సమగ్ర సోమశిలే లక్ష్యం
సోమశిల: సోమశిల జలాశయం నుంచి రాష్ట్రమంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, పొంగూరు నారాయణ డెల్టాకు శనివారం నీటిని విడుదల చేశారు. తొలుత జలాశయం వద్ద మంత్రితో కలిసి జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, ఎమ్మెల్యేలు మేకపాటి గౌతమ్‌రెడ్డి, కురుగొండ్ల రామకృష్ణ, బొల్లినేని రామారావు, పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డితో పాటు అధికారులు క్రస్ట్‌గేట్ల వద్ద సంప్రదాయబద్ధంగా గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించారు.
అనంతరం పెన్నార్‌డెల్టాకు వాయునాలు చెల్లించి నీటి విడుదల ప్రక్రియను ప్రారంభించారు. డెల్టాకు వెయ్యి క్యూసెక్కులు, ఉత్తర కాలువకు 50 క్యూసెక్కులను లాంఛనంగా విడుదల చేశారు. డ్యామ్‌సైట్ ఆఫీస్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు,కలెక్టర్‌తో కలిసి దేవినేని ఉమ విలేకరుల సమావేశం నిర్వహించారు. మంత్రి దేవినేని ఉమ మాట్లాడుతూ కృష్ణ, గోదావరి, పెన్నార్‌డెల్టాలలో పరిస్థితులను సమీక్షించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేశామన్నారు. వారు నవంబర్‌లో పరిశీలిస్తారన్నారు. వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తయితే జిల్లాకు ఎంతో మేలు కలుగుతుందన్నారు. అనంతపురం జిల్లాకు సాగు,తాగునీరు అందించేందుకు పూర్తి స్థాయిలో సమీక్షిస్తున్నామన్నారు.
జలాశయం పరిధిలోని ఆయకట్టు రైతులు తమకు ఎక్కడ ఏ పని కావాలో అధికారులకు విన్నవిస్తే వెంటనే వాటిని పూర్తి చేయాలని ఆదేశించామన్నారు. నిధులు విడుదల చేసే బాధ్యత తమదేనన్నారు. సమగ్ర సోమశిలకు ప్రధాన అడ్డంకిగా ఉన్న అటవీ అనుమతులపై ఉన్నత స్థాయి అధికారులతో సమీక్షించి సాధించేందుకు కృషి చేస్తామన్నారు. హైలెవల్ కాలువకు కూడా మొదటి దశ పనులను త్వరలో ప్రారంభిస్తారన్నారు. దీంతో ఈ జిల్లాలో మెట్ట ప్రాంతాలకు సాగు, తాగునీరు అందేలా చర్యలు చేపడతామన్నారు. ఈ సమావేశంలో ఎస్‌ఈలు సాబ్‌జాన్,కోటేశ్వరరావు, ఆర్డీఓ ఎంవీ రమణ పాల్గొన్నారు.
రైతు ప్రయోజనాలే ముఖ్యం : మంత్రి దేవినేని ఉమా
ఆత్మకూరు/సోమశిల: రాష్ట్రంలో రైతు ప్రయోజనాలే ముఖ్యమని రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మం త్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. శనివారం సోమశిల జలాలను విడుదల చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. గోదావరి,కృష్ణ, పెన్నా డెల్టా ప్రాజెక్ట్‌లను అభివృద్ధి చేసేందుకు చెరుకూరి వీరయ్య, రోశయ్య, సుబ్బారావులతో కూడిన ట్రిబ్యునల్ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ఏఎస్‌పేట మండలంలోని గుడిపాడు వరకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తామన్నారు.
హుదూద్ తుపాను బాధితులకు జిల్లాకు చెందిన మంత్రి డాక్టర్ నారాయణ అమోఘమైన సేవలు అందించారని కొనియాడారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ మాట్లాడుతూ ఐఏబీ సమావేశంలో నిర్ణయించిన మేరకు సాగునీటిని విడుదల చేశామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యుత్, నీటిపారుదల శాఖలకు సంబంధించి ప్రతి రోజు అరగంట సేపు సమీక్ష సమావేశాలు నిర్వహించడం పరిపాటిగా చేస్తున్నారన్నారు. ఆ కృషి ఫలితంగానే ప్రస్తుతం జలాశయంలో 45 టీఎంసీల నీరు చేరిందన్నారు.
భవిష్యత్‌లో జిల్లాలో సాగు,తాగునీటి సమస్యలు పరిష్కరించడంలో ముందుంటామన్నారు. ఈ ప్రాజెక్ట్ జాతికి అంకితం చేసి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా డెల్టాకు, నాన్‌డెల్టాకు ఒకే పర్యాయం నీటి విడుదల చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర మాట్లాడుతూ ఈ జిల్లాలో కేవలం మూడు స్థానాల్లోనే టీడీపీ గెలవడంతో చంద్రబాబు దగ్గర పనులు చేయించుకునే సమయంలో డిమాండ్ చేయలేకపోతున్నామన్నారు.
సమావేశంలో ఆత్మకూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ గూటూరు మురళీ కన్నబాబు, తెలుగు రైతు సంఘం అధ్యక్షుడు రాపూరు సుందరరామిరెడ్డి, జెడ్పీ టీడీపీ ఫ్లోర్‌మెంబర్ వేనాటి రామచంద్రారెడ్డి, టీడీపీ గూడూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ జ్యోత్స్న, టీడీపీ నేతలు సడ్డా రవీంద్రారెడ్డి, ఇందూరు వెంకటరమణారెడ్డి, ఆరి కట్ల జనార్దన్‌నాయుడు పాల్గొన్నారు.