నిజాం షుగర్స్‌ నుంచి ‘డెల్టా’ ఔట్‌? | Delta Papers Limited exits from Nizam Sugars | Sakshi
Sakshi News home page

నిజాం షుగర్స్‌ నుంచి ‘డెల్టా’ ఔట్‌?

Published Thu, Nov 21 2024 4:20 AM | Last Updated on Thu, Nov 21 2024 4:20 AM

Delta Papers Limited exits from Nizam Sugars

భాగస్వామ్యం నుంచి బయటకు వెళ్లనున్న సంస్థ 

ఈ నేపథ్యంలో పునరుద్ధరణ కోసం కన్సల్టెంట్‌గా ‘క్యాపిటల్‌ ఫార్చూన్స్‌’ ను ఎంపిక చేసిన ప్రభుత్వం 

ఆస్తుల విలువ, యూనిట్ల స్థితిగతుల మదింపు బాధ్యత అప్పగింత 

వచ్చే ఏడాది మార్చిలోగా తుది నివేదిక ఇవ్వాలని ఆదేశం 

దశలవారీగా ఇచ్చే మధ్యంతర నివేదికల ఆధారంగా భవిష్యత్తుపై నిర్ణయం 

సాక్షి, హైదరాబాద్‌:  నిజాం డెక్కన్‌ షుగర్స్‌ లిమిటెడ్‌ (ఎన్‌డీఎస్‌ఎల్‌) పునరుద్ధరణ ప్రక్రియలో భాగంగా.. ఇందులో భాగస్వామ్యం ఉన్న డెల్టా పేపర్స్‌ లిమిటెడ్‌ సంస్థ తన 51 శాతం వాటాను ఉపసంహరించుకుని బయటికి వెళ్లనుంది. నిజాం షుగర్స్‌ను పునరుద్ధరించినా తాము నడపలేమంటూ డెల్టా సంస్థ గతంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టత ఇచ్చింది. 

ఈ నేపథ్యంలో సంస్థ ఆస్తుల విలువ, యూనిట్ల సాంకేతిక స్థితిగతులను మదింపు చేయడంతోపాటు న్యాయపరమైన అంశాలపై సలహాలు, సూచనల కోసం ప్రభుత్వం ‘క్యాపిటల్‌ ఫార్చూన్స్‌’అనే సంస్థను కన్సల్టెంట్‌గా ఎంపిక చేసింది. వచ్చే ఏడాది మార్చిలోగా పూర్తి వివరాలతో తుది నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ప్రైవేటు భాగస్వామ్య సంస్థ వాటాను తిరిగి చెల్లించాక.. నిజాం షుగర్స్‌ను ఏ తరహాలో నడపాలనే అంశంపై స్పష్టత రానుంది. 

తొలుత రుణ విముక్తి చేసి.. 
నిజాం షుగర్స్‌ను పునరుద్ధరిస్తామన్న హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 12న మంత్రులు శ్రీధర్‌బాబు చైర్మన్‌గా, దామోదర్‌ రాజనర్సింహ వైస్‌ చైర్మన్‌గా ఎనిమిది మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. పునరుద్ధరణకు అనుకూలంగా ఈ కమిటీ ఇచి్చన ప్రతిపాదనలను ఆగస్టులో కేబినెట్‌ ఆమోదించింది. 2015లో ఎన్‌డీఎస్‌ఎల్‌ యూనిట్లు మూతపడేనాటికి సంస్థ ఆస్తుల విలువ సుమారు రూ.400 కోట్లుగా లెక్కించారు. 

మరోవైపు బ్యాంకర్లు వడ్డీతో కలిపి ఈ సంస్థకు ఇచ్చిన రుణ మొతాన్ని రూ.390 కోట్లుగా పేర్కొన్నాయి. అయితే ప్రభుత్వం బ్యాంకర్ల కన్సార్షియంతో సంప్రదింపులు జరిపి వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ కింద రూ.190 కోట్లు చెల్లించడంతో నిజాం షుగర్స్‌కు రుణ విముక్తి కలిగింది. రుణ విముక్తి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.171 కోట్లు, డెల్టా పేపర్స్‌ రూ.19 కోట్లు చెల్లించాయి. 

‘డెల్టా’తప్పుకోవడంపైనా మార్గనిర్దేశం 
కన్సల్టెన్సీ సంస్థ న్యాయపరమైన అంశాలు, ఆస్తుల విలువ, యూనిట్ల సాంకేతిక స్థితిగతులను మదింపు చేయడంతోపాటు యూనిట్ల పునరుద్ధరణకు సంబంధించిన సాంకేతిక, ఆర్థికపరమైన ఖర్చులపై కసరత్తు ప్రారంభించింది. 51 శాతం వాటా కలిగిన డెల్టా పేపర్స్‌ భాగస్వామ్యం నుంచి తప్పుకోవడంపైనా కన్సల్టెన్సీ సంస్థ మార్గనిర్దేశం చేయాల్సి ఉంటుంది. 

కన్సల్టెన్సీ సంస్థకు అవసరమైన సమాచారాన్ని ఎన్‌డీఎస్‌ఎల్‌ తరఫున ఎప్పటికప్పుడు అందించేందుకు గతంలో చక్కెర పరిశ్రమ విభాగంలో డిప్యూటీ డైరెక్టర్‌ హోదాలో రిటైరైన ఓ అధికారిని సమన్వయకర్తగా నియమించినట్టు తెలిసింది. 

కన్సల్టెన్సీ సంస్థ ఇచ్చే మధ్యంతర నివేదికల ఆధారంగా నిజాం షుగర్స్‌ పునరుద్ధరణ తీరుతెన్నులపై చర్చించనున్నారు. ఈ మేరకు 26 లేదా 28వ తేదీన శ్రీధర్‌బాబు నేతృత్వంలోని ప్రత్యేక కమిటీ సమావేశం జరుగుతుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 

‘ప్రైవేటు’చేతుల్లోకే నిజాం షుగర్స్‌? 
నిజాం షుగర్స్‌ నుంచి డెల్టా పేపర్స్‌ సంస్థ బయ టికి వెళ్లనున్న నేపథ్యంలో.. దానిని ఎవరు నడపాలనే ప్రశ్న తలెత్తుతోంది. ప్రభుత్వ లేదా సహకార రంగంలో నడపడం సాధ్యం కాదనే అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో నిర్వ హణకు ముందుకొచ్చే ప్రైవేటు సంస్థలకు లీజు ప్రాతిపదికన ఇవ్వడమో లేదా విక్రయించడమో జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement