‘అక్కలు.. ఇక్కడ ముంచి అక్కడ తేలిన్రు’అన్న సీఎం వ్యాఖ్యలతో రగడ
సాక్షి, హైదరాబాద్: ‘మహిళలను అవమానపరిచిన ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలి.. నహీ చలేగా నహీ చలేగా..తానాషాహి నహీ చలేగా..’అన్న బీఆర్‌ఎస్ సభ్యుల నినాదాలు, నిరసనల మధ్య తెలంగాణ ద్రవ్య వినిమయ బిల్లు 2024–25కు శాసనసభ బుధవారం ఆమోదం తెలిపింది. సభలో గందరగోళం నేపథ్యంలో కీలకమైన ఈ బిల్లుపై బీజేపీ, ఎంఐఎం, సీపీఐ సభ్యులకు మాట్లాడే అవకాశం లభించలేదు. ఈ పరిస్థితుల్లోనే ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ద్రవ్య వినిమయ బిల్లును సభలో ప్రవేశపెట్టగానే కాంగ్రెస్ సభ్యులు బల్లలు చరుస్తూ ఆమోదం తెలిపారు. అనంతరం ద్రవ్యవినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలిపినట్లు సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్ ప్రకటించారు.
దద్దరిల్లిన సభ
‘వెనకాల ఉండే అక్కలు..ఇక్కడ ముంచి అక్కడ తేలిన్రు. ఆ అక్కల మాటలు విన్నారనుకో.. జూబ్లీ బస్టాండ్లో కూర్చోవాల్సి వస్తది..’అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్‌ను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్ష బీఆర్‌ఎస్ సభ్యుల అరుపులు, కేకలు, నినాదాలతో సభ అట్టుడుకింది. ఈ నేపథ్యంలో మధ్యా హ్నం 1.20 గంటలప్పుడు వాయిదా పడిన అసెంబ్లీ తిరిగి 3.30 గంటలకు ప్రారంభమైంది. సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ ద్రవ్య వినిమయ బిల్లుపై మాట్లాడాల్సిందిగా బీజేపీ పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డికి అవకాశం ఇచ్చారు.
అయితే తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని బీఆర్‌ఎస్ సభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి సీటు నుంచి లేచి నిలుచున్నా రు. సునీతా లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మి కూడా ఆమెకు మద్దతుగా లేచి నిలుచున్నారు. స్పీకర్ అంగీకరించకుండా ఏలేటిని మాట్లాడాల్సిందిగా కోరారు. దీంతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, కౌశిక్‌రెడ్డి, వివేకానంద, మల్లారెడ్డి, మా గంటి గోపీనాథ్, డాక్టర్ సంజయ్, కాలేరు వెంకటేశ్ తదితరు లు ఆందోళనకు దిగారు.
అయినా మహేశ్వర్‌రెడ్డి మాట్లాడడం ప్రారంభించడంతో.. సబిత, సునీత, లక్ష్మి పోడియం వద్దకు వెళ్లి తమకు అవకాశం ఇవ్వాలని సభాపతిని కోరారు. కేటీఆర్, ఇతర సభ్యులు తమ సీట్ల నుంచి లేచి నిలబడి సబితకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మహేశ్వర్‌రెడ్డి మాట్లాడిన తర్వాత సబితా ఇంద్రారెడ్డికి అవకాశం ఇస్తానని స్పీకర్ చెప్పినా, బీఆర్‌ఎస్ సభ్యులు వినిపించుకోలేదు.
సబితకు అవకాశం ఇవ్వాలి: అక్బర్
ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ కల్పించుకుని సబితా ఇంద్రారెడ్డి పేరు తీసుకుని సీఎం మాట్లాడారు కాబట్టి, సమాధానం చెప్పే హక్కు ఆమెకు ఉంటుందని అన్నారు. సబితకు స్పీకర్ అవకాశం ఇవ్వడమే సబబని చెప్పారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఎవరి పేరును ప్రస్తావించలేదని అన్నారు. సీఎం సభలో ఎవరి పేరూ ఎత్తకుండా చేసిన వ్యాఖ్యలపై సబితా ఇంద్రారెడ్డి సమాధానమిచ్చారని, దానిపై ముఖ్యమంత్రి వివరణ ఇచ్చారని, ఆ అంశం ముగిసిందని స్పష్టం చేశారు. మహేశ్వర్‌రెడ్డి మాట్లాడకపోతే కాంగ్రెస్ సభ్యుడు గడ్డం వివేక్ (చెన్నూరు)కు మైక్ ఇవ్వాలని సూచించడంతో వివేక్‌కు స్పీకర్ అవకాశం ఇచ్చారు.
వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు
వివేక్ మాట్లాడుతున్న సమయంలో బీఆర్‌ఎస్ సభ్యుల ఆందోళన తీవ్రమైంది. కేటీఆర్‌తో సహా బీఆర్‌ఎస్ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి ‘ముఖ్యమంత్రి అహంకార వైఖరి నశించాలి’, ‘సీఎం డౌన్‌డౌన్’, తదితర నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. అయినా వివేక్ తన ప్రసంగాన్ని కొసాగించారు. కేటీఆర్, సబిత తదితరులు వివేక్‌ను ప్రసంగం ఆపమని కోరినా ఆయన పట్టించుకోలేదు. దీంతో సబిత, సునీత, కోవా లక్ష్మి ఎమ్మెల్యేల సీట్ల దగ్గర కింద కూర్చొని నిరసన తెలిపారు. మిగతా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వెల్ దగ్గర ఆందోళన కొనసాగించారు.
ఈ పరిస్థితుల్లో ఎంఐఎం నేత అక్బరుద్దీన్.. మంత్రులు ఉత్తమ్, శ్రీధర్‌బాబుల వద్దకు వెళ్లి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ను ఉద్దేశించి స్పీకర్.. ‘మీరు చాలా జంటిల్‌మ్యాన్, ఇలా వ్యవహరించడం తగదు. ద్రవ్య వినిమయ బిల్లు ఇంపార్టెంట్ అని మీరే చెప్పారు. ఈ బిజినెస్ మంచిది కాదు..’అని వ్యాఖ్యానించారు. అయినా బీఆర్‌ఎస్ సభ్యుల నినాదాలు ఆగలేదు. చప్పట్లు కొడుతూ సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాంతో మంత్రి సీతక్క మైక్ తీసుకొని ‘సీఎం ఎవరినీ ఏమీ అనలేదు. మీరు గతంలో మహిళ అని చూడకుండా గవర్నర్‌ను కూడా అవమానించారు.
నన్ను అసెంబ్లీలో నాలెడ్జ్ లేదని అవమానించారు. చప్పట్లు కొడుతూ రోడ్ల మీద ఆడుతున్నారా? అసెంబ్లీలోనా? ’అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ గొడవ జరుగుతుండగానే ఆర్థిక మంత్రికి.. ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం కోరాల్సిందిగా స్పీకర్ సూచించడం, భట్టి బిల్లును ప్రవేశపెట్టడం, బిల్లు ఆమోదం పొందినట్లు స్పీకర్ ప్రకటించడం వెంట వెంటనే జరిగిపోయాయి. అనంతరం స్పీకర్ సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించగా.. సభ వాయిదా పడడానికి ముందు సీఎం సభలోకి ప్రవేశించారు.
Comments
Please login to add a commentAdd a comment