
గంటన్నర పడిగాపులు కాసినా.. పట్టించుకోని భీమిలి ఎమ్మెల్యే
ఎంవీపీ కాలనీ: మున్సిపల్ కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని కోరుతూ స్థానికంగా నివాసం ఉంటున్న భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఇంటి ఎదుట సీఐటీయూ నాయకుల ఆధ్వర్యంలో కార్మికులు నిరసన చేపట్టారు. ఎమ్మెల్యే గంటాకు ఈ అంశంపై వినతిపత్రం ఇచ్చేందుకు ఎంవీపీ కాలనీ సెక్టార్– 4లోని ఆయన ఇంటికి మంగళవారం వెళ్లారు.
ఆయన ఇంట్లోనే ఉన్నప్పటికీ వినతిపత్రం స్వీకరించేందుకు బయటకు రాలేదు. గంటన్నర పాటు నిరీక్షించినా.. స్పందించకపోవడంతో ఆగ్రహానికి గురైన కార్మికులు గంటాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన తీవ్రం చేశారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం గంటా పీఏలు అక్కడికి వచ్చి వినతిపత్రం తమకు ఇవ్వాలని కోరినా కార్మికులు అంగీకరించలేదు.
ఓ ప్రజాప్రతినిధి అయివుండీ కార్మికుల సమస్యలు వినడానికి ముందుకు రాకపోవడం దురదృష్టకరమని ఆక్షేపించారు. అంతకు ముందు వారంతా ఎమ్మెల్యే వెలగపూడికి వినతిపత్రం అందించి, సమస్యలను వివరించారు. సీఐటీయూ ఆర్గనైజింగ్ సెక్రటరీ వి.కృష్ణారావు, సహాయ కార్యదర్శి జేఆర్ నాయుడు, మున్సిపల్ యూనియన్ నాయకులు ఆర్.శ్రీను, కె.కుమారి, ఇ.ఆదినారాయణ, శేషుబాబు, కొండమ్మ, శ్రీదేవి, విజయ, చెల్లయ్యమ్మ, రాజు, గోపి, వెంకట్రావు పాల్గొన్నారు.