అప్రమత్తంగా ఉండండి : ఉమా
కోడూరు/(చిలకలపూడి)మచిలీపట్నం : హుదూద్ తుపాను ప్రభావం నేపథ్యంలో తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులకు సహకరించాలని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కోరారు. శుక్రవారం రాత్రి కోడూరు మండలం పాలకాయతిప్ప సమీపంలోని సముద్ర తీరాన్ని జిల్లా అధికార యంత్రాంగంతో కలిసి ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తుపాను వీడే వరకు అధికారులకు సెలవులు రద్దు చేసినట్లు తెలిపారు. తీరంలో పరిస్థితిని బందరు ఆర్డీవో సాయిబాబు, సోషల్ వెల్ఫేర్ డీడీ మధుసుదనరావు వివరించారు. మాజీ ఎమ్మెల్యే అంబటి శ్రీహరి ప్రసాద్, జెడ్పీటీసీ సభ్యుడు బండే శ్రీనివాసరావు, ఎంపీపీ మాచర్ల భీమయ్య, మచిలీపట్నం మాజీ మున్సిపాల్ చైర్మన్ బచ్చుల అర్జునుడు, డ్రైనేజీ డీఈ మారుతీ ప్రసాద్, తహశీల్దార్ ఎంవీ సత్యనారాయణ, ఎంపీడీవో కె.జ్యోతి పాల్గొన్నారు.
బందరులో సమీక్ష
తుపానుపై మంత్రి దేవినేని ఉమా శుక్రవారం రాత్రి మచిలీపట్నంలోని కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ రఘునందన్‌రావు, జేసీ మురళి, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తదితరులు పాల్గొన్నారు.
పులిచింతల నుంచి వచ్చే ఖరీఫ్‌కు 42 టీఎంసీల సాగునీరు
కోడూరు : వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి పులిచింతల ప్రాజెక్టు ద్వారా 42 టీఎంసీల నీటిని నిలువ చేసి, కృష్ణా డెల్టాలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. కోడూరు మండలంలోని మాచవరం గ్రామంలో శుక్రవారం నిర్వహించిన ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమంలో మంత్రి ఉమా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొత్తం రూ.30 కోట్లు పింఛన్లు ఇచ్చి పేదలకు భరోసా కల్పించినట్లు తెలిపారు.