ఒకప్పుడు 14 రోజుల్లోపే కరోనా లక్షణాలు.. ఇప్పుడు 28 రోజులకు బయట పడుతున్న వైనం
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ ఎవరికీ అంతుచిక్కకుండా ఎప్పటి కప్పుడు మార్పు చెందుతోంది. శాస్త్రవేత్తలు దాని గురించి ఓ అంచనాకు వచ్చేలోపే, మరో కొత్త లక్షణంతో వెలుగు చూస్తోంది. ఒకప్పుడు చలి ప్రాంతాల్లోనే బతుకుందన్న భావనను పటాపంచలు చేసి.. ఎంత వేడిలోనైనా బతకగలనని నిరూపిస్తోంది. ఇలా కరోనా ఖతర్నాక్‌గా వ్యవహరిస్తోంది. దాని తీరును చూసి శాస్త్రవేత్తలే ముక్కున వేలేసుకుంటున్నారు. అది ఇలా వ్యవ హరిస్తుండటంతో దానికి తగ్గట్లే ప్రభుత్వాలు నిర్ణ యాలు తీసుకుంటున్నాయి.
మొన్నటి వరకు కరోనా వైరస్ సోకిన 2 నుంచి 14 రోజుల్లోపే లక్షణాలు బయటపడతాయని భావించారు. దానికి తగ్గట్లు వైరస్ లక్షణాలున్న వారితో తిరిగిన వారిని, కరోనా సోకి డిశ్చార్జి అయిన వారిని, అనుమానితులను 14 రోజుల పాటు క్వారంటైన్‌లో లేదా ఐసోలేషన్‌లో ఉంచేవారు. కానీ ఇప్పుడు దాని స్వరూపం మార్చు కుంది. పాజిటివ్ వ్యక్తితో తిరిగిన వారికి 14 రోజుల తర్వాత కూడా లక్షణాలు బయటపడ్డాయి. 14 నుంచి 28 రోజుల మధ్య కూడా అనేక మందికి కరోనా లక్షణాలు బయటపడ్డాయి. అందుకే కరోనా పాజిటివ్ కాంటాక్టులను, డిశ్చార్జి అయిన వారిని ఇక నుంచి 28 రోజుల పాటు క్వారంటైన్‌లోనే ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.
100 నుంచి 120 మందిలో అలాగే
శుక్రవారం నాటికి రాష్ట్రంలో 983 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా హైదరాబాద్, సూర్యాపేట, గద్వాల, వికారాబాద్, నిజామాబాద్, వరంగల్ అర్బన్, కరీంనగర్ జిల్లాల్లోనే నమోదయ్యాయి. ఇటీవల వైద్య, ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి అందజేసిన నివేదిక ప్రకారం విదేశాల నుంచి 25,937 మంది రాగా, వారిలో 32 మందికి పాజిటివ్ వచ్చింది. వారితో కాంటాక్ట్ అయిన వారు 918 కాగా, వారిలో 18 మందికి కరోనా సోకింది. ఇక మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారు 1,345 మంది కాగా, వారిలో 237 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. మర్కజ్ వెళ్లివచ్చిన వారితో కాంటాక్ట్ అయిన వారు 3,193 మంది కాగా, వారిలో 537 మందికి కరోనా సోకిందని పేర్కొంది.
డాక్టర్లే షాకయ్యేలా..?
విచిత్రమేంటంటే రాష్ట్రంలో పాజిటివ్ వచ్చిన వారిలో దాదాపు 100 నుంచి 120 మంది వరకు 14 రోజుల తర్వాత కరోనా లక్షణాలు బయటపడ్డాయి. కొందరికి 20 రోజులకు, మరికొందరికి 22 రోజులకు, ఒకరిద్దరికైతే 28 రోజులకు కూడా కరోనా లక్షణాలు బయటపడ్డాయి. కరీంనగర్‌కు చెందిన ఒక కాంటాక్ట్ వ్యక్తికి మొదట నెగెటివ్ వచ్చింది. 28 రోజులకు మరోసారి పరీక్షిస్తే పాజిటివ్ వచ్చింది. దీంతో డాక్టర్లు షాక్ అయ్యారు. అందుకే ఇక నుంచి కాంటాక్ట్ వ్యక్తులైనా, అనుమానిత లక్షణాలున్న వారైనా, పాజిటివ్‌తో చికిత్స పొంది డిశ్చార్జి అయిన వారైనా తప్పనిసరిగా 28 రోజుల వరకు క్వారంటైన్‌లో ఉండాల్సిందే. క్వారంటైన్ కాలాన్ని పెంచడంతో, ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే క్వారంటైన్ కేంద్రాల్లో వసతులను పెంచనున్నారు. క్వారంటైన్ కాలం రెట్టింపు కావడంతో వసతులు, ఆహారం కల్పించాల్సి ఉంటుంది. ఈ నెల 18 నాటికి సర్కారు ఆధ్వర్యంలో 33 జిల్లాల్లో 121 క్వారంటైన్ సెంటర్లు పనిచేస్తున్నాయి.
ఎలాంటి లక్షణాలు లేకుండానే..
కరోనా వచ్చిన మొదట్లో జ్వరం, ముక్కు కారటం, దగ్గు తదితర లక్షణాలుంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అది వాస్తవమే కానీ ఎలాంటి లక్షణాలు లేకుండా 90 వరకు పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. ఇలాంటి కేసులు చాలావరకు సూర్యాపేటలో నమోదైనట్లు వెల్లడించాయి. లక్షణాలు లేకుండా కరోనా ఉంటే గుర్తించడం ఎలాగన్న ఆందోళన ప్రజల్లోనూ నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment