‘ఎర్ర’ స్మగ్లర్లపై ఉక్కుపాదం
ఎన్‌కౌంటర్‌లో 20 మంది మృతిపై సమగ్ర దర్యాప్తు: చినరాజప్ప
అమలాపురం: జాతీయ సంపద అయిన ఎర్రచందనాన్ని పరిరక్షించేందుకు తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. తిరుపతి వద్ద శేషాచలం అడవుల్లో టాస్క్‌ఫోర్‌స, అటవీ శాఖ అధికారులు ఉమ్మడిగా జరిపిన ఎన్‌కౌంటర్‌లో 20 మంది స్మగ్లర్లు మృతి చెందిన ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని ప్రకటించారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఈ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన వారిలో ఇద్దరు అంతర్జాతీయ స్మగ్లర్లు కూడా ఉన్నట్టు అనుమానంగా ఉందన్నారు.
సమగ్ర దర్యాప్తులో ఈ విషయం బయటపడుతుందని తెలిపారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎర్రచందనంపై పూర్తిగా నిర్లక్ష్యం వహించడంవల్లే స్మగ్లర్లు చెలరేగిపోయారని అన్నారు. దీనివల్ల గంగిరెడ్డి వంటి గజ స్మగ్లర్ పుట్టుకువచ్చాడని చెప్పారు. ఎర్రచందనాన్ని పరిరక్షించేందుకు, స్మగ్లర్లను పూర్తిగా అణచివేసేందుకు ఇతర రాష్ట్రాల సహకారం తీసుకుంటామని చెప్పారు.