హోంమంత్రి చినరాజప్ప
విగ్రహం తాము ఏర్పాటు చేస్తామని వెల్లడి
మంత్రి వ్యాఖ్యలపై కాపు సంఘ నేతల ఆగ్రహం
మచిలీపట్నం టౌన్ : రాష్ట్రంలో శాంతియుత వాతావరణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగా విగ్రహం ధ్వంసం ఘటన జరగటం దురదృష్టకరమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. సోమవారం మచిలీపట్నం విచ్చేసిన ఆయన నిజాంపేటలోని సంఘటనా స్థలాన్ని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా చినరాజప్ప మాట్లాడుతూ ఈ ఘటన జరగటంపై ముఖ్యమత్రి చంద్రబాబునాయుడు కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారన్నారు. ఆయన సూచన మేరకు తాను ఇక్కడికి వచ్చానన్నారు.
పూర్తిస్థాయిలో విచారణ...
ఈ ఘటనపై పోలీస్ శాఖ పూర్తిస్థాయిలో విచారణ చేపట్టిందని హోంమంత్రి చెప్పారు. దుండగులు తెల్లవారుజామున ఈ ఘటనకు పాల్పడటంతో వాకింగ్‌కు వెళ్లేవారు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారని తెలిపారు. విగ్రహ ధ్వంసానికి పాల్పడ్డ వ్యక్తులను పట్టుకుని తీరతామన్నారు. కులాలను రెచ్చగొట్టే పరిస్థితి రాకూడదన్నారు. ఈ ఘటన చూస్తుంటే కుట్ర పూరితంగానే జరిగినట్లుందన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపడతామన్నారు. ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన కమిటీతో మాట్లాడి ఈ ప్రాంతంలో మంచి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారని ఆయన వెల్లడించారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ కొన్ని దుష్ట శక్తులు ఈ ఘటనకు పాల్పడటం దురదృష్టకరమన్నారు. ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ పర్యటనలో చినరాజప్ప వెంట రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామాంజనేయులు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు, మునిసిపల్ చైర్మన్ బాబాప్రసాద్ తదితరులు ఉన్నారు.
హోంమంత్రి వ్యాఖ్యలపై కాపు నేతల ఆగ్రహం
రంగా నూతన విగ్రహాన్ని కమిటీతో మాట్లాడి పెట్టిద్దామని చంద్రబాబునాయుడు చెప్పారని హోం శాఖ మంత్రి చినరాజప్ప పేర్కొనటంతో ఆ ప్రాంత విగ్రహ ఏర్పాటు కమిటీ సభ్యులతో పాటు కాపు సంఘ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చినరాజప్పను చుట్టుముట్టిన కాపు నాయకులు, రంగా అభిమానులు విగ్రహాన్ని తమకు ఎవరూ ఇవ్వనవసరం లేదని, తామే రూపాయి.. రూపాయి పోగేసి నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటామని స్పష్టం చేశారు. ఎవ్వరి రూపాయీ తాము తీసుకోబోమన్నారు. ఈ విగ్రహ ధ్వంసం ఘటనకు పాల్పడిన దుండగులను పట్టుకుని శిక్షించటంలో తాత్సారం చేయొద్దని మంత్రిని కోరారు. ఈ సందర్భంగా ‘విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తులను పట్టుకుని కఠినంగా శిక్షించాలి’, ‘జోహార్.. వీఎం రంగా..’ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు.