
మహానాడులో యనమల..
సాక్షి, విజయవాడ: టీడీపీ మహానాడు వేదికగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాపై ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకష్ణుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో జరిగిన మహానాడులో ప్రసంగించిన ఆయన...అమిత్ షా, మోదీలు నియంతలు అంటూ ధ్వజమెత్తారు. వారిద్దరిని ముస్సోలిని, హిట్లర్‌లతో పోల్చారు.
‘గత ఎన్నికల్లో బీజేపీతో జతకడితేనే టీడీపీ అధికారంలోకి వచ్చిందని కొందరు మాట్లాడుతున్నారు. బీజేపీ ఉన్నా.. లేకపోయినా టీడీపీ అధికారంలోకి రావాలని 2014లో ప్రజలు కోరుకున్నార’ని ఆయన అన్నారు. కర్ణాటకలో బీజేపీని ఓడించాలని చంద్రబాబు నాయుడు పిలుపునివ్వడం వల్లే ఆ పార్టీకి అధికారం దూరమైందని యనమల పేర్కొన్నారు. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న నియోజక వర్గాల్లో బీజేపీ ఓడిపోయిందని తెలిపారు.
కర్ణాటక నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు హాజరు కావడం దేశంలో రాజకీయ పునరేకీకరణకు తార్కాణమని యనమల అన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు మార్చుకుంటామని ఆయన అన్నారు. గడిచిన కాలంలో కాలానుగుణంగా నిర్ణయాలు తీసుకున్నామని వెల్లడించారు. దేశ రాజకీయాల్లో టీడీపీ చురుకైన పాత్ర పోషించాలని మహానాడులో రాజకీయ తీర్మానాన్ని ఆమోదించారు.
Comments
Please login to add a commentAdd a comment