The statue
-
వైఎస్ విగ్రహ ధ్వంసం పిరికిపందల చర్య
మంత్రి అండదండలతోనే విధ్వంసాలు రెచ్చగొడితే చూస్తూ ఊరుకోం విగ్రహం ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలి నిరశన కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ చెన్నేకొత్తపల్లి : అధికారంలో ఉన్నవారు అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టాలి కానీ అల్లరిమూకలను ప్రేరేపించడం సరికాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ టీడీపీ నాయకులకు హితవు పలికారు. రాష్ట్రంలో ఆటవికపాలన సాగుతోందని, చంద్రబాబునాయుడు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మండల కేంద్రమైన చెన్నేకొత్తపల్లిలో ఏర్పాటు చేసిన దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ దుశ్చర్యను నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం వైఎస్సార్ విగ్రహం వద్ద శాంతియుత నిరశన కార్యక్రమం చేపట్టారు. శంకరనారాయణతోపాటు రాప్తాడు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ మైలారపు రమణారెడ్డి, పలువురు నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శంకరనారాయణ మాట్లాడుతూ జిల్లాలోని తాడిపత్రి, ధర్మవరం, రాప్తాడు, శింగనమలతోపాటు మరిన్ని నియోజకవర్గాల్లో అధికార పార్టీ వారి ఆగడాలు శృతి మించాయన్నారు. రాప్తాడు నియోజకవర్గంలో ఇప్పటివరకు నాలుగుచోట్ల వైఎస్సార్ విగ్రహాలను ధ్వంసం చేశారన్నారు. మంత్రి అండదండలతోనే ఇవన్నీ జరుగుతున్నాయని, ఇది నీతిమాలిన పిరికిపందల చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము శాంతిని కోరుకుంటున్నామని, తమ సహనాన్ని చేతగానితనంగా భావించి రెచ్చగొడితే చూస్తూ ఊరుకునేది లేదని ఆయన ఘాటుగా హెచ్చరించారు. వైఎస్ విగ్రహం «ధ్వంసం చేసినవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం న్యామద్దెల సర్కిల్ నుంచి పోలీస్‌స్టేషన్ వరకు ప్రభుత్వానికి, మంత్రి సునీతకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీగా వెళ్లి రామగిరి సీఐ యుగంధర్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. దోషులను వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని, ఇలాంటి సంఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ మెట్టుగోవిందరెడ్డి, స్థానిక సర్పంచ్ క్రిష్ణారెడ్డి, న్యామద్దెల ఎంపీటీసీ లక్ష్మీనారాయణ, దామాజిపల్లి సొసైటీ అధ్యక్షుడు సంజీవరెడ్డి, సొసైటీ డైరెక్టర్ ప్యాదిండి నరసింహారెడ్డి, నాయకులు గాలిశ్రీనివాసరెడ్డి, పుల్లారెడ్డి, రామక్రిష్ణారెడ్డి, శ్రీనివాసరెడ్డి, లింగమయ్య, హరినాథ్‌రెడ్డి, క్రిష్ణమూర్తి, రామాంజి, నగేష్, రాప్తాడు మండల కన్వీనర్ రామాంజినేయులు, వరప్రసాద్‌రెడ్డి, అమర్నాథ్రెడ్డి, సాకే నారాయణ, నందకుమార్‌రెడ్డి, లింగారెడ్డి, చిన్ననరసింహులు, ప్రతాప్, జయరామిరెడ్డి, సత్యనారాయణరెడ్డి, తాతిరెడ్డి, చంద్రశేర్‌రెడ్డి, సిద్దప్ప తదితరులు పాల్గొన్నారు. ఎదుర్కొనే ధైర్యంలేకే... వైఎస్ జగన్మోహన్రెడ్డికి పెరుగుతున్న జనాదరణ చూసి ఓర్వలేకే మంత్రి అనుచరుల అండదండలతో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేశారని రాప్తాడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ మైలారపు రమణారెడ్డి అన్నారు. ఆయన నిరశన కార్యక్రమానికి మద్దతు పలికి ర్యాలీలో పాల్గొన్నారు. అధికార పార్టీ వారు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో వైఎస్ విగ్రహాలను ధ్వంసం చేశారన్నారు. ప్రశాంతంగా ఉన్న చెన్నేకొత్తపల్లిలోనూ చిచ్చు పెట్టేందుకే ఇలాంటి దుశ్చర్యకు పాల్పడ్డారన్నారు. మంత్రి అల్లరిమూకలను పెంచి పోషిస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదని హితవు పలికారు. రాప్తాడు మండల కన్వీనర్ బోయ రామాంజినేయులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రాప్తాడు నియోజకవర్గంలో టీడీపీ నాయకుల అరాచకాలు అధికమయ్యాయన్నారు. రాప్తాడు ఎమ్మెల్యేగా ఉన్న పరిటాల సునీతకు పౌరసరఫరాల శాఖను తప్పించి స్త్రీ శిశు సంక్షేమశాఖను అప్పగించినా బుద్ధి రాలేదన్నారు. -
కృష్ణదేవరాయలు విగ్రహానికి క్షీరాభిషేకం
అనంతపురం సప్తగిరి సర్కిల్: రెక్టార్ పదవిని రి జర్వేషన్ వర్గాల వారికి కేటాయించాలని డిమాండ్ చేస్తూ వర్సిటీలో ఆదివారం కృష్ణ దేవరాయలు విగ్రహానికి విద్యార్థి సం ఘాల నాయకులు క్షీరాభిషేకం చేశారు. వారు మాట్లాడుతూ రెక్టార్ పోస్టును రిజర్వేషన్వ వర్గాలకు కేటాయించకుండా మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఉన్నత పదవులను రిజర్వేషన్ వర్గాలకు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. తప్పుడు సమాచారంతో యూజీ, పీజీ, డిస్టెన్సు విభాగాలను అస్తవ్యçస్తంగా మార్చినవారిని నుంచి తొలగించి రిజర్వేషన్ వర్గాలవారితో ఆ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్‌ఎస్‌యూ నాయకులు క్రాంతికిరణ్, నాగార్జున, రాజు, ఎన్ఎస్యూఐ నాయకులు పులిరాజు, బాబు, నరేష్, ఏఐఎస్ఎఫ్ నాయకులు పాల్గొన్నారు. -
ధర్మసాగర్లో శేఖర్‌బాబు విగ్రహం ఏర్పాటు
వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ ఆకట్టుకున్న గయో పాఖ్యానం నాటకం హన్మకొండ కల్చరల్ : తెలంగాణ పద్యనాటకానికి గుర్తింపు తెచ్చిన పందిళ్ల శేఖర్‌బాబు విగ్రహాన్ని ఆయన జన్మించిన ధర్మసాగర్లో ఏర్పాటు చేసేందుకు తనవంతు కృషి చేస్తానని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమే ష్ అన్నారు. తెలంగాణ రాష్ట్రభాషా సాంస్కృతికశాఖ సౌజన్యంతో పందిⶠ్ల శేఖర్‌బాబు స్మారక పద్యనాటక సప్తాహ కమిటీ ఆధ్వర్యంలో హన్మకొండ పబ్లిక్‌గార్డెన్‌లోని నేరేళ్ల వేణుమాధవ్ కళాప్రాంగణంలో నిర్వహిస్తు న్న రాష్ట్రస్థాయి పద్యనాటక ప్రదర్శనలు ఆది వారం మూడో రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ప్రదర్శనలను సాయంత్రం ఎమ్మెల్యే అరూరి రమేష్, సీఎం కార్యాలయ ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రా రంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కళాకారుల దే ముఖ్య పాత్ర అన్నారు. దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ ఓరుగల్లు కళలకు పుట్టినిల్లు అన్నారు. హైదరాబాద్‌లో కూడా ఇలాంటి పౌరాణిక పద్య నాటక ఉత్సవాలు నిర్వహించేందుకు కృషి చేస్తామన్నారు. తెలుగు విశ్వవిద్యాలయం శేఖర్‌బాబు పేరిట అవార్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేస్తానన్నారు. కాగా, హార్మోనిస్టు భద్రాచలం భాగవతార్‌ను ఎమ్మెల్యే అరూరి రమేష్, దేశపతి శ్రీనివాస్, నిర్వాహకులు శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో వరంగల్ దూరదర్శన్ డైరెక్టర్ ఎం.వరప్రసాదరావు, వరంగల్ ఆకాశవాణి అసిస్టెంట్ డైరెక్టర్ సి.జయపాల్‌రెడ్డి, తెలంగాణ రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు పొట్లపల్లి శ్రీనివాసరావు, టీఎన్జీ వో జిల్లా అధ్యక్షుడు కోల రాజేష్, గెజిటెడ్ ఆఫీసర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు ఏఎస్ జగన్మోçßæన్‌రావు, శతపథి శ్యామల్రావు, పంది ళ్ల అశోక్‌కుమార్, బూర విద్యాసాగర్, జ్యోతి జయాకర్రావు, ఓడపల్లి చక్రపాణి, మారేడోజు సదానందచారి పాల్గొన్నారు. ఆకట్టుకున్న నాటక ప్రదర్శన వరంగల్ కాకతీయ నాటక కళాపరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన గయోపాఖ్యాన ం పద్యనాటకం సభికులను ఆకట్టుకుంది. కాకతీయ నాటక కళాపరిషత్ అధ్యక్షుడు నాయకపు స మ్మయ్యగౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ప్రదర్శన లో కళాకారులు అద్భుత ప్రదర్శన ఇచ్చారు. ఇందులో దేవరాజు రవీందర్రావు, వెంకట కృష్ణ, అంజిరెడ్డి, ఆకుల సదానందం, భిక్షప తి, రవీందర్, గణేశ్‌కుమార్, రాగి వీరబ్రహ్మచారి, శ్రీనివాస్, సాల్వాచారి, శ్రీరాజు సుం దరమూర్తి, బిటవరం శ్రీధరస్వామి, రమాలక్ష్మి, వెంగమాంబ నటించారు. కాగా, సోమవారం సాయంత్రం మహబూబ్‌నగర్ జనతా సేవా సమితి ఆధ్వర్యంలో విప్రనారాయణ నాటకం ప్రదర్శించనున్నారు. -
రంగా విగ్రహ ధ్వంసం దురదృష్టకరం
హోంమంత్రి చినరాజప్ప విగ్రహం తాము ఏర్పాటు చేస్తామని వెల్లడి మంత్రి వ్యాఖ్యలపై కాపు సంఘ నేతల ఆగ్రహం మచిలీపట్నం టౌన్ : రాష్ట్రంలో శాంతియుత వాతావరణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగా విగ్రహం ధ్వంసం ఘటన జరగటం దురదృష్టకరమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. సోమవారం మచిలీపట్నం విచ్చేసిన ఆయన నిజాంపేటలోని సంఘటనా స్థలాన్ని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా చినరాజప్ప మాట్లాడుతూ ఈ ఘటన జరగటంపై ముఖ్యమత్రి చంద్రబాబునాయుడు కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారన్నారు. ఆయన సూచన మేరకు తాను ఇక్కడికి వచ్చానన్నారు. పూర్తిస్థాయిలో విచారణ... ఈ ఘటనపై పోలీస్ శాఖ పూర్తిస్థాయిలో విచారణ చేపట్టిందని హోంమంత్రి చెప్పారు. దుండగులు తెల్లవారుజామున ఈ ఘటనకు పాల్పడటంతో వాకింగ్‌కు వెళ్లేవారు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారని తెలిపారు. విగ్రహ ధ్వంసానికి పాల్పడ్డ వ్యక్తులను పట్టుకుని తీరతామన్నారు. కులాలను రెచ్చగొట్టే పరిస్థితి రాకూడదన్నారు. ఈ ఘటన చూస్తుంటే కుట్ర పూరితంగానే జరిగినట్లుందన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపడతామన్నారు. ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన కమిటీతో మాట్లాడి ఈ ప్రాంతంలో మంచి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారని ఆయన వెల్లడించారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ కొన్ని దుష్ట శక్తులు ఈ ఘటనకు పాల్పడటం దురదృష్టకరమన్నారు. ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ పర్యటనలో చినరాజప్ప వెంట రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామాంజనేయులు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు, మునిసిపల్ చైర్మన్ బాబాప్రసాద్ తదితరులు ఉన్నారు. హోంమంత్రి వ్యాఖ్యలపై కాపు నేతల ఆగ్రహం రంగా నూతన విగ్రహాన్ని కమిటీతో మాట్లాడి పెట్టిద్దామని చంద్రబాబునాయుడు చెప్పారని హోం శాఖ మంత్రి చినరాజప్ప పేర్కొనటంతో ఆ ప్రాంత విగ్రహ ఏర్పాటు కమిటీ సభ్యులతో పాటు కాపు సంఘ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చినరాజప్పను చుట్టుముట్టిన కాపు నాయకులు, రంగా అభిమానులు విగ్రహాన్ని తమకు ఎవరూ ఇవ్వనవసరం లేదని, తామే రూపాయి.. రూపాయి పోగేసి నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటామని స్పష్టం చేశారు. ఎవ్వరి రూపాయీ తాము తీసుకోబోమన్నారు. ఈ విగ్రహ ధ్వంసం ఘటనకు పాల్పడిన దుండగులను పట్టుకుని శిక్షించటంలో తాత్సారం చేయొద్దని మంత్రిని కోరారు. ఈ సందర్భంగా ‘విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తులను పట్టుకుని కఠినంగా శిక్షించాలి’, ‘జోహార్.. వీఎం రంగా..’ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. -
శ్రీకాంతాచారి విగ్రహం ధ్వంసం
నిరసనగా రోడ్డుపై శంకరమ్మ బైఠాయింపు మేళ్లచెర్వు: తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి విగ్రహాన్ని నల్లగొండ జిల్లా మేళ్లచెర్వు మండల కేంద్రంలో శనివారంరాత్రి దుండగు లు ధ్వంసం చేశారు. విగ్రహం కుడిచేతిని విరగ్గొట్టారు. ఇటీవల అక్కడ శ్రీకాంతాచారి సిమెంట్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీనిని ఈ నెల 1న మంత్రి హరీశ్‌రావు ప్రారం భించాల్సి ఉంది. అయితే ఆ రోజు కార్యక్రమం రద్దు కావడంతో తేదీని ఇంకా ఖరారు చేయలేదు. ఈ లోపే విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దుండగుల చర్యను నిరసిస్తూ ఆదివారం మండల కేంద్రంలోని ప్రధాన కూడలిలో టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి, శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ ఆధ్వర్యంలో రెండు గంటలపాటు రాస్తారోకో నిర్వహించారు. శంకరమ్మ మాట్లాడుతూ ఉద్యమకారుల విగ్రహాలను ధ్వంసం చేయడం పిరికిపందల చర్యగా పేర్కొన్నారు. అనంతరం మండలానికి చెందిన అల్లం ప్రభాకర్‌రెడ్డి, రంగాచారి, హరిలక్ష్మణ్ కుమార్, ఉమాకాంత్‌లపై అనుమానం వ్యక్తం చేస్తూ ఎస్ఐ శ్రీనివాసరెడ్డికి ఫిర్యాదు చేశారు.