అప్పుల కుప్పలు! | corporate comanies in bank loan defaulters list | Sakshi
Sakshi News home page

అప్పుల కుప్పలు!

Published Thu, Feb 18 2016 12:42 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM

corporate comanies in bank loan defaulters list

ఎలాంటి ఊళ్లో ఉండవచ్చునో చెబుతూ సుమతీ శతకకారుడు ఇచ్చిన జాబితాలో ‘అప్పిచ్చువాడు’ తొలి స్థానంలో ఉన్నాడు. నిరుపేదకు మాత్రమే కాదు...ఎంతటి శ్రీమంతుడికైనా ఏదో ఒక దశలో అప్పు చేయక తప్పని స్థితి ఏర్పడవచ్చునన్నది ఆయన ఉద్దేశం కావొచ్చు. ‘అప్పిచ్చువాడు’ మాత్రమే కాదు...అది ఇచ్చి మర్చిపోయేవాడి కోసం గాలిస్తున్నవారికి ప్రభుత్వ రంగ బ్యాంకులు కల్పతరువుగా మారినట్టు కనబడుతోంది. 2013-15 మధ్య వివిధ బ్యాంకులు 1.14 లక్షల కోట్ల విలువైన రుణాల్ని మాఫీ చేశాయంటూ ఒక దిన పత్రిక వెలువరించిన కథనాన్ని పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు... అప్పులు ఎగ్గొట్టిన కంపెనీల జాబితాను తమ ముందుంచాలని రిజర్వ్ బ్యాంక్‌ను మంగళవారం ఆదేశించింది. పదకొండేళ్లక్రితం దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం విచారణ సందర్భంగా ఈ కథనం ప్రస్తావనకు రావడం, మొండి బకాయిలపై సర్వోన్నత న్యాయస్థానం దృష్టి పడటం ఎంతో మంచిదైంది. ఎందుకంటే ఈ ప్రజాహిత వ్యాజ్యం విచారణ పెండింగ్‌లో ఉన్న ఈ కాలంలో బ్యాంకుల మొండి బకాయిలు పెరుగుతూ పోయాయి. కనీసం ఇప్పుడు సుప్రీంకోర్టు జాబితా అడిగింది గనుక ఇకముందైనా బ్యాంకులు జాగ్రత్తగా అడుగులేసే అవకాశం ఉంది. ఈ దేశ బ్యాంకింగ్ వ్యవస్థను ఎగవేతదారులు చెదపురుగుల్లా గత కొన్ని దశాబ్దాలుగా నాశనం చేస్తూ వస్తున్నారు. చడీ చప్పుడూ లేకుండా ఈ పని కానిస్తున్నారు. పర్యవసానంగా లక్షలాది కోట్ల రూపాయలు సొమ్ము బజారుపాలయింది. ఆ డబ్బంతా వెనక్కు వచ్చే దోవ తోచక బ్యాంకులు తెల్లమొహం వేస్తున్నాయి. అలాగని ఆ  మొండి బకాయిల వసూలుకు బ్యాంకులు ఎంతగానో ప్రయత్నిస్తున్నాయని చెప్పడం అర్థ సత్యమే అవుతుంది. అధిక మొత్తంలో రుణాలు పొందే అవకాశం రాజకీయ పలుకుబడిగలవారికి, అధికార ప్రాపకం ఉన్నవారికి మాత్రమే సాధ్యం. ఆ పలుకుబడే, ఆ ప్రాపకమే ఆ రుణాలను ఎగ్గొట్టడానికి కూడా వీలు కల్పిస్తున్నది. వారిని అడిగే ధైర్యం లేక, వారినుంచి తిరిగి రాబట్టుకునే మార్గాలు తెలియక బ్యాంకులు నీళ్లు నములుతున్నాయి. 2008 నాటికి బ్యాంకుల మొండి బకాయిలు రూ. 53,917 కోట్లుంటే నిరుడు సెప్టెంబర్ నాటికి ఆ మొత్తం రూ. 3,41, 641 కోట్లకు చేరుకుంది. ఇలా మొండి బకాయిలున్న మొదటి పది బ్యాంకుల్లో 9 ప్రభుత్వ రంగ బ్యాంకులే. వచ్చే ఏడాది మార్చినాటికల్లా అన్ని బ్యాంకులూ ఈ బకాయిల సంగతి తేల్చాలని రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్ ఈమధ్యే ఆదేశాలిచ్చారు. ఈ ఆదేశాలు శిరసావహించి బ్యాంకులు బకాయిలను రాబట్టుకుంటాయనుకోవడం ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో అత్యాశే.
 

