సాక్షి, హైదరాబాద్: కోవిడ్ సెకండ్‌వేవ్‌లో వ్యాప్తి చెందిన డెల్టా వేరియంట్ శరీరంలోని కీలక భాగాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. బి.1.617.2 కోడ్‌తో ఉన్న వేరియంట్‌ను డెల్టాగా పిలుస్తున్నారు. ప్రస్తుతం దేశంలో ఎక్కువగా వ్యాప్తి చెందిన ఈ వేరియంట్ మానవ శరీరంలోకి ప్రవేశించాక అవయవాలపై వేగంగా ప్రభావాన్ని చూపడంతో ఎక్కువ మంది ఆస్పత్రుల్లో చేరాల్సి వస్తోంది. కరోనా మొదటి దశతో పోలిస్తే రెండో దశలో ఎక్కువ మంది ఆస్పత్రిపాలయ్యారు.
అస్వస్థతకు గురైన వారిలో చాలా మంది మరణం అంచులవరకు వెళ్లి వచ్చారు. కొందరిలో అవయవాలు దెబ్బతినగా, మరికొందరు జీవితకాల వ్యాధులైన బీపీ, షుగర్ బారినపడ్డారు. మొదటి దశ, రెండో దశలో ఆస్పత్రిలో చేరి.. వారు ఎదుర్కొన్న సమస్యలు, వైరస్ ప్రభావం తదితర అంశాలపై రిషికేష్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) పరిశోధన చేసింది. దీనికి ప్రత్యేకంగా కొన్ని కేటగిరీల రోగులను ఎంపిక చేసుకుని పరిశీలించి ఆ నివేదికను విడుదల చేసింది.
అన్ని అవయవాలపైనా ప్రభావం...
మొదటి దశ కోవిడ్ వ్యాప్తి సమయంలో ఎక్కువ మంది శ్వాసకోశ సమస్యలు, ఊపిరితిత్తుల్లో ఇన్ఫె„క్షన్ రావడంతో ఆస్పత్రులకు పరుగులు తీశారు. కానీ, రెండో దశ తీవ్రత ఎక్కువగా ఉంది. ఊపిరితిత్తులతో పాటు మూత్రపిండాలు, కాలేయం, మెదడు తదితర కీలకమైన అవయవాలపై వైరస్ ప్రతాపాన్ని చూపింది. వీలైనంత ఎక్కువ మార్గాలను ఏర్పాటు చేసుకుని వైరస్ వ్యాప్తి చెందిన శరీరాన్ని గుల్ల చేసింది. మొదటి దశతో పోలిస్తే రెండో దశలో మూత్రపిండాలపై ప్రభావం ఆరు రెట్లు అధికంగా ఉంది. కాలేయంపై చూపిన ప్రభావం గతేడాది కంటే రెండు రెట్లు ఎక్కువ. లివర్‌లోకి వైరస్ వ్యాప్తి చెందడంతో ఆ అవయవం విడుదల చేసే ఎంజైమ్స్ రెట్టింపు చేసి సామర్థ్యాన్ని తగ్గించినట్లు గుర్తించారు.
దేశంలో కోవిడ్ బారినపడ్డ 70 శాతం మందిలో డెల్టా వేరియంట్ ఉన్నట్లు ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరించింది. బి.1.617.2 రకానికి చెందిన ఈ వేరియంట్ దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే తరహాలో తీవ్ర ప్రభావాన్ని చూపింది. డెల్టా వేరియంట్ తెల్ల రక్తకణాల్లోని లింపోసైట్‌లపై తీవ్ర ప్రభావం చూపడంతో ఎక్కువ మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ వేరియంట్ వైరస్ వ్యాప్తిని ముందుగా లక్షణాలతో గుర్తించి చికిత్స తీసుకున్న వారు ఇంటివద్దే కోలుకుంటుండగా... కాస్త నిర్లక్ష్యం చేసినా ఆస్పత్రికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తోంది. దీని నియంత్రణకు వైద్యులు శ్రమించాల్సి వస్తోంది.
మొదటి దశ, రెండో దశలో సివియర్ పేషంట్లలో పరిస్థితి ఇలా(గణాంకాలు శాతాల్లో)...
కేటగిరీ మొదటి దశ రెండో దశ
ఎస్‌పీఓ2 సగటు 92 85.5
ఫీవర్ 30 85
దగ్గు 14 78
గొంతులో గరగర 11 05
దమ్ము 15 80
నీరసం 9.5 19.6
లూస్‌మోషన్స్ 11 5
► మొదటిదశ చికిత్సలో స్టెరాయిడ్లను 4 శాతం మందికే వాడగా... రెండో దశకు వచ్చే సరికి 72 శాతం మందికి ఇచ్చారు. ఇక యాంటిబయోటిక్స్ వినియోగం రెట్టింపు అయ్యింది.
►బాక్టీరియల్ న్యుమోనియా 1.1 శాతం నుంచి 9 శాతానికి పెరగగా, సివియర్ వైరస్ న్యుమోనియా 6 శాతం నుంచి ఏకంగా 49 శాతానికి ఎగబాకింది.
►సీటీ స్కాన్‌లో స్కోర్ గతేడాది కంటే ఈసారి భారీగా పెరుగుదల నమోదైంది.
- డెల్టా వేరియంట్ వ్యాప్తి చెందిన ఎక్కువ మందిలో ఊపిరితిత్తులపై ప్రభావాన్ని చూపడంతో ఆక్సిజన్ స్థాయిలు భారీగా పడిపోయాయి. కరోనా తొలి దశలో 12 శాతం మందికే ఆక్సిజన్ సప్లిమెంట్ అవసరంపడగా... రెండో దశలో ఏకంగా 82 శాతానికి పెరిగింది.
- రెమిడెసివిర్ వినియోగం మొదటి దశలో ఒక శాతం కంటే తక్కువ ఉండగా... ప్రస్తుతం ఆస్పత్రిలో చేరిన 12 శాతం మంది వినియోగించారు.
- సివియర్ కోవిడ్‌తో ఆస్పత్రుల్లో చేరిన వారిలో గతేడాది 90 శాతం మంది డిశ్చార్జ్ కాగా.. సెకండ్ వేవ్‌లో 71శాతం మందే డిశ్చార్జ్ అయినట్లు గుర్తించారు. ఈ లెక్కన మొదటి దశలో నమోదైన మరణాల రేటుతో పోలిస్తే రెండో దశలో మరణాల రేటు మూడు రెట్లు పెరిగినట్లు తెలుస్తోంది.
- గతేడాది ఆస్పత్రుల్లో చేరిన వారిలో 2.6 శాతం మందికే వెంటిలేటర్ అవసరపడగా ఈసారి 41 శాతానికి పెరిగినట్లు పరిశీలనలో తేలింది.
పరిశోధన సాగిందిలా...
మొదటి దశ కోవిడ్‌కు సంబంధించి గత ఏడాది ఏప్రిల్, మే, జూన్‌లలో ఎయిమ్స్‌లో అడ్మిట్ అయిన 106 మంది రోగులు.. రెండో దశ తీవ్రంగా ఉన్న ఈ ఏడాది మార్చి, ఏప్రిల్, మేలో చేరిన 104 మందిపై పరిశీలన చేశారు. మైల్డ్, మోడరేట్, సివియర్ కేటగిరీలుగా కోవిడ్‌ను విభజించి.. వీరిలో వైరస్ చూపిన ప్రభావం, అందించిన చికిత్సను పరిశీలించారు. తొలి దశలో లక్షణాలు లేకున్నా ఆస్పత్రుల్లో చేరగా.. ప్రస్తుతం మోడరేట్ స్టేజి దాటే క్రమం, సివియారిటీకి వచ్చిన తర్వాతే ఆస్పత్రుల్లో చేరారు. . తొలిదశలో 37.5% మందే ఆస్పత్రుల్లో చేరగా.. ప్రస్తుతం 70% మంది చేరారు. గతేడాది ఆస్పత్రుల్లో చేరిన వారి సగటు వయసు 37 యేళ్లు కాగా, ప్రస్తుతం 50.5 యేళ్లు.
Comments
Please login to add a commentAdd a comment