bank loan defaulters
-
‘గంటా’ ఆస్తుల వేలం!
సాక్షి, విశాఖపట్నం: మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆయన బంధువులు రూ.వందల కోట్ల మేర రుణాలను ఎగ్గొట్టిన కేసులో వారికి అప్పులిచ్చిన ఇండియన్ బ్యాంకు ఆస్తుల వేలానికి ఉపక్రమించింది. రుణాలను వడ్డీతో సహా వసూలు చేసుకునేందుకు వరుసగా డిమాండ్ నోటీసులు జారీచేసినా గంటా బ్యాచ్ పట్టించుకోకపోవడంతో తనఖా పెట్టిన వాటిలో పలు ఆస్తులను ఇప్పటికే స్వాధీనం చేసుకున్న బ్యాంకు వాటి వేలానికి రంగం సిద్ధంచేసి అందుకు సంబంధించిన తేదీని తాజాగా ప్రకటించింది. గంటా రుణాల ఎగవేత కేసులకు సంబంధించిన వివరాలు ఏమిటంటే..విశాఖపట్నం వన్‌టౌన్‌లోని లక్ష్మీటాకీస్ వద్ద ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో మాన్యుఫ్యాక్చరింగ్, మిషనరీ అండ్ ఎక్విప్మెంట్ కార్యకలాపాల కోసం రిజిస్ట్రేషన్ నం.047165తో 2005 ఆగస్టు 18న రిజిస్ట్రర్ అయ్యింది. రూ.500 కోట్ల ఆథరైజ్డ్ క్యాపిటల్, రూ.240.671 కోట్ల పెయిడ్ అప్ కాపిటల్‌తో ఈ సంస్థ ఏర్పడింది. కంపెనీలో యాక్టివ్ డైరెక్టర్లుగా గంటా తోడల్లుడైన పరుచూరి వెంకట భాస్కరరావు, ఆయన సోదరులు రాజారావు, వెంకయ్య, ప్రభాకరరావు ఉన్నారు. ఈ కంపెనీకి భీమిలి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో పాటు కొండయ్య, బాలసుబ్రహ్మణ్యం, నార్నే అమూల్యలు హామీదారులుగా ఉన్నారు. కంపెనీ విస్తరణ పేరుతో డాబా గార్డెన్స్ శారదా వీధిలో ఉన్న ఇండియన్ బ్యాంకు నుంచి రుణాలు పొందారు. ఇవి పొందినప్పటి నుంచి ఒక్క వాయిదా కూడా చెల్లించలేదు. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరి 29 నాటికి ఒక దఫా తీసుకున్న రుణం తాలుకా బకాయిలు అక్షరాలా రూ.390.58 కోట్లుగా బ్యాంకు అధికారులు లెక్కగట్టారు. మరో దఫా రుణానికి సంబంధించి వడ్డీతో కలిసి రూ.141.68 కోట్లు బకాయిలుగా పేరుకుపోయాయని ఇండియన్ బ్యాంకు జారీచేసిన నోటీసుల్లో పేర్కొంది. నోటీసులిచ్చినా బేఖాతరు.. ఆస్తుల స్వాధీనం..ఈ నేపథ్యంలో.. 2016 అక్టోబరు 4 నుంచి పలు దఫాలుగా బ్యాంకు అధికారులు నోటీసులు జారీచేసి వడ్డీతో సహా కలిపి బకాయిలు చెల్లించాలని కోరారు. అయినాసరే ఒక్క రూపాయి కూడా చెల్లించకపోవడం.. మరోపక్క గడువు ముగియడంతో బ్యాంకు ఆస్తులు స్వాధీనం చేసుకోవడం మొదలుపెట్టింది. అయినప్పటికీ గంటా ముందుకు రాకపోవడం.. బకాయిలు చెల్లించకపోవడంతో మరోసారి ఏడు స్లాట్స్‌లో పూచీకత్తుగా పెట్టిన మరికొన్ని స్థలాల్ని స్వాధీనం చేసుకుంటున్నట్లు ఈ ఏడాది మార్చి 18న బ్యాంకు నోటీసులు జారీచేసింది. ప్రత్యూష కంపెనీకి చెందిన ఆస్తులు, కంపెనీ డైరెక్టర్లయిన పరుచూరి వెంకట భాస్కరరావు, రాజారావు, వెంకయ్య ప్రభాకరరావుల ఆస్తులతో పాటుగా కంపెనీకి హామీదారులుగా ఉన్న మంత్రి గంటా శ్రీనివాసరావు, కేబీ సుబ్రహ్మణ్యం, అమూల్య ఆస్తులను కూడా స్వాధీనం చేసుకోవడంతో పాటు మరికొన్ని ఆస్తుల వేలం వేస్తున్నట్లు బ్యాంకు ప్రకటన జారీచేసింది. కాగా, గతంలోనే బ్యాంకు కొన్ని ఆస్తులను వేలం వేయగా.. ఇప్పుడు రూ.390 కోట్ల రికవరీకి బ్యాంకు మరిన్ని ఆస్తుల వేలం ప్రకటన జారీచేసింది.ఆగస్టు 8న ఈ–వేలం..ఈ ప్రకటనలో.. పద్మనాభం మండలం ఐనద గ్రామం వద్ద ఉన్న సర్వేనెం.12లో వీరికి స్టార్ విలేజ్ పేరున వుడా లేఅవుట్లోని 5,326.54 చ.గజాల విస్తీర్ణంలో ఏడు స్లాట్స్‌లో ఉన్న 33 ప్లాట్లను స్వాధీనం చేసుకుంటున్నట్లు నోటీసుల్లో స్పష్టంచేసింది. వీటి విషయంలో ఎలాంటి లావాదేవీలు జరపడానికి వీల్లేదని, బ్యాంకు హెచ్చరిక జారీచేసింది. అదేవిధంగా రూ.390.58 కోట్ల బకాయిలు రాబట్టుకునేందుకు గతంలో స్వాధీనం చేసుకున్న స్థిరాస్తుల విక్రయానికి కూడా మార్చి 18న బ్యాంకు మరోసారి నోటీసులు జారీచేసింది. దీనికి సంబంధించిన వేలం ప్రక్రియ కూడా నిర్వహిస్తున్నట్లు పత్రికల్లో శనివారం ఇండియన్ బ్యాంకు ప్రకటనలిచ్చింది. మెస్సర్స్ ప్రత్యూష అసోసియేట్స్ పేరుతో నగరంలోని గంగులవారి వీధిలో ఉన్న 274.65 చ.గజాల వాణిజ్య భవనం వేలం వేస్తున్నట్లు ప్రకటించింది. దీనికి రిజర్వ్ ధరగా రూ.2.56 కోట్లుగా నిర్ణయించింది. దీంతో పాటు ద్వారకానగర్‌లోని అదే సంస్థ పేరుతో శ్రీశాంత కాంప్లెక్స్‌లో ఉన్న ప్లాట్ నం.138సీ లోని 2,500 చ.గజాల విస్తీర్ణంగల రెండు ప్లాట్లను వేలం వేస్తున్నట్లు ప్రకటించారు. వీటికి రిజర్వ్ ధరగా 1.26 కోట్లుగా నిర్ణయించారు. ఎక్కడ ఎలా ఉన్నది అక్కడ అలా.. ప్రాతిపదికన వేలంలో విక్రయిస్తామని బ్యాంకు వెల్లడించింది. ఆగస్టు 8వ తేదీన గంటా అండ్ కో ఆస్తుల ఈ–వేలం పాట జరుగుతుందని ఇండియన్ బ్యాంకు పేర్కొంది.సంస్థకు డైరెక్టర్‌గా గంటా..నిజానికి.. పోర్టులో వ్యాపార లావాదేవీల కోసం ఎమ్మెల్యే గంటా స్వయంగా తన బంధువులతో కలిసి ఈ కంపెనీ ప్రారంభించారని.. మొదట్లో గంటా కూడా డైరెక్టర్‌గా కొంతకాలం కొనసాగారని తెలుస్తోంది. ఈ కంపెనీకే జిల్లా గ్రంథాలయ సంస్థ నిర్మాణ బాధ్యతలను అప్పగించగా.. వ్యతిరేకత వ్యక్తంకావడంతో అప్పటి టీడీపీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఈ నేపథ్యంలో.. గంటా శ్రీనివాసరావుతో పాటు ఆయన బంధువుల ఆస్తుల్ని వేలం వేస్తున్నట్లు బ్యాంకు ప్రకటించడం చర్చనీయాంశమవుతోంది. -
కార్వీ సంస్థ సీఎండీ పార్థసారథి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: కార్వీ స్టాక్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సి.పార్థసారథిని హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. రెండు బ్యాంకులకు రూ.484 కోట్లు ఎగవేసిన ఆరోపణలపై వేర్వేరుగా మూడు కేసులు నమోదయ్యాయని, ఇండస్ ఇండ్ బ్యాంకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో అరెస్టు చేసినట్లు పోలీసు కమిషనర్ అంజనీకుమార్ వెల్లడించారు. గచ్చిబౌలి కేంద్రంగా పని చేసే కేఎస్‌బీఎల్ సంస్థ.. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) వద్ద రిజిస్టరై ఉంది. ఏళ్లుగా అనేక మంది మదుపర్ల డీమ్యాట్ ఖాతాలను ఈ సంస్థ పర్యవేక్షించేది. ఆయా ఖాతాల్లో క్లయింట్ల షేర్లతో పాటు నగదు కూడా ఉండేది. ప్రతి మదుపరుడు తన షేర్లను బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలకు తాకట్టు పెట్టి వాటి విలువలో 80 శాతం వరకు రుణం పొందొచ్చు. దీన్ని అనువుగా మార్చుకుని మదుపరుల అనుమతి లేకుండా డీమ్యాట్ ఖాతాల్లోని షేర్లను తన సంస్థ ఖాతాల్లోకి పార్థసారథి మార్చుకున్నారు. ఆ షేర్లను కొలేటరల్ సెక్యూరిటీగా పెట్టి దాదాపు రూ.680 కోట్ల వరకు అప్పు తీసుకున్నారు. ఈ మొత్తాలను తమ సొంత కంపెనీల్లోకి మళ్లించడం, రుణాలు చెల్లించి షేర్లను తిరిగి మదుపరుల ఖాతాల్లోకి పంపడం ఏళ్లుగా సాగింది. షేర్లు, నగదు ఉన్నట్లు చూపిస్తూ.. అలాగే వారి డీమ్యాట్ ఖాతాల్లో ఉన్న దాదాపు రూ.720 కోట్లనూ ఇదే పంథాలో మళ్లించడం, తిరిగి జమ చేయడం చోటు చేసుకున్నాయి. ఇలా తమ ఖాతాల్లోని షేర్లు, నగదు దారి మళ్లినట్లు మదుపరులకు తెలియకుండా కార్వీ సంస్థ జాగ్రత్త పడింది. వారి అనుమతి లేకుండా ఈ వ్యవహారాలు నెరపినా వర్చువల్ ఖాతాలో మాత్రం ఆ షేర్లు, నగదు ఉన్నట్లు చూపిస్తూ మోసం చేసింది. ఇదే పంథాలో షేర్లను తనఖా పెట్టిన కేఎస్‌బీఎల్, కార్వీ కమోడిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు.. 2019– 20ల్లో ఇండస్ ఇండ్ బ్యాంక్ నుంచి రూ.137 కోట్లు, హెచ్డీఎఫ్సీ నుంచి రెండు విడతల్లో రూ.347 కోట్లు రుణం తీసుకున్నారు. ఈ మొత్తాలను రుణం పొందిన సంస్థల్లోనే ఉంచి వాటి అభివృద్ధికి వినియోగించాలి. దీనికి భిన్నంగా వ్యవహరించిన పార్థసార«థి కార్వీ రియాల్టీ, కార్వీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ సంస్థల్లోకి మళ్లించారు. తమ డీమ్యాట్ ఖాతాల్లోని షేర్లను, నగదును కార్వీ సంస్థ మళ్లిస్తున్న విషయం గుర్తించిన కొందరు మదుపరులు సెబీకి ఫిర్యాదు చేశారు. దీంతో 2019లో పూర్తిస్థాయి దర్యాప్తు చేసిన సెబీ అవకతవకలు జరిగినట్లు తేల్చింది. ఈ నేపథ్యంలోనే 2020లో కేఎస్‌బీఎల్ ఎక్కడా స్టాక్ బ్రోకింగ్ కార్యకలాపాలు చేయకుండా నిషేధం విధించింది. అప్పటికే ఈ సంస్థ అధీనంలో ఉన్న డీమ్యాట్ ఖాతాలను వేర్వేరు సంస్థలకు బదిలీ చేయించింది. ఆ సందర్భంలో కార్వీ సంస్థలు ఆయా బ్యాంకులకు తాకట్టు పెట్టిన షేర్లను వాటి అనుమతి లేకుండానే మదుపరుల ఖాతాలకు బదిలీ చేసేశారు. దీంతో బ్యాంకు రుణాలపై ష్యూరిటీ లేకుండాపోవడంతో పాటు చెల్లింపులు ఆగిపోయాయి. పార్థసారథికి కోర్టు రిమాండ్... సెబీ నివేదికలు, ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించిన నేపథ్యం లో కుంభకోణానికి సంబంధించి కీలక ఆధారాలు సేకరించారు. గురువారం జూబ్లీహిల్స్‌లోని నివా సంలో పార్థసారథిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. తదుపరి విచారణ నిమిత్తం పార్థసారథిని ఏడు రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుల్లో మరికొందరూ నిందితులుగా ఉన్నారని చెబుతున్నారు. కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థపై 2019లో స్టాక్ మార్కెట్ కుంభ కోణం బయటపడింది. ఈ కుంభకోణం విలువ సుమారు రూ.2 వేల కోట్లపైగా ఉంటుందని అంచనా. ఈ కుంభకోణం బయటపడే దాకా ఈ సంస్థ పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ సేవలు అందించింది. వ్యవస్థలోని లోపాలను అనుకూలంగా మార్చుకుని, క్లయింట్ల నిధులు, షేర్లను అక్రమంగా తన ఖాతాలోకి బదలాయించుకోవడం ద్వారా ప్రయోజనాలు పొందిందని సంస్థపై ఆరోపణలు ఉన్నాయి. ఇలా తీసుకున్న వాటిలో సుమారు రూ.1,096 కోట్ల మొత్తాన్ని కార్వీ రియల్టీ సంస్థకు మళ్లించినట్లు సెబీ దర్యాప్తులో వెల్లడైంది. -
అహ్మద్ పటేల్‌పై ఈడీ దృష్టి
సాక్షి, న్యూఢిల్లీ : సోనియా గాంధీ రాజకీయ సలహాదారు హోదాలో ఒక వెలుగు వెలిగిన అహ్మద్ పటేల్‌కు ఊహించిన సమస్యలు ఎదురవుతున్నాయి. బ్యాంకు రుణాల మోసానికి సంబంధించి ఒక కార్పొరేట్ సంస్థను ఈడీ విచారిస్తున్న సమయంలో.. అహ్మద్ పటేల్, ఆయన కుమారుడు ఫైజల్ పటేల్, అల్లుడు ఇర్ఫాన్ సిద్ధిఖీల పేర్లు బయటకు వచ్చాయి. దీంతో వీరిపై కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. వడోదర కేంద్రంగా పనిచేస్తున్న సందేశార గ్రూప్ ఆఫ్ సంస్థలు మనీ లాండరింగ్‌కు పాల్పడ్డాయన్న ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈ దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు సందేశార సంస్థల డైరెక్టర్ సునీల్ యాదవ్‌ను విచారించించిరు. ఈ విచారణలోనే సునీల్ యాదవ్, అహ్మద్ పటేల్ కుటుంబ సభ్యుల పేర్లను ఈడీకి వెల్లడించింనట్లు సమాచారం. సునీల్ ఇచ్చిన లిఖితపూర్వక సాక్ష్యంలో సందేశార గ్రూప్ యజమాని చేతన్ సందేశార, ఆయన సహచరుడు గగన్ ధావన్ భారీ మొత్తంలో సొమ్మును సిద్ధిఖీకి ఇచ్చినట్లు ఆరోపించారు. చేతన్ సందేశార తరపున భారీ నగదును ఫైజల్ పటేల్‌కు పంపించినట్లు తెలిపారు. చేతన్ సందేశార తరచూ అహ్మద్ పటేల్ నివాసానికి వెళ్ళేవారని కూడా సునీల్ తెలిపారు. న్యూఢిల్లీలోని 23,మదర్ క్రెసెంట్‌లో అహ్మద్ పటేల్ నివాసం ఉంది. దీనిని సందేశార ప్రస్తావించినపుడు, ‘హెడ్‌క్వార్టర్స్ 23’ అని అభివర్ణించేవారని సునీల్ పేర్కొన్నారు. సిద్ధిఖీని జే2 అని, ఫైజల్‌ను జే1 అని సంబోధించేవారని పేర్కొన్నారు. సునీల్ ఇచ్చిన స్టేట్మెంట్ను మనీ లాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్ 50 ప్రకారం నమోదు చేశారు. అందువల్ల దీనిని కోర్టులో సాక్ష్యంగా అనుమతిస్తారు. కేసేంటి? సందేశరా గ్రూప్ ఆఫ్ కంపెనీలు.. సుమారు రూ. 5 వేల కోట్ల మేరకు బ్యాంక్ రుణం తీసుకుని మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ తాజా పరిణామాలపై స్పందించేందుకు అహ్మద్ పటేల్ నిరాకరించారు. -
అప్పుల కుప్పలు!
ఎలాంటి ఊళ్లో ఉండవచ్చునో చెబుతూ సుమతీ శతకకారుడు ఇచ్చిన జాబితాలో ‘అప్పిచ్చువాడు’ తొలి స్థానంలో ఉన్నాడు. నిరుపేదకు మాత్రమే కాదు...ఎంతటి శ్రీమంతుడికైనా ఏదో ఒక దశలో అప్పు చేయక తప్పని స్థితి ఏర్పడవచ్చునన్నది ఆయన ఉద్దేశం కావొచ్చు. ‘అప్పిచ్చువాడు’ మాత్రమే కాదు...అది ఇచ్చి మర్చిపోయేవాడి కోసం గాలిస్తున్నవారికి ప్రభుత్వ రంగ బ్యాంకులు కల్పతరువుగా మారినట్టు కనబడుతోంది. 2013-15 మధ్య వివిధ బ్యాంకులు 1.14 లక్షల కోట్ల విలువైన రుణాల్ని మాఫీ చేశాయంటూ ఒక దిన పత్రిక వెలువరించిన కథనాన్ని పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు... అప్పులు ఎగ్గొట్టిన కంపెనీల జాబితాను తమ ముందుంచాలని రిజర్వ్ బ్యాంక్‌ను మంగళవారం ఆదేశించింది. పదకొండేళ్లక్రితం దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం విచారణ సందర్భంగా ఈ కథనం ప్రస్తావనకు రావడం, మొండి బకాయిలపై సర్వోన్నత న్యాయస్థానం దృష్టి పడటం ఎంతో మంచిదైంది. ఎందుకంటే ఈ ప్రజాహిత వ్యాజ్యం విచారణ పెండింగ్‌లో ఉన్న ఈ కాలంలో బ్యాంకుల మొండి బకాయిలు పెరుగుతూ పోయాయి. కనీసం ఇప్పుడు సుప్రీంకోర్టు జాబితా అడిగింది గనుక ఇకముందైనా బ్యాంకులు జాగ్రత్తగా అడుగులేసే అవకాశం ఉంది. ఈ దేశ బ్యాంకింగ్ వ్యవస్థను ఎగవేతదారులు చెదపురుగుల్లా గత కొన్ని దశాబ్దాలుగా నాశనం చేస్తూ వస్తున్నారు. చడీ చప్పుడూ లేకుండా ఈ పని కానిస్తున్నారు. పర్యవసానంగా లక్షలాది కోట్ల రూపాయలు సొమ్ము బజారుపాలయింది. ఆ డబ్బంతా వెనక్కు వచ్చే దోవ తోచక బ్యాంకులు తెల్లమొహం వేస్తున్నాయి. అలాగని ఆ మొండి బకాయిల వసూలుకు బ్యాంకులు ఎంతగానో ప్రయత్నిస్తున్నాయని చెప్పడం అర్థ సత్యమే అవుతుంది. అధిక మొత్తంలో రుణాలు పొందే అవకాశం రాజకీయ పలుకుబడిగలవారికి, అధికార ప్రాపకం ఉన్నవారికి మాత్రమే సాధ్యం. ఆ పలుకుబడే, ఆ ప్రాపకమే ఆ రుణాలను ఎగ్గొట్టడానికి కూడా వీలు కల్పిస్తున్నది. వారిని అడిగే ధైర్యం లేక, వారినుంచి తిరిగి రాబట్టుకునే మార్గాలు తెలియక బ్యాంకులు నీళ్లు నములుతున్నాయి. 2008 నాటికి బ్యాంకుల మొండి బకాయిలు రూ. 53,917 కోట్లుంటే నిరుడు సెప్టెంబర్ నాటికి ఆ మొత్తం రూ. 3,41, 641 కోట్లకు చేరుకుంది. ఇలా మొండి బకాయిలున్న మొదటి పది బ్యాంకుల్లో 9 ప్రభుత్వ రంగ బ్యాంకులే. వచ్చే ఏడాది మార్చినాటికల్లా అన్ని బ్యాంకులూ ఈ బకాయిల సంగతి తేల్చాలని రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్ ఈమధ్యే ఆదేశాలిచ్చారు. ఈ ఆదేశాలు శిరసావహించి బ్యాంకులు బకాయిలను రాబట్టుకుంటాయనుకోవడం ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో అత్యాశే. మన దేశంలో గత రెండు దశాబ్దాల్లో రెండున్నర లక్షలమందికిపైగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఎరువులు, విత్తనాలు మొదలుకొని వ్యవసాయం కోసం చేసే ఖర్చులన్నీ విపరీతంగా పెరిగిపోవడం...అదే సమయంలో తమ ఉత్పత్తులకు ధరలను నిర్ణయించుకునే అధికారం లేకపోవడం పర్యవసానంగా రైతులు నష్టాలబారిన పడుతున్నారు. తుపానులు, అనావృష్టివంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా కోలుకోలేని దెబ్బతింటున్నారు. ఒకసారి రుణం తీసుకుని చెల్లించలేని రైతుకు బ్యాంకుల్లో రెండోసారి అప్పు పుట్టదు గనుక అలాంటివారంతా ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి మరిన్ని అప్పుల్లో కూరుకుపోతున్నారు. చివరకు ఈ రుణ భారాన్ని వదుల్చుకోలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. మరోపక్క బ్యాంకుల్లో రుణాలు తీసుకుంటున్న బడా కార్పొరేట్ కంపెనీల అధిపతులు, సంపన్నులు మాత్రం సమాజంలో గౌరవనీయమైన వ్యక్తులుగా చలామణి కాగలుగుతున్నారు. అత్యంత బాధాకరమైన విషయమేమంటే వారిలో కొందరు ఎంపీలుగా ఎన్నికవుతున్నారు. మంత్రులై అధికారం చలాయిస్తున్నారు. వారికి అప్పులిచ్చి వసూలు చేసుకోలేని చేతగాని స్థితిలో పడిన బ్యాంకులు మాత్రం నష్టాల్లో కూరుకుపోతున్నాయి. చిత్రమేమంటే ఇలా బకాయిలు ఎగ్గొడుతున్నవారి పేర్లను బహిరంగపరిచేందుకు బ్యాంకులు మందుకు రావడం లేదు. వారికి సంబంధించిన వివరాలు వెల్లడికానీయడం లేదు. ప్రభుత్వాలుగానీ, రిజర్వ్బ్యాంకుగానీ అందుకు అనువైన విధానాలను రూపొందించడంలేదు. సరిగదా ఇలాంటి బకాయిలను సర్దుబాటు చేయడం కోసం బ్యాంకులు తమ లాభాల్లో భారీ మొత్తాలను వెచ్చిస్తున్నాయి. అంటే పౌరులకు తెలియకుండా, అత్యంత రహస్యంగా...చాకచక్యంగా కంపెనీల బకాయిలు రద్దయిపోతున్నాయి. ఇదంతా ప్రజాధనమే. జనం తమ రెక్కలు ముక్కలు చేసుకుని బ్యాంకుల్లో దాస్తున్న డబ్బే. రెండేళ్లక్రితం అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం(ఏఐబీఈఏ) రూ. 40, 528 కోట్లు ఎగ్గొట్టిన 50 సంస్థల పేర్లను వెల్లడించి సంచలనం సృష్టించింది. ఉద్యోగుల సంఘం ఇలా చేశాకైనా సిగ్గుపడి అలాంటివారి పేర్లను వెల్లడించడానికి ఒక విధానం ఏర్పరవలసిన ప్రభుత్వం ఆ పని చేయలేదు. రైతుల రుణాలను మాఫీ చేసినప్పుడు ఏదో విపత్తు సంభవించిందన్న స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం చేసే ఆర్ధిక నిపుణులు ఇలాంటి ఎగవేతదారుల గురించి మౌనంగా ఉంటారు. దేశ ఆర్ధిక వ్యవస్థ పుంజుకోవడానికి, ఉపాధి అవకాశాలు ఏర్పడటానికి కంపెనీలకు రుణ సదుపాయం కల్పించడం అవసరమని ఊదరగొట్టే ప్రభుత్వాలకు... ఆ ఇచ్చిన రుణాలను వసూలు చేసుకోవడానికి అనువైన అధికారాలను బ్యాంకులకు కల్పించవలసిన బాధ్యత లేదా? ఇలాంటి దయనీయ పరిస్థితుల్లో రూ. 500 కోట్లకు మించి బకాయిలున్న కంపెనీల జాబితాను తమ ముందుంచాలని రిజర్వ్‌బ్యాంక్ ఆదేశించడం హ ర్షించదగిన విషయం. దీంతోపాటు రుణాలను పునర్‌వ్యవస్థీకరించుకున్న కంపెనీల జాబితాను కూడా సర్వోన్నత న్యాయస్థానం కోరింది. ఇంత భారీ మొత్తంలో రుణాలివ్వడానికి కారణాలేమిటో చెప్పాలని కూడా ఆదేశించింది. అయితే బాకీలు ఎగ్గొట్టినవారి వివరాలను సీల్డ్ కవర్లో అందజేయాలనడం కంటే వారి వివరాలను బహిర్గతం చేయమని ఆదేశించడమే సబబవుతుంది. అలాగే అలాంటివారి వివరాలను సైతం సమాచార హక్కు చట్టం పరిధిలోనికి తీసుకొచ్చి ఏ బ్యాంక్‌నుంచి అయినా వివరాలను రాబట్టే అవకాశం సాధారణ పౌరులకు కల్పించాలి. అలా చేసినప్పుడైనా సిగ్గొచ్చి బకాయిలను ఎగవేసే బడా శ్రీమంతులు, కార్పొరేట్ అధిపతులు దారికొస్తారు. దేశ ఆర్ధిక వ్యవస్థను పట్టిపీడిస్తున్న సమస్యల్లో కొన్నయినా విరగడవుతాయి.