  మన దేశంలో గత రెండు దశాబ్దాల్లో రెండున్నర లక్షలమందికిపైగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఎరువులు, విత్తనాలు మొదలుకొని వ్యవసాయం కోసం చేసే ఖర్చులన్నీ విపరీతంగా పెరిగిపోవడం...అదే సమయంలో తమ ఉత్పత్తులకు ధరలను నిర్ణయించుకునే అధికారం లేకపోవడం పర్యవసానంగా రైతులు నష్టాలబారిన పడుతున్నారు. తుపానులు, అనావృష్టివంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా కోలుకోలేని దెబ్బతింటున్నారు. ఒకసారి రుణం తీసుకుని చెల్లించలేని రైతుకు బ్యాంకుల్లో రెండోసారి అప్పు పుట్టదు గనుక అలాంటివారంతా ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి మరిన్ని అప్పుల్లో కూరుకుపోతున్నారు. చివరకు ఈ రుణ భారాన్ని వదుల్చుకోలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. మరోపక్క బ్యాంకుల్లో రుణాలు తీసుకుంటున్న బడా కార్పొరేట్ కంపెనీల అధిపతులు,  సంపన్నులు మాత్రం సమాజంలో గౌరవనీయమైన వ్యక్తులుగా చలామణి కాగలుగుతున్నారు. అత్యంత బాధాకరమైన విషయమేమంటే వారిలో కొందరు ఎంపీలుగా ఎన్నికవుతున్నారు. మంత్రులై అధికారం చలాయిస్తున్నారు. వారికి అప్పులిచ్చి వసూలు చేసుకోలేని చేతగాని స్థితిలో పడిన బ్యాంకులు మాత్రం నష్టాల్లో కూరుకుపోతున్నాయి. చిత్రమేమంటే ఇలా బకాయిలు ఎగ్గొడుతున్నవారి పేర్లను బహిరంగపరిచేందుకు బ్యాంకులు మందుకు రావడం లేదు. వారికి సంబంధించిన వివరాలు వెల్లడికానీయడం లేదు. ప్రభుత్వాలుగానీ, రిజర్వ్‌బ్యాంకుగానీ అందుకు అనువైన విధానాలను రూపొందించడంలేదు. సరిగదా ఇలాంటి బకాయిలను సర్దుబాటు చేయడం కోసం బ్యాంకులు తమ లాభాల్లో భారీ మొత్తాలను వెచ్చిస్తున్నాయి. అంటే పౌరులకు తెలియకుండా, అత్యంత రహస్యంగా...చాకచక్యంగా కంపెనీల బకాయిలు రద్దయిపోతున్నాయి. ఇదంతా ప్రజాధనమే. జనం తమ రెక్కలు ముక్కలు చేసుకుని బ్యాంకుల్లో దాస్తున్న డబ్బే.  రెండేళ్లక్రితం అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం(ఏఐబీఈఏ) రూ. 40, 528 కోట్లు ఎగ్గొట్టిన 50 సంస్థల పేర్లను వెల్లడించి సంచలనం సృష్టించింది. ఉద్యోగుల సంఘం ఇలా చేశాకైనా సిగ్గుపడి అలాంటివారి పేర్లను వెల్లడించడానికి ఒక విధానం ఏర్పరవలసిన ప్రభుత్వం ఆ పని చేయలేదు. రైతుల రుణాలను మాఫీ చేసినప్పుడు ఏదో విపత్తు సంభవించిందన్న స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం చేసే ఆర్ధిక నిపుణులు ఇలాంటి ఎగవేతదారుల గురించి మౌనంగా ఉంటారు.  దేశ ఆర్ధిక వ్యవస్థ పుంజుకోవడానికి, ఉపాధి అవకాశాలు ఏర్పడటానికి  కంపెనీలకు రుణ సదుపాయం కల్పించడం అవసరమని ఊదరగొట్టే ప్రభుత్వాలకు... ఆ ఇచ్చిన రుణాలను వసూలు చేసుకోవడానికి అనువైన అధికారాలను బ్యాంకులకు కల్పించవలసిన బాధ్యత లేదా?
 

 ఇలాంటి దయనీయ పరిస్థితుల్లో రూ. 500 కోట్లకు మించి బకాయిలున్న కంపెనీల జాబితాను తమ ముందుంచాలని రిజర్వ్‌బ్యాంక్ ఆదేశించడం హ ర్షించదగిన విషయం. దీంతోపాటు రుణాలను పునర్‌వ్యవస్థీకరించుకున్న కంపెనీల జాబితాను కూడా సర్వోన్నత న్యాయస్థానం కోరింది. ఇంత భారీ మొత్తంలో రుణాలివ్వడానికి కారణాలేమిటో చెప్పాలని కూడా ఆదేశించింది. అయితే బాకీలు ఎగ్గొట్టినవారి వివరాలను సీల్డ్ కవర్‌లో అందజేయాలనడం కంటే వారి వివరాలను బహిర్గతం చేయమని ఆదేశించడమే సబబవుతుంది. అలాగే అలాంటివారి వివరాలను సైతం సమాచార హక్కు చట్టం పరిధిలోనికి తీసుకొచ్చి ఏ బ్యాంక్‌నుంచి అయినా వివరాలను రాబట్టే అవకాశం సాధారణ పౌరులకు కల్పించాలి. అలా చేసినప్పుడైనా సిగ్గొచ్చి బకాయిలను ఎగవేసే బడా శ్రీమంతులు, కార్పొరేట్ అధిపతులు దారికొస్తారు. దేశ ఆర్ధిక వ్యవస్థను పట్టిపీడిస్తున్న సమస్యల్లో కొన్నయినా విరగడవుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement