సమైక్య పోరుకు ‘దేశం’ దూరం
సమైక్య పోరుకు ‘దేశం’ దూరం
Published Sat, Aug 10 2013 1:38 AM | Last Updated on Fri, Sep 1 2017 9:45 PM
సాక్షి, విజయవాడ : సమైక్యాంధ్ర పోరాటానికి తెలుగుదేశం పార్టీ తిలోదకాలు ఇచ్చిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా చంద్రబాబు నాయుడు పెదవి విప్పకపోవడం, ఏపీ ఎన్జీవో సంఘం నేతలు ఆయన్ను కలిసినా సానుకూలంగా స్పందించకపోవడంతో ఆయన బాటలోనే జిల్లా నేతలు నడిచేందుకు సిద్ధమౌతున్నారు. నిన్నటి వరకు మొక్కుబడిగా సమైక్యాంధ్ర ఉద్యమాలు చేసిన జిల్లా దేశం నాయకులు ప్రస్తుతం పోరాటాలకు దూరంగా ఉంటున్నారు. రాష్ట్రాన్ని ఐక్యంగా ఉంచేందుకు పోరాటాలు చేయాల్సిన నేతలు నేడు సీమాంధ్ర హక్కుల పేరుతో ఉద్యమం చేసి తమ ఉనికిని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
దేవినేని ఉమా పలాయనం!
శుక్రవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పలువురు విలేకరులు జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావును సమైక్యాంధ్ర ఉద్యమంపై ప్రశ్నల వర్షం కురిపించారు. సమైక్యాంధ్ర కోసం ఆనాడు చేసిన నిరాహారాదీక్షలు ఇప్పుడు ఎందుకు చేయడం లేదని నిలదీశారు. చంద్రబాబునాయుడుపై వత్తిడి పెంచి సమైక్యాంధ్రకు మద్దతుగా ఎందుకు ప్రకటన చేయించలేకపోతున్నారంటూ ప్రశ్నించారు?
ప్రజలు, ఉద్యోగ, కార్మిక,వ్యాపార సంఘాలు రోడ్లపైకి వచ్చి సమైక్యాంధ్ర కోసం పోరాటం చేస్తుంటే తెలుగుదేశం నేతలు ఎందుకు స్పందించడం లేదని, ప్రస్తుతం తెలుగుదేశం సమైక్యపోరాటాన్ని పక్కన పెట్టి సీమాంధ్ర హక్కుల కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని గుచ్చిగుచ్చి అడిగారు. దీనిపై దేవినేని ఉమాతో పాటు ఇతర నాయకుల నుంచి సరియైన స్పందన రాలేదు. తాను మాత్రం సమైక్యవాదినేనంటూ... సీమాంధ్ర హక్కుల కోసం పోరాడాతనంటూ చెప్పి అర్ధంతరంగా విలేకరుల సమావేశం ముగించి వెళ్లిపోవడం చర్చనీయాశంగా మారింది. దీంతో చంద్రబాబు నాయుడు తరహాలో దేవినేని ఉమా కూడా రెండు కళ్లు సిద్దాంతం అవలంభిస్తున్నారని విమర్శలు వినవచ్చాయి.
ఇక సీమాంధ్ర హక్కుల కోసం పోరాటం?
సీమాంధ్ర హక్కుల కోసం పోరాటం చేస్తామంటూ దేవినేని ఉమా కొత్త నినాదంతో తెరపైకి వస్తున్నారు. ఆయన బాటలోనే తెలుగుయువత అధ్యక్షుడు దేవినేని చంద్రశేఖర్ శనివారం పటమట ఎన్టీఆర్ సర్కిల్ వద్ద సీమాంధ్ర హక్కుల కోసం ప్రదర్శన నిర్వహిస్తున్నారు. రాబోయే రోజుల్లో జిల్లా, అర్బన్ దేశం పార్టీలు సమైక్యాంధ్రను మఓచిపోయి సీమాంధ్ర హక్కుల కోసమే పోరాటం చేస్తారని తెలిసింది. అధికారంలో ఉన్న తొమ్మిది సంవత్సరాలు రైతుల గురించి ఏనాడు పట్టించుకోని తెలుగుదేశం పార్టీ నేతలు ఆ తరువాత రైతుల పై అపార ప్రేమ కురిపించసాగారు. అలాగే సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతున్నప్పుడు దీన్ని వదిలివేసి సీమాంధ్రులపై కపట ప్రేమకు సిఈఏఛీమౌతున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. నేల వదిలి సాము చేసే దేశం నేతల్ని ప్రజలు ఏ మేరకు గౌరవిస్తారో వేచి చూడాలి.
Advertisement
Advertisement