వాడీవేడిగా జెడ్పీ సమావేశం | Emergency general meeting of the Zilla Parishad | Sakshi
Sakshi News home page

వాడీవేడిగా జెడ్పీ సమావేశం

Published Thu, Oct 30 2014 3:11 AM | Last Updated on Sat, Sep 2 2017 3:34 PM

వాడీవేడిగా జెడ్పీ సమావేశం

వాడీవేడిగా జెడ్పీ సమావేశం

  • ఎజెండా పత్రాలు ఇవ్వకపోవడంపై సభ్యుల ఆగ్రహం
  •  మధ్యలోనే వెళ్లిపోయిన మంత్రులు
  •  ప్రొటోకాల్‌పై నిలదీసిన వైఎస్సార్ సీపీ ప్రతినిధులు
  • మచిలీపట్నం : జిల్లా పరిషత్ అత్యవసర సర్వసభ్య సమావేశం ఆద్యంతం వాడీవేడిగా సాగింది. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జెడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లాకు చెందిన మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, అసెంబ్లీ డెప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, కలెక్టర్ రఘునందన్‌రావు పాల్గొన్నారు. కృష్ణా రివర్ బోర్డు సమావేశంలో పాల్గొనాలని మంత్రి దేవినేని ఉమా సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు.

    ఆ తర్వాత కొద్దిసేపటికే మరో మంత్రి కొల్లు రవీంద్ర, శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ సమావేశంలో కొద్దిసేపు ప్రసంగించి వెళ్లిపోయారు. సమావేశం ప్రారంభమైన వెంటనే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన తమను మండల పరిషత్ సర్వసభ్య సమావేశాలకు ఏ హక్కుతో హాజరవుతున్నారంటూ కొన్ని మండలాల్లో ప్రశ్నిస్తున్నారని పలువురు జెడ్పీటీసీ సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు.

    వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో ప్రభుత్వ నిధుల వినియోగం, అభివృద్ధి కార్యక్రమాలు, ఎంపీలు, మంత్రుల పర్యటనల వివరాలు తమకు తెలియజేయకుండానే ముగిస్తున్నారని పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన ఆగ్రహం వ్యక్తంచేశారు. రుణమాఫీ చేసినట్లు చెబుతున్నారని, ఎంతమందికి చేశారు.. ఎంత మొత్తం చేశారు.. నియోజకవర్గాల వారీగా జాబితాలు ఉన్నాయా.. లేవా.. ఈ విషయంపై కలెక్టర్ సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్‌చేశారు.

    జిల్లాలో బెల్టుషాపులు యథావిధిగా కొనసాగుతున్నాయని, మద్యం షాపులకు అనుబంధంగా పర్మిట్ రూమ్‌లు ఇస్తున్నారని, వీటిని రద్దు చేస్తారా, లేదా.. అని కల్పన నిలదీశారు. అనంతరం గూడూరు మండల పరిషత్ సమావేశంలో వైఎస్సార్ సీపీకి చెందిన సర్పంచిలు, ఎంపీటీసీ సభ్యులను మాట్లాడొద్దని అధికారులే హుకుం జారీ చేస్తున్నారని, ఈ పద్ధతిలో మార్పు రావాలని ఆ పార్టీ సభ్యులు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు.
     
    అజెండా కాపీలు అందలేదు..

    జిల్లా పరిషత్ సమావేశం జరుగుతున్నా ఇంతవరకు సభ్యులకు ఎజెండా కాపీలను ఇవ్వలేదని, తాము ఏ అంశాలపై చర్చించాలని సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ సమావేశంలో ఎలాంటి అంశాలు చర్చించకూడదనే ఈ తరహాగా వ్యవహరిస్తున్నారని సభ్యులు ఆరోపించారు. సామాజిక పింఛన్ల పంపిణీలోనూ ప్రభుత్వం దాటవేత ధోరణితో వ్యవహరిస్తోందని, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా గతంలో రుణాలు మంజూరు చేసేందుకు అన్ని అనుమతులు ఇచ్చిన లబ్ధిదారులకు కాకుండా వేరే జాబితాలను తయారు చేసి రుణాలు ఇప్పించేందుకు గ్రామకమిటీ సభ్యులు ప్రయత్నిస్తున్నారని, ఈ విషయంపై పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు.
     
    ఇసుక వ్యవహారంపై రగడ

    భూగర్భ గనుల శాఖపై జరిగిన సమీక్షలో ఇసుక రీచ్‌లను డ్వాక్రా సంఘాలకు అప్పగించటం, స్థానిక సంస్థలకు వచ్చే ఆదాయాన్ని గండికొట్టడం తదితర అంశాలపై వాడీవేడిగా చర్చ జరిగింది. గతంలో ఇసుక సీనరేజీ ద్వారా వచ్చే ఆదాయం నేరుగా జిల్లా పరిషత్‌కు జమ అయ్యేదని, ప్రస్తుతం ప్రభుత్వం నిబంధనలు సడలించి నిధులను తన ఖాతాలో వేసుకుంటోందని, మొక్కుబడిగా క్యూబిక్ మీటరుకు రూ.40లు మాత్రమే ఇస్తోందని తోట్లవల్లూరు ఎంపీపీ కె.వెంకటేశ్వరరెడ్డి తెలిపారు.

    ఇసుక రేవులు ఉన్న గ్రామాల పరిధిలో గృహనిర్మాణం కోసం ఎడ్లబండి, ట్రాక్టర్లపై ఇసుక తీసుకువెళుతున్నా పోలీసులు, రెవెన్యూ, మండల పరిషత్ అధికారులు వాటిని సీజ్ చేసి రూ. 15వేలు జరిమానా విధిస్తున్నారని నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావుతో పాటు పలువురు సభ్యులు పేర్కొన్నారు. అయితే పెద్ద లారీల ద్వారా హైదరాబాదుకు తరలివెళుతున్న ఇసుకను అదుపు చేయటంలో అధికారులు విఫలమవుతున్నారని ఆరోపించారు. జిల్లా పరిషత్ సమావేశం జరిగే సమయంలో సభ్యులకు సరైన సమాచారం ఇవ్వటం లేదని, గత సమావేశంలో అడిగిన సమాచారాన్ని ఇప్పటి వరకు ఇవ్వలేదని జిల్లా పరిషత్ ప్రతిపక్ష నాయకురాలు తాతినేని పద్మావతి అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
     
    బాధ్యత పెరిగింది : బుద్ధప్రసాద్

    అసెంబ్లీ డెప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంతరం జిల్లా ప్రజలపై బాధ్యత పెరిగిందన్నారు. జిల్లా సరిహద్దులోనే రాజధాని ఏర్పడనున్న సమయంలో మనపై గురుతర బాధ్యత ఉందన్నారు. ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుని ముందడుగు వేయాలన్నారు. ఇటీవల తాను అమెరికాలో పర్యటించానని, కృష్ణాజిల్లాకు చెందిన ఎన్‌ఆర్‌ఐలతో సమావేశమయ్యానని చెప్పారు. తమ గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ఆర్థిక సాయం చేసేందుకు ఎన్‌ఆర్‌ఐలు ముందుకు వచ్చారని తెలిపారు.

    కలెక్టర్ ఈ విషయంపై స్పందించి ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేయటంతోపాటు ఎన్‌ఆర్‌ఐలు నగదు పంపేందుకు ప్రభుత్వం ద్వారానే ఒక బ్యాంకు ఖాతాను ఏర్పాటు చేయాలని కోరారు. తొలుత హుదూద్ తుపాను ప్రభావంతో మరణించిన వారు, ఇటీవల షిర్డీ యాత్రకు వెళ్లి బస్సు ప్రమాదంలో మృతిచెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు.  తిరువూరు ఎమ్మెల్యే కె.రక్షణనిధి, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు, జెడ్పీ సీఈవో డి.సుదర్శనం, ఆయా మండలాల జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు పాల్గొన్నారు.
     
    నూతనంగా 41,814 మందికి పింఛన్లు : ఉమా

    సమావేశంలో పాల్గొన్న నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతూ జన్మభూమి కార్యక్రమంలో జిల్లాలో 1.18 లక్షల మందికి రూ. 12.31 కోట్లను పింఛన్లుగా అందజేశామన్నారు. తొలుత జిల్లాలో 14వేల మంది పింఛన్లు పొందేందుకు అనర్హులుగా గుర్తించగా, వీటిని పునఃపరిశీలించి 7,936 మందికి పునరుద్ధరించినట్లు తెలిపారు. జిల్లాలో 33,878 మందికి నూతనంగా పింఛన్లు మంజూరు చేసినట్లు చెప్పారు. నవంబరులో జరిగే జన్మభూమిలో నూతన లబ్ధిదారులకు పింఛన్లు మంజూరు చేస్తామన్నారు. మండలాల్లో, జిల్లావ్యాప్తంగా అధికారులు ప్రొటోకాల్ పాటించాలని, అలా చేయని పక్షంలో సంబంధిత శాఖల అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. జిల్లాలో రెండో పంటకు సాగునీరు విడుదల చేసే విషయమై నవంబరులో సమావేశం నిర్వహించి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు.
     
    ప్రతిపక్షం నిర్ణయాత్మక పాత్ర పోషించాలి : కొల్లు రవీంద్ర

    జిల్లా పరిషత్ సమావేశం జరిగే సమయంలో ప్రతిపక్షంగా ఉన్న వైఎస్సార్ సీపీ సభ్యులు నిర్ణయాత్మక పాత్రను పోషించాలని బీసీ సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. రైతుల రుణమాఫీ కోసం ప్రభుత్వం రైతుసాధికార సంస్థను ఏర్పాటు చేసిందని, మొదటి విడతగా రూ. 5వేల కోట్లను విడుదల చేయటం జరిగిందన్నారు. జిల్లాలో వైద్యుల పోస్టులను త్వరలో భర్తీ చేస్తామన్నారు. జిల్లా పరిషత్ ప్రాంగణంలో నందమూరి తారకరామారావు విగ్రహం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లోని వసతి గృహాలు, ఆస్పత్రులపై ప్రజాప్రతినిధుల పర్యవేక్షణ అవసరమన్నారు. బెల్టు షాపులు అరికట్టేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోంటుందని చెప్పారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement