లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన హోంమంత్రి
కాకినాడ : ఉప ముఖ్యమంత్రి, హోం శాఖామంత్రి నిమ్మకాయల చినరాజప్ప శనివారం లిఫ్ట్లో ఇరుక్కుపోయారు. లోడ్ అధికంగా ఉండటంతో ఆయన ఎక్కిన లిఫ్ట్ మొరాయించింది. దీంతో చినరాజప్ప దాదాపు పావుగంట పాటు లిఫ్ట్లో ఉండిపోయారు. వివరాల్లోకి వెళితే... కాకినాడలో ఇవాళ ఉదయం కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయాన్ని చినరాజప్ప ప్రారంభించారు.
అనంతరం కార్యాలయం పైభాగంలో ఏర్పాటు చేసిన సౌర విద్యుత్ కేంద్రం ప్రారంభించేందుకు ఆయన లిఫ్ట్ ఎక్కారు. అయితే చినరాజప్పతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు అందరూ ఒకేసారి లిఫ్ట్ ఎక్కేయడంతో లిఫ్ట్ తలుపులు మూసుకుపోయి అక్కడే ఆగిపోయింది. ఎంతసేపటికీ లిఫ్ట్ కదలకపోవడంతో కిందికీ, పైకీ అధికారులు పరుగులు తీశారు.
లిఫ్ట్ తలుపులు తెరిచేందుకు కొద్దిసేపు రకరకాల ప్రయత్నాలు చేశారు. దీంతో బయట ఉన్న పోలీసు అధికారులు, ఇతర శాఖలకు చెందిన అధికారులు భయాందోళనకు గురయ్యూరు. చివరకు లిఫ్ట్ ఒకేసారి కిందికి దిగింది. దీంతో అందరూ క్షేమంగా బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు లిఫ్ట్‌లోకి అంతమందిని ఎలా అనుమతించారని అక్కడున్న పోలీసు అధికారులపై చినరాజప్ప చిందులు తొక్కారు.