
చినరాజప్పకు త్రుటిలో తప్పిన ప్రమాదం
కాకినాడ ప్రైవేటు ఆస్పత్రిలో కూలిన లిఫ్ట్
కాకినాడ క్రైం: తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్పకు మంగళవారం త్రుటిలో ప్రమాదం తప్పింది. లిఫ్ట్ కూలడంతో మంత్రి చినరాజప్పతో పాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయి. నెక్కింటి సీఫుడ్‌సలో విషవాయువు లీకై అస్వస్థతకు గురైన బాధితులను పరామర్శించేందుకు మంగళవారం కాకినాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి చినరాజప్ప వచ్చారు.
బాధితులను పరామర్శించిన అనంతరం ఆయన తిరిగి వెళ్తూ ఆస్పత్రి లిఫ్ట్ ఎక్కారు. ఇంతలో తీగలు తెగిపోవడంతో లిఫ్ట్ కుప్పకూలింది. ఈ ఘటనలో చినరాజప్ప నడుముకు స్వల్వగాయమైంది. ఆయనతో పాటు లిఫ్ట్ ఎక్కిన ఒక కానిస్టేబుల్ కాలు విరగ్గా, మరో ఫొటోగ్రాఫర్‌కు కాలి ఎముక చిట్లిందని వైద్యులు తెలిపారు. కాగా, తన ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన పనిలేదని చినరాజప్ప తెలిపారు.