అసెంబ్లీలో సీఎం రేవంత్, మంత్రి కోమటిరెడ్డిలకు.. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డికి మధ్య మాటల యుద్ధం
జగదీశ్‌రెడ్డిపై రైస్‌మిల్లు, పెట్రోల్ బంక్ దొంగతనాల ఆరోపణలు చేసిన రేవంత్, కోమటిరెడ్డి
ప్రతిగా రేవంత్‌కు చర్లపల్లి జైలు గుర్తొస్తున్నట్టుందంటూ జగదీశ్‌రెడ్డి విమర్శలు
రాజీనామాల కోసం సవాళ్లు, ప్రతిసవాళ్లు.. పరస్పర విమర్శలతో వేడెక్కిన సభ
విద్యుత్ అంశంపై చర్చ సందర్భంగా దుమారం
సాక్షి, హైదరాబాద్: శాసనసభలో సీఎం రేవంత్, మంత్రి కోమటిరెడ్డిలకు.. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డికి మధ్య మాట ల యుద్ధం జరిగింది. పరస్పర విమర్శలు, ఆరోపణలతో సభ వేడెక్కింది. కిరాయి హత్యలు, దొంగతనాలు, జైలుకు వెళ్లడాల నుంచి రాజీనామాల సవాళ్ల దాకా వెళ్లింది. సోమవారం సభలో విద్యుత్ పద్దుపై చర్చ సందర్భంగా బీఆర్‌ఎస్ సభ్యుడు జగదీశ్‌రెడ్డి ఆవేశంగా మాట్లాడారు. మధ్యలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జోక్యం చేసుకుని జగదీశ్‌రెడ్డిని ఉద్దేశిస్తూ..‘‘ఆయనలో ఉక్రోషం చూస్తుంటే.. చర్లపల్లి జైలులో ఉన్నట్టుగా ఉంది’’అని వ్యాఖ్యానించారు.
దీనికి జగదీశ్‌రెడ్డి కౌంటర్ ఇస్తూ.. ‘‘చర్లపల్లి జైలు జీవితం ఆయనకు (రేవంత్‌కు) అనుభవం. కాబట్టే మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుంటున్నారు. మళ్లీ తాను అక్కడికే వెళతానని భావి స్తున్నారేమో! నాకైతే ఉద్యమకాలంలో చంచల్‌గూడకు వెళ్లి న జైలు జీవితం గుర్తుకొస్తోంది. సీఎంకు మాత్రం చర్లపల్లి జైలులో గడిపినదే గుర్తుకొస్తోంది’’అని కామెంట్ చేశారు.
మిల్లులో దొంగతనం చేస్తే ఏం చేశారో తెలుసు!
జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యలపై సీఎం రేవంత్ తీవ్రంగా స్పందించారు. ‘‘సూర్యాపేట బియ్యం మిల్లులో దొంగతనం చేస్తే మిల్లర్లు ఎవరిని పట్టుకుని చెట్టుకు కట్టేశారో.. నిక్కరేసుకున్న పిల్లాడ్ని అడిగినా చెప్తాడు..’’అని వ్యాఖ్యానించారు. మంత్రి వెంకట్‌రెడ్డి మరిన్ని వివరాలు చెప్తారన్నారు. వెంటనే మంత్రి వెంకట్‌రెడ్డి లేచి జగదీశ్‌రెడ్డిని ఉద్దేశిస్తూ.. ‘‘ఈయన గ్రామానికి చెందిన సమితి మాజీ అధ్యక్షుడు మదన్‌మోహన్‌రెడ్డి హత్య కేసులో ఏ–2 నిందితుడు. భిక్షం అనే వ్యక్తి హత్య కేసులో ఈయన, వాళ్ల నాన్న ఏ–6, ఏ–7 నిందితులు.
రామిరెడ్డి హత్య కేసులో ఏ–3 నిందితుడు. ఆ సమయంలో నల్గొండ జిల్లా నుంచి బహిష్కరించారు కూడా. ఇక మాజీ ఎమ్మెల్యే దోసపాటి గోపాల్ పెట్రోల్ బంక్‌లో జరిగిన దొంగతనం కేసులోనూ ఉన్నారు. మద్య నిషేధం సమయంలో కర్ణాటక నుంచి దొంగతనంగా మ ద్యం తెప్పించినందుకు మిర్యాలగూడ పోలీసుస్టేషన్‌లో ఇ ప్పటికీ కేసు ఉంది. దొంగతనాలు, కిరాయి హత్యలు తప్ప ఉద్యమాలు చేశాడా?’’అంటూ ఆరోపణలు గుప్పించారు.
నిరూపించు.. లేకుంటే ముక్కు నేలకు రాయి!
కోమటిరెడ్డి వ్యాఖ్యలతో విపక్ష బీఆర్‌ఎస్ సభ్యులు ఆగ్రహంగా సీట్ల నుంచి లేచి నిరసన వ్యక్తం చేశారు. ఈ దశలో జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఆయన (కోమటిరెడ్డి) మాటలను రికార్డుల నుంచి తొలగించాలి. లేదా ఆరోపణలకు ఆధారాలు చూపించాలి. అలా చూపిస్తే.. ఇదే సభలో ముక్కు నేలకు రాస్తా. రాజీనామా చేసి, రాజకీయాల నుంచి తప్పుకుంటా.
రుజువు చేయకపోతే కోమటిరెడ్డితోపాటు సీఎం కూడా ముక్కునేలకు రాసి రాజీనామా చేయాలి’’అని సవాల్ విసిరారు. దీనితోపాటు ‘‘చెత్తగాళ్ల మాటలు.. చెత్త మాటలు.. వాటిని రికార్డుల నుంచి తొలగించండి. నాపై వారు చేసిన ఆరోపణలపై సభా కమిటీ వేయండి..’’అని స్పీకర్‌ను కోరారు. తనపై రాజకీయ కక్షతో పెట్టిన ఆ హత్యకేసులను కోర్టు ఎప్పుడో కొట్టివేసిందని వివరించారు.
కోర్టు చుట్టూ తిరిగినది నిరూపిస్తా..
వెంటనే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి జోక్యం చేసుకుని.. ‘‘జగదీశ్‌రెడ్డి హత్య కేసులో కోర్టు చుట్టూ 16 ఏళ్లు తిరిగారని నిరూపిస్తా. నేను అన్నది నిరూపించకపోతే ఇదే సభలో మంత్రి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. నల్గొండ ఎస్పీ, కోర్టు నుంచి రికార్డులు తెప్పించండి’’అని పేర్కొన్నారు. ఈ సమయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ జోక్యం చేసుకుని.. రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే ట్రెజరీ బెంచ్ నుంచి అలాంటి వ్యాఖ్యలు వస్తాయని, సబ్జెక్టుపై మాట్లాడాలని జగదీశ్‌రెడ్డికి సూచించారు.
జగదీశ్‌రెడ్డి బదులిస్తూ.. ‘‘స్పీకర్ ఇలా వ్యాఖ్యానించడం సరికాదు. నేనెక్కడా విషయాన్ని పక్కదారి పట్టించలేదు. సీఎం, కోమటిరెడ్డిలే సంబంధం లేని అంశాలను ప్రస్తావించారు’’అని పేర్కొన్నారు. దీనిపై సభావ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు అభ్యంతరం చెప్పారు. సభ్యులను అవమానించేలా మాట్లాడిన జగదీశ్‌రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సంచులు మోసి జైలుకెళ్లింది మీరేనంటూ..
కోమటిరెడ్డి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని జగదీశ్‌రెడ్డి పదేపదే కోరడంతో స్పీకర్ స్పందించారు. రికార్డులను పరిశీలించి నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో సీఎం రేవంత్‌ను ఉద్దేశించి జగదీశ్‌రెడ్డి విమర్శలు చేశారు. ‘‘మా నేత కేసీఆర్ సత్యహరిశ్చంద్రుడే. మీలాగా సంచులు మోసే చంద్రుడు కాదు. సంచులు మోసి జైలుకు పోయింది మీరే’’అని వ్యాఖ్యానించారు. దీనిపై అధికారపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం లేవనెత్తారు. ఈ దశలో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. తర్వాత జగదీశ్‌రెడ్డి తన ప్రసంగాన్ని కొనసాగించారు.
జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగింపు
శాసనసభలో సీఎం, ఇతరులను ఉద్దేశించి బీఆర్‌ఎస్ సభ్యుడు జగదీశ్‌రెడ్డి చేసిన పలు వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ప్రకటించారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. తర్వాత తాను మాట్లాడుతానంటూ బీఆర్‌ఎస్ సభ్యుడు హరీశ్‌రావు అనుమతి కోరగా.. స్పీకర్ తిరస్కరించారు. దీనితో బీఆర్‌ఎస్ సభ్యులు నిరసన తెలిపారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి తదితరులు స్పీకర్ వెల్‌లోకి వెళ్లి నినాదాలు చేయగా.. స్పీకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సభా మర్యాదలు కాపాడాలని కోరారు. దీంతో బీఆర్‌ఎస్ సభ్యులు తమ కురీ్చల వద్దకు వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment