఏడు స్లాట్స్‌లో పూచీకత్తుగా పెట్టిన మరికొన్ని స్థలాల్ని స్వాధీనం చేసుకుంటున్నట్లు ఈ ఏడాది మార్చి 18న బ్యాంకు నోటీసులు జారీచేసింది.
ప్రత్యూష కంపెనీకి చెందిన ఆస్తులు, కంపెనీ డైరెక్టర్లయిన పరుచూరి వెంకట భాస్కరరావు, రాజారావు, వెంకయ్య ప్రభాకరరావుల ఆస్తులతో పాటుగా కంపెనీకి హామీదారులుగా ఉన్న మంత్రి గంటా శ్రీనివాసరావు, కేబీ సుబ్రహ్మణ్యం, అమూల్య ఆస్తులను కూడా స్వాధీనం చేసుకోవడంతో పాటు మరికొన్ని ఆస్తుల వేలం వేస్తున్నట్లు బ్యాంకు ప్రకటన జారీచేసింది. కాగా, గతంలోనే బ్యాంకు కొన్ని ఆస్తులను వేలం వేయగా.. ఇప్పుడు రూ.390 కోట్ల రికవరీకి బ్యాంకు మరిన్ని ఆస్తుల వేలం ప్రకటన జారీచేసింది.
ఆగస్టు 8న ఈ–వేలం..
ఈ ప్రకటనలో.. పద్మనాభం మండలం ఐనద గ్రామం వద్ద ఉన్న సర్వేనెం.12లో వీరికి స్టార్ విలేజ్ పేరున వుడా లేఅవుట్‌లోని 5,326.54 చ.గజాల విస్తీర్ణంలో ఏడు స్లాట్స్‌లో ఉన్న 33 ప్లాట్లను స్వాధీనం చేసుకుంటున్నట్లు నోటీసుల్లో స్పష్టంచేసింది. వీటి విషయంలో ఎలాంటి లావాదేవీలు జరపడానికి వీల్లేదని, బ్యాంకు హెచ్చరిక జారీచేసింది. అదేవిధంగా రూ.390.58 కోట్ల బకాయిలు రాబట్టుకునేందుకు గతంలో స్వాధీనం చేసుకున్న స్థిరాస్తుల విక్రయానికి కూడా మార్చి 18న బ్యాంకు మరోసారి నోటీసులు జారీచేసింది. దీనికి సంబంధించిన వేలం ప్రక్రియ కూడా నిర్వహిస్తున్నట్లు పత్రికల్లో శనివారం ఇండియన్ బ్యాంకు ప్రకటనలిచ్చింది.
మెస్సర్స్ ప్రత్యూష అసోసియేట్స్ పేరుతో నగరంలోని గంగులవారి వీధిలో ఉన్న 274.65 చ.గజాల వాణిజ్య భవనం వేలం వేస్తున్నట్లు ప్రకటించింది. దీనికి రిజర్వ్ ధరగా రూ.2.56 కోట్లుగా నిర్ణయించింది. దీంతో పాటు ద్వారకానగర్‌లోని అదే సంస్థ పేరుతో శ్రీశాంత కాంప్లెక్స్‌లో ఉన్న ప్లాట్ నం.138సీ లోని 2,500 చ.గజాల విస్తీర్ణంగల రెండు ప్లాట్లను వేలం వేస్తున్నట్లు ప్రకటించారు. వీటికి రిజర్వ్ ధరగా 1.26 కోట్లుగా నిర్ణయించారు. ఎక్కడ ఎలా ఉన్నది అక్కడ అలా.. ప్రాతిపదికన వేలంలో విక్రయిస్తామని బ్యాంకు వెల్లడించింది. ఆగస్టు 8వ తేదీన గంటా అండ్ కో ఆస్తుల ఈ–వేలం పాట జరుగుతుందని ఇండియన్ బ్యాంకు పేర్కొంది.
సంస్థకు డైరెక్టర్‌గా గంటా..
నిజానికి.. పోర్టులో వ్యాపార లావాదేవీల కోసం ఎమ్మెల్యే గంటా స్వయంగా తన బంధువులతో కలిసి ఈ కంపెనీ ప్రారంభించారని.. మొదట్లో గంటా కూడా డైరెక్టర్‌గా కొంతకాలం కొనసాగారని తెలుస్తోంది. ఈ కంపెనీకే జిల్లా గ్రంథాలయ సంస్థ నిర్మాణ బాధ్యతలను అప్పగించగా.. వ్యతిరేకత వ్యక్తంకావడంతో అప్పటి టీడీపీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఈ నేపథ్యంలో.. గంటా శ్రీనివాసరావుతో పాటు ఆయన బంధువుల ఆస్తుల్ని వేలం వేస్తున్నట్లు బ్యాంకు ప్రకటించడం చర్చనీయాంశమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment