
'ఫోన్లను ట్యాపింగ్ చేయించడం కేసీఆర్ కు భావ్యం కాదు'
అమలాపురం టౌన్: చీటికీ మాటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలనలో జోక్యం చేసుకుంటూ వివాదాలు సృష్టిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ మీద కేంద్రానికి ఫిర్యాదు చేస్తానని ఏపీ ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. అమలాపురంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉండాలన్న ఒప్పందంలో భాగంగా హైదరాబాద్‌లో నుంచి పాలన సాగిస్తుంటే కేసీఆర్ తమ ఫోన్లను ట్యాపింగ్ చేయించడం భావ్యం కాదన్నారు. రేవంత్‌రెడ్డి కేసులో ఏపీ సీఎం చంద్రబాబుకు సంబంధం ఉందని రుజువు చేసే టేపులున్నాయంటున్న తెలంగాణ ప్రభుత్వానికి దమ్ముంటే వాటిని బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే స్టీఫెన్‌ను ఎరగా వాడుకుని, రేవంత్‌రెడ్డి వలలో పడేలా చేసింది ఆ ప్రభుత్వమేనని ఆరోపించారు. కేసీఆరే ఎమ్మెల్సీ ఎన్నికల్లో 20 మంది వేరే పార్టీల ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి ఓట్లు వేయించుకున్నారని, సీబీఐ విచారణ జరిపిస్తే ఆ బండారం బయట పడుతుందన్నారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం.. రేవంత్‌రెడ్డిపై ఏసీబీ చేసిన స్టింగ్ ఆపరేషన్ కోర్టులో నిలబడదని అభిప్రాయపడ్డారు. మంత్రి పీతల సుజాత ఇంటి వద్ద రూ.10 లక్షల నగదు పట్టుబడిన సంఘటనపై విచారణ జరుగుతోందని, ఎవరు దోషులని తేలినా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.