పునరుద్ధరణపై త్వరలో కేబినెట్‌కు కమిటీ నివేదిక సమర్పణ
తెరిచినా నడపలేమని తెగేసి చెప్పిన ప్రైవేట్ భాగస్వామి
సాక్షి, హైదరాబాద్: నిజాం డెక్కన్ షుగర్స్ లిమిటెడ్ (ఎన్‌డీఎస్‌ఎల్) పునరుద్ధరణలో మళ్లీ కదలిక వచ్చింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వేసిన కమిటీ త్వరలో మంత్రివర్గానికి నివేదిక సమర్పించనుంది. దీనిపై కేబినెట్ తీసుకునే నిర్ణయం ఆధారంగా ముందుకెళ్లాలని ప్రభుత్వ చక్కెర పరిశ్రమల విభాగం భావిస్తోంది. పునరుద్ధరణకు ప్రభుత్వం పచ్చజెండా ఊపే పక్షంలో యూనిట్లు తిరిగి ప్రారంభించేందుకు అవసరమైన కార్యాచరణ కూడా రూపొందిస్తోంది. నిజాం చక్కెర కర్మాగారాన్ని పునరుద్ధరిస్తామని ఎన్నికల సందర్భంగా ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచి్చన వెంటనే ఈ ఏడాది జనవరి 12న కమిటీ ఏర్పాటు చేసింది.
పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు చైర్మన్‌గా, వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వైస్‌చైర్మన్‌గా ఏర్పాటైన కమిటీలో మరో ఎనిమిది మందిని సభ్యులుగా నియమించారు. పునరుద్ధరణకు సంబంధించిన విధివిధానాలు సూచిస్తూ రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని కమిటీకి గడువు విధించింది. బోధన్ చక్కెర కర్మాగారాన్ని సందర్శించిన ఈ కమిటీ చెరకు రైతులు, రైతుసంఘాల నేతలు, సంబంధిత వర్గాల నుంచి సమాచారం సేకరించి నివేదిక రూపొందించినట్టు తెలిసింది.
అయితే ఎన్‌డీఎస్‌ఎల్‌లో 51 శాతం వాటా కలిగిన ప్రైవేట్ భాగస్వామ్య సంస్థ ఫ్యాక్టరీ తిరిగి తెరిచినా, తాము యూనిట్లు నడపలేమని చేతులు ఎత్తేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో యూనిట్లు తిరిగి తెరుచుకునే పక్షంలో ఏ తరహాలో నడపాలనే కోణంలో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. రైతులను భాగస్వాములను చేస్తూ సహకార పద్ధతిలో నడపడమా మరో సంస్థకు అప్పగించడమా అనే కోణంలోనూ నివేదికలో పొందుపరిచనట్టు సమాచారం.
రుణ విముక్తికి రూ. 190 కోట్లు
గతంలో ఎన్‌డీఎస్‌ఎల్‌ను దివాలా కంపెనీగా ప్రకటిస్తూ లిక్విడేట్ చేయాలని నేషనల్ కంపెనీ ఆఫ్ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) ఆదేశించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం అప్పిల్లేట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించడంతో ఎన్‌సీఎల్‌టీ ఆదేశాలను పక్కన పెట్టింది. ఈ నేపథ్యంలో బ్యాంకర్ల వద్ద తీసుకున్న రుణాలను వన్‌టైమ్ సెటిల్‌మెంట్ కింద చెల్లించడం ద్వారా లిక్విడేషన్ గండం నుంచి బయటపడే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. ఓటీఎస్ కింద బ్యాంకులకు రూ.190 కోట్లకుగాను ఇప్పటివరకు మూడు విడతల్లో రూ.160 కోట్ల మేర చెల్లించారు. ఈ సెపె్టంబర్‌లోగా మరో రూ.30 కోట్లు చెల్లిస్తే ఎన్‌డీఎస్‌ఎల్‌కు బ్యాంకర్ల నుంచి రుణ విముక్తి లభిస్తుంది.
కన్సల్టెన్సీ ఎంపికకు కసరత్తు
ఎన్‌డీఎస్‌ఎల్ పరిధిలో బోధన్, మంభోజిపల్లి, మెట్‌పల్లి యూనిట్లు ఉండగా, 2015 నుంచి వీటిలో ఉత్పత్తి నిలిచిపోయింది. వీటిని తిరిగి తెరిచేందుకు అవసరమైన సలహాలు, సూచనలకు అనుభవం కలిగిన ‘కన్సల్టెంట్’సేవలను వినియోగించుకోవాలని చక్కెర విభాగం నిర్ణయించింది. పునరుద్ధరణకు రాష్ట్ర కేబినెట్ పచ్చజెండా ఊపితే కన్సల్టెంట్‌ను ఎంపిక చేసే ప్రక్రియ ప్రారంభిస్తామని అధికారులు వెల్లడించారు. రోజుకు బోధన్ యూనిట్‌లో 3500 టన్నులు, మెట్‌పల్లి, మంభోజిపల్లిలో 2500 టన్నుల చెరకు క్రషింగ్ సామర్థ్యం కలిగి ఉన్నాయి.
వీటిని తిరిగి తెరిచే పక్షంలో క్రషింగ్‌కు అవసరమైన చెరకు లభ్యత ఎంత ఉందనే కోణంలో చక్కెర విభాగం అధికారులు లెక్కలు సేకరిస్తున్నారు. 2015లో యూనిట్లు మూతపడిన వాటిలో యంత్రాల స్థితిగతులపైనా అధ్యయనం జరుగుతోంది. మరోవైపు మూడు యూనిట్లు ఒకేమారు కాకుండా తొలుత మెట్‌పల్లి యూనిట్‌ను ప్రారంభించి, అక్కడ ఎదురయ్యే పరిస్థితులను అధ్యయనం చేసిన తర్వాత మిగతా రెండు యూనిట్లు ప్రారంభించాలనే ప్రతిపాదన కూడా కమిటీ నివేదికలో ఉన్నట్టు తెలిసింది. ప్రస్తుత పరిస్థితుల్లో చక్కెర ఉత్పత్తి కంటే ఇథనాల్ బ్లెండింగ్‌కు ఎన్‌డీఎస్‌ఎల్ యూనిట్లను ఉపయోగించుకుంటే బాగుంటుందనే కోణంలోనూ కమిటీ సూచినట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment