సాక్షి, హైదరాబాద్: కార్వీ స్టాక్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సి.పార్థసారథిని హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. రెండు బ్యాంకులకు రూ.484 కోట్లు ఎగవేసిన ఆరోపణలపై వేర్వేరుగా మూడు కేసులు నమోదయ్యాయని, ఇండస్ ఇండ్ బ్యాంకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో అరెస్టు చేసినట్లు పోలీసు కమిషనర్ అంజనీకుమార్ వెల్లడించారు. గచ్చిబౌలి కేంద్రంగా పని చేసే కేఎస్‌బీఎల్ సంస్థ.. బాంబే స్టాక్ ఎక్స్‌ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) వద్ద రిజిస్టరై ఉంది. ఏళ్లుగా అనేక మంది మదుపర్ల డీమ్యాట్ ఖాతాలను ఈ సంస్థ పర్యవేక్షించేది. ఆయా ఖాతాల్లో క్లయింట్ల షేర్లతో పాటు నగదు కూడా ఉండేది. ప్రతి మదుపరుడు తన షేర్లను బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలకు తాకట్టు పెట్టి వాటి విలువలో 80 శాతం వరకు రుణం పొందొచ్చు. దీన్ని అనువుగా మార్చుకుని మదుపరుల అనుమతి లేకుండా డీమ్యాట్ ఖాతాల్లోని షేర్లను తన సంస్థ ఖాతాల్లోకి పార్థసారథి మార్చుకున్నారు. ఆ షేర్లను కొలేటరల్ సెక్యూరిటీగా పెట్టి దాదాపు రూ.680 కోట్ల వరకు అప్పు తీసుకున్నారు. ఈ మొత్తాలను తమ సొంత కంపెనీల్లోకి మళ్లించడం, రుణాలు చెల్లించి షేర్లను తిరిగి మదుపరుల ఖాతాల్లోకి పంపడం ఏళ్లుగా సాగింది.
షేర్లు, నగదు ఉన్నట్లు చూపిస్తూ..
అలాగే వారి డీమ్యాట్ ఖాతాల్లో ఉన్న దాదాపు రూ.720 కోట్లనూ ఇదే పంథాలో మళ్లించడం, తిరిగి జమ చేయడం చోటు చేసుకున్నాయి. ఇలా తమ ఖాతాల్లోని షేర్లు, నగదు దారి మళ్లినట్లు మదుపరులకు తెలియకుండా కార్వీ సంస్థ జాగ్రత్త పడింది. వారి అనుమతి లేకుండా ఈ వ్యవహారాలు నెరపినా వర్చువల్ ఖాతాలో మాత్రం ఆ షేర్లు, నగదు ఉన్నట్లు చూపిస్తూ మోసం చేసింది. ఇదే పంథాలో షేర్లను తనఖా పెట్టిన కేఎస్‌బీఎల్, కార్వీ కమోడిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు.. 2019– 20ల్లో ఇండస్ ఇండ్ బ్యాంక్ నుంచి రూ.137 కోట్లు, హెచ్‌డీఎఫ్‌సీ నుంచి రెండు విడతల్లో రూ.347 కోట్లు రుణం తీసుకున్నారు. ఈ మొత్తాలను రుణం పొందిన సంస్థల్లోనే ఉంచి వాటి అభివృద్ధికి వినియోగించాలి. దీనికి భిన్నంగా వ్యవహరించిన పార్థసార«థి కార్వీ రియాల్టీ, కార్వీ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థల్లోకి మళ్లించారు. తమ డీమ్యాట్ ఖాతాల్లోని షేర్లను, నగదును కార్వీ సంస్థ మళ్లిస్తున్న విషయం గుర్తించిన కొందరు మదుపరులు సెబీకి ఫిర్యాదు చేశారు. దీంతో 2019లో పూర్తిస్థాయి దర్యాప్తు చేసిన సెబీ అవకతవకలు జరిగినట్లు తేల్చింది. ఈ నేపథ్యంలోనే 2020లో కేఎస్‌బీఎల్ ఎక్కడా స్టాక్ బ్రోకింగ్ కార్యకలాపాలు చేయకుండా నిషేధం విధించింది. అప్పటికే ఈ సంస్థ అధీనంలో ఉన్న డీమ్యాట్ ఖాతాలను వేర్వేరు సంస్థలకు బదిలీ చేయించింది. ఆ సందర్భంలో కార్వీ సంస్థలు ఆయా బ్యాంకులకు తాకట్టు పెట్టిన షేర్లను వాటి అనుమతి లేకుండానే మదుపరుల ఖాతాలకు బదిలీ చేసేశారు. దీంతో బ్యాంకు రుణాలపై ష్యూరిటీ లేకుండాపోవడంతో పాటు చెల్లింపులు ఆగిపోయాయి.
పార్థసారథికి కోర్టు రిమాండ్...
సెబీ నివేదికలు, ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించిన నేపథ్యం లో కుంభకోణానికి సంబంధించి కీలక ఆధారాలు సేకరించారు. గురువారం జూబ్లీహిల్స్‌లోని నివా సంలో పార్థసారథిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. తదుపరి విచారణ నిమిత్తం పార్థసారథిని ఏడు రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుల్లో మరికొందరూ నిందితులుగా ఉన్నారని చెబుతున్నారు. కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థపై 2019లో స్టాక్ మార్కెట్ కుంభ కోణం బయటపడింది. ఈ కుంభకోణం విలువ సుమారు రూ.2 వేల కోట్లపైగా ఉంటుందని అంచనా. ఈ కుంభకోణం బయటపడే దాకా ఈ సంస్థ పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ సేవలు అందించింది. వ్యవస్థలోని లోపాలను అనుకూలంగా మార్చుకుని, క్లయింట్ల నిధులు, షేర్లను అక్రమంగా తన ఖాతాలోకి బదలాయించుకోవడం ద్వారా ప్రయోజనాలు పొందిందని సంస్థపై ఆరోపణలు ఉన్నాయి. ఇలా తీసుకున్న వాటిలో సుమారు రూ.1,096 కోట్ల మొత్తాన్ని కార్వీ రియల్టీ సంస్థకు మళ్లించినట్లు సెబీ దర్యాప్తులో వెల్లడైంది.
కార్వీ సంస్థ సీఎండీ పార్థసారథి అరెస్ట్
Published Fri, Aug 20 2021 1:09 AM | Last Updated on Fri, Aug 20 2021 8:03 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment