మహా కుంభమేళాలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు భక్తులు, పర్యాటకులు రికార్డు స్థాయిలో తరలివస్తున్నారు. దీనిని ఆసరాగా చేసుకున్న ప్రముఖ వినియోగ వస్తువుల (ఎఫ్‌ఎంసీజీ) కంపెనీలు సంగమ ప్రాంతంలో తమ ప్రచార దందాను యధేచ్చగా కొనసాగిస్తున్నాయి.
ప్రముఖ అగ్రశ్రేణి బ్రాండ్లు, కార్పొరేట్ సంస్థలు(Corporate organizations) ప్రయాగ్ రాజ్‌లో తమ కొత్త దుకాణాలను తెరిచాయి. ఇవి తమ ఉత్పత్తుల శాంపిల్ ప్యాక్‌లను పర్యాటకులకు ఉచితంగా పంపిణీ చేస్తూ, వారిని తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. మార్కెట్లలో ధరలు పెరగడం, అమ్మకాలు తగ్గడం లాంటి సవాళ్లను ఎదుర్కొంటున్న పలు బ్రాండ్లు మహా కుంభ్‌కు వచ్చే వినియోగదారులతో నేరుగా కనెక్ట్ అయ్యేందుకు ఇది ఒక అవకాశంగా భావిస్తున్నాయి. ఈ బ్రాండ్లు 45 రోజుల పాటు జరిగే కుంభమేళాను తమ ఉత్పత్తుల ప్రచారానికి సద్వినియోగం చేసుకుంటున్నాయి.
మహా కుంభమేళాకు 40 కోట్ల మంది హాజరవుతారనే అంచనాలున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్(Reliance Industries)కు చెందిన ఎఫ్‌ఎంసీజీ విభాగం రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (ఆర్‌సీపీఎల్) సంగమ స్థలిలో కొత్తగా కార్యాలయం ఏర్పాటు చేసి, తమ ఉత్పత్తులు ప్రదర్శిస్తోంది. ప్రముఖ పరిశుభ్రత బ్రాండ్ డెటాల్ కుంభమేళాలో దాదాపు 15 వేల మంది పారిశుధ్య కార్మికులకు శిక్షణ ఇచ్చింది. వారికి సబ్బులను ఉచితంగా పంపిణీ చేసింది.
డాబర్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) మోహిత్ మల్హోత్రా మీడియాతో మాట్లాడుతూ ‘ఇటువంటి సాంప్రదాయ కార్యక్రమాల సమయంలో, మేము వినియోగదారులతో ప్రత్యక్ష సంబంధాన్ని కోరుకుంటామన్నారు. మా బ్రాండ్లు డాబర్ చ్యవన్‌ప్రాష్, డాబర్ హనీ, డాబర్ రెడ్ పేస్ట్, ఆమ్లా హెయిర్ ఆయిల్, వాటిక, హజ్మోలా, హోనిటస్‌ల గురించి వినియోగదారులకు అవగాహన కల్పిస్తామన్నారు. ఇదేవిధంగా మంగళ్‌దీప్ అగరుబత్తుల కంపెనీ ఇక్కడ విరివిగా ప్రచారం సాగిస్తోంది.
కోకా-కోలా ఇండియా ఆసియా మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ గ్రీష్మా సింగ్ మాట్లాడుతూ కుంభమేళాలో పునర్వినియోగ ప్యాకేజింగ్‌ను ప్రోత్సహిస్తున్నామని, వినియోగదారులలో రీసైక్లింగ్‌పై అవగాహన పెంచేందుకు కృషిచేస్తున్నామన్నారు. ఐటీసీ ప్రతినిధి మాట్లాడుతూ, మంగళ్‌దీప్ అగర్బత్తితో సహా ఐటీసీకి చెందిన ఎఫ్‌ఎంసీజీ బ్రాండ్‌లను ప్రజలకు దగ్గర చేసేందుకు ప్రయత్నిస్తున్నామని’ అన్నారు.
ఇది కూడా చదవండి: Mahakumbh: ఉత్సాహం ఉరకలేస్తోంది: బల్గేరియా పర్యాటకులు
Comments
Please login to add a commentAdd a comment