'కొత్త జిల్లాల మాటున కేసీఆర్ కుట్ర' | revanth criticised kcr on new districts issue | Sakshi
Sakshi News home page

'కొత్త జిల్లాల మాటున కేసీఆర్ కుట్ర'

Published Fri, Oct 7 2016 10:31 PM | Last Updated on Wed, Oct 17 2018 3:38 PM

'కొత్త జిల్లాల మాటున కేసీఆర్ కుట్ర' - Sakshi

'కొత్త జిల్లాల మాటున కేసీఆర్ కుట్ర'

హైదరాబాద్: కొత్త జిల్లాల మాటున దాగిన కుట్రపై కేంద్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని టీటీడీపీ నేత రేవంత్‌రెడ్డి తెలిపారు. జిల్లాల విభజన పేరుతో నియోజకవర్గాల డీలిమిటేషన్‌పై ప్రభావం చూపేలా కేసీఆర్ చేస్తున్న కుట్ర గురించి కేంద్ర హోంశాఖకు, న్యాయశాఖకు వివరిస్తామన్నారు. కేంద్రం నుంచి సానుకూల స్పందన రాకపోతే అవసరమైతే న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తామని చెప్పారు. పరిపాలనా సౌలభ్యం పేరుతో సీఎం కేసీఆర్ చట్టాలను ఉల్లంఘిస్తున్నారని, ఎదిగివస్తున్న ఎస్సీ, ఎస్టీ నాయకత్వాన్ని అణచి వేయడానికి.. తనకు అడ్డంకిగా ఉన్న నేతలను దెబ్బతీయడానికి జిల్లాల పేరుతో కుట్ర చేస్తున్నారని విమర్శించారు. ఈ వ్యవహారంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా కేసీఆర్‌తో కుమ్మక్కైందని ఆరోపించారు.

అసెంబ్లీ వాయిదా వేసి కొత్త జిల్లాలను సీఎం ఏర్పాటు చేస్తుంటే నిలదీసి పోరాటం చేయాల్సిన కాంగ్రెస్ నాయకులు ఆయనకు వంత పడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర పునర్విభజన చట్టం తయారు చేయించిన కాంగ్రెస్ నాయకులు రాష్ట్రంలోనే ఉన్నారని, ఈ చట్టానికి వ్యతిరేకంగా కేసీఆర్ చర్యలు తీసుకుంటుంటే ఎందుకు నోరు విప్పడం లేదని రేవంత్ ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి స్పందించాలని డిమాండ్ చేశారు. కొత్త జిల్లాల ప్రాతిపదికన డీలిమిటేషన్ జరిగితే దాని ప్రభావం రిజర్వ్‌డ్ నియోజకవర్గాలపై పడుతుందన్నారు.

డీలిమిటేషన్‌పై ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం చూసినా.. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, పంచాయతీల సరిహద్దులు మార్చడానికి వీలులేదన్నారు. డీలిమిటేషన్‌కు ముందుగానే సరిహద్దులు, పరిధిని మార్చడం ద్వారా తాను అనుకున్న విధంగా నియోజకవర్గాల రిజర్వేషన్లు వచ్చేలా కుట్ర పన్నారని ఆరోపించారు. నేతలు దామోదర రాజనర్సింహ, భట్టివిక్రమార్క, గీతారెడ్డి, సండ్ర వెంకటవీరయ్య ప్రస్తుత నియోజకవర్గాలు ఎస్సీల నుంచి జనరల్‌గా మారిపోతాయని రేవంత్ చెప్పారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement