సాక్షి, హైదరాబాద్: శాసనసభ, శాసనమండలి, సెంట్రల్ హాల్ ఒకే భవన సముదాయంలో ఉండేలా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ప్రస్తుతం జూబ్లీ హాలులో ఉన్న శాసనమండలిని, పాత భవనంలోకి మార్చాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. జూబ్లీహాలును మళ్లీ పునరుద్ధరించి, శాసనసభ, శాసన మండలి, సెంట్రల్ హాలును పాత పద్ధతిలో ఏర్పాటు చేయటంతో పాటు, ఆ ప్రాంగణాన్ని సుందరీకరించటం ద్వారా నగరంలో ఒక ప్రధాన పర్యాటక ప్రాంతంగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.
త్వరలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆర్‌అండ్ బీ అధికారులతో కలిసి శాసనసభ ప్రాంగణాన్ని పరిశీలించి మార్పుచేర్పులపై చర్చించనున్నారు. సీఎంతో భేటీ అనంతరం రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ వివరాలను వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన నాలుగు రోజుల్లోనే ఇలాంటి కీలక నిర్ణయం తీసుకోవటం విశేషం.
సెంట్రల్ హాల్‌గా ఏపీ అసెంబ్లీ భవనం
గతంలో శాసనసభ, శాసనమండలి ఒకే భవనంలో కొనసాగేవి. ఆ భవనం పాతబడటంతో ప్రస్తుత శాసనసభ కొనసాగుతున్న భవనాన్ని నిర్మించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇదే భవనం కొనసాగింది. పాత భవనంలో శాసనమండలిని నిర్వహించారు. రాష్ట్ర విభజన తర్వాత పాత భవనంలోని హాలును ఏపీకి కేటాయించారు. అక్కడ శాసనసభ, శాసనమండలి నిర్వహించాల్సి రావటంతో, తెలంగాణ శాసనమండలిని జూబ్లీహాలులోకి మార్చారు. ఇప్పుడు పాత భవనాన్ని పూర్తిగా పునరుద్ధరించనుండటంతో, జూబ్లీ హాలులోని శాసనమండలిని తిరిగి పాత మండలి భవనంలోకే మారుస్తారు. ఏపీకి కేటాయించిన శాసనసభ భవనాన్ని స్వా«దీనం చేసుకుని దాన్ని సెంట్రల్ హాల్‌గా మారుస్తారు.
ఇక కొత్త భవనం వెలుపల ఉన్న ప్రధాన రాజకీయ పార్టీల శాసనసభా పక్ష కార్యాలయాలు, మీడియా సెంటర్ ఉన్న భవనాన్ని తొలగించాలని నిర్ణయించారు. ఆయా కార్యాలయాలను పాత భవనంలో ఏర్పాటు చేస్తారు. భవనం కూల్చిన ప్రాంతంలో పచ్చిక బయళ్లు ఏర్పాటు చేసి పబ్లిక్ గార్డెన్‌తో అనుసంధానించాలని యోచిస్తున్నారు. గతంలో పబ్లిక్ గార్డెన్‌కు ఎంతో ప్రజాదరణ ఉండేది. సాయంత్రం వేళ ఎంతోమంది సందర్శించి సేద తీరేవారు. తాజాగా మళ్లీ దానికి పర్యాటక కళ తేవాలని కొత్త ప్రభుత్వం భావిస్తోంది.
మహాత్ముడి విగ్రహం ప్రాంతంలో..
శాసనసభ ముందుభాగంలో గతంలో ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ విగ్రహం రోడ్డుపైకి అంతగా కనిపించటం లేదని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. రోడ్డుమీద కంచెను ఏర్పాటు చేయటం కూడా దీనికి కారణమైంది. ఇప్పుడు ఆ కంచెను తొలగించి, వీలైతే గాంధీ విగ్రహాన్ని కాస్త ఎత్తు మీదకు మార్చి, ఆ ప్రదేశాన్ని మరింతగా సుందరీకరించి రోడ్డు మీదుగా వెళ్లేవారిని ఆకట్టుకునేలా చేయాలని నిర్ణయించారు. గతంలో జూబ్లీ హాలు ప్రాంగణం సభలు, సందడిగా ఉండేది. శాసనమండలిగా మారిన తర్వాత కళ తప్పింది. ఇప్పుడు దాన్ని మళ్లీ పునరుద్ధరించాలని నిర్ణయించారు.
కొత్త భవనం నిర్మించే యోచన లేనట్టే..?
కొత్త సచివాలయం తరహాలో శాసనసభకు కూడా కొత్త భవనాన్ని నిర్మించాలని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. సచివాలయ భవనానికి పునాది వేసిన రోజునే, ఎర్రమంజిల్ ప్యాలెస్ ప్రాంగణంలో శాసనసభ సముదాయానికి కూడా పునాది వే శారు. కానీ వారసత్వ కట్టడంగా నిలిచిన ఎర్రమంజిల్ ప్యాలెస్‌ను కూల్చాలన్న నిర్ణయంపై అప్పట్లో విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆ అంశం కోర్టు పరిధిలోకి కూడా వెళ్లింది. దీంతో నాటి ప్రభుత్వం వెనక్కి తగ్గింది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం పాత భవనాన్ని పునరుద్ధరించాలని నిర్ణయించటంతో, ఇక వేరే ప్రాంతంలో నిర్మాణానికి తెరపడినట్టేనని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment