Nizam Deccan Sugars Limited
-
నిజాం షుగర్స్ నుంచి ‘డెల్టా’ ఔట్?
సాక్షి, హైదరాబాద్: నిజాం డెక్కన్ షుగర్స్ లిమిటెడ్ (ఎన్డీఎస్ఎల్) పునరుద్ధరణ ప్రక్రియలో భాగంగా.. ఇందులో భాగస్వామ్యం ఉన్న డెల్టా పేపర్స్ లిమిటెడ్ సంస్థ తన 51 శాతం వాటాను ఉపసంహరించుకుని బయటికి వెళ్లనుంది. నిజాం షుగర్స్‌ను పునరుద్ధరించినా తాము నడపలేమంటూ డెల్టా సంస్థ గతంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టత ఇచ్చింది. ఈ నేపథ్యంలో సంస్థ ఆస్తుల విలువ, యూనిట్ల సాంకేతిక స్థితిగతులను మదింపు చేయడంతోపాటు న్యాయపరమైన అంశాలపై సలహాలు, సూచనల కోసం ప్రభుత్వం ‘క్యాపిటల్ ఫార్చూన్స్’అనే సంస్థను కన్సల్టెంట్‌గా ఎంపిక చేసింది. వచ్చే ఏడాది మార్చిలోగా పూర్తి వివరాలతో తుది నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ప్రైవేటు భాగస్వామ్య సంస్థ వాటాను తిరిగి చెల్లించాక.. నిజాం షుగర్స్‌ను ఏ తరహాలో నడపాలనే అంశంపై స్పష్టత రానుంది. తొలుత రుణ విముక్తి చేసి.. నిజాం షుగర్స్‌ను పునరుద్ధరిస్తామన్న హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 12న మంత్రులు శ్రీధర్‌బాబు చైర్మన్‌గా, దామోదర్ రాజనర్సింహ వైస్ చైర్మన్‌గా ఎనిమిది మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. పునరుద్ధరణకు అనుకూలంగా ఈ కమిటీ ఇచి్చన ప్రతిపాదనలను ఆగస్టులో కేబినెట్ ఆమోదించింది. 2015లో ఎన్డీఎస్ఎల్ యూనిట్లు మూతపడేనాటికి సంస్థ ఆస్తుల విలువ సుమారు రూ.400 కోట్లుగా లెక్కించారు. మరోవైపు బ్యాంకర్లు వడ్డీతో కలిపి ఈ సంస్థకు ఇచ్చిన రుణ మొతాన్ని రూ.390 కోట్లుగా పేర్కొన్నాయి. అయితే ప్రభుత్వం బ్యాంకర్ల కన్సార్షియంతో సంప్రదింపులు జరిపి వన్ టైమ్ సెటిల్మెంట్ కింద రూ.190 కోట్లు చెల్లించడంతో నిజాం షుగర్స్‌కు రుణ విముక్తి కలిగింది. రుణ విముక్తి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.171 కోట్లు, డెల్టా పేపర్స్ రూ.19 కోట్లు చెల్లించాయి. ‘డెల్టా’తప్పుకోవడంపైనా మార్గనిర్దేశం కన్సల్టెన్సీ సంస్థ న్యాయపరమైన అంశాలు, ఆస్తుల విలువ, యూనిట్ల సాంకేతిక స్థితిగతులను మదింపు చేయడంతోపాటు యూనిట్ల పునరుద్ధరణకు సంబంధించిన సాంకేతిక, ఆర్థికపరమైన ఖర్చులపై కసరత్తు ప్రారంభించింది. 51 శాతం వాటా కలిగిన డెల్టా పేపర్స్ భాగస్వామ్యం నుంచి తప్పుకోవడంపైనా కన్సల్టెన్సీ సంస్థ మార్గనిర్దేశం చేయాల్సి ఉంటుంది. కన్సల్టెన్సీ సంస్థకు అవసరమైన సమాచారాన్ని ఎన్డీఎస్ఎల్ తరఫున ఎప్పటికప్పుడు అందించేందుకు గతంలో చక్కెర పరిశ్రమ విభాగంలో డిప్యూటీ డైరెక్టర్ హోదాలో రిటైరైన ఓ అధికారిని సమన్వయకర్తగా నియమించినట్టు తెలిసింది. కన్సల్టెన్సీ సంస్థ ఇచ్చే మధ్యంతర నివేదికల ఆధారంగా నిజాం షుగర్స్ పునరుద్ధరణ తీరుతెన్నులపై చర్చించనున్నారు. ఈ మేరకు 26 లేదా 28వ తేదీన శ్రీధర్‌బాబు నేతృత్వంలోని ప్రత్యేక కమిటీ సమావేశం జరుగుతుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ‘ప్రైవేటు’చేతుల్లోకే నిజాం షుగర్స్? నిజాం షుగర్స్ నుంచి డెల్టా పేపర్స్ సంస్థ బయ టికి వెళ్లనున్న నేపథ్యంలో.. దానిని ఎవరు నడపాలనే ప్రశ్న తలెత్తుతోంది. ప్రభుత్వ లేదా సహకార రంగంలో నడపడం సాధ్యం కాదనే అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో నిర్వ హణకు ముందుకొచ్చే ప్రైవేటు సంస్థలకు లీజు ప్రాతిపదికన ఇవ్వడమో లేదా విక్రయించడమో జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
‘నిజాం షుగర్స్’పై ముందుకా వెనక్కా?
సాక్షి, హైదరాబాద్: నిజాం డెక్కన్ షుగర్స్ లిమిటెడ్ (ఎన్డీఎస్ఎల్) పునరుద్ధరణలో మళ్లీ కదలిక వచ్చింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వేసిన కమిటీ త్వరలో మంత్రివర్గానికి నివేదిక సమర్పించనుంది. దీనిపై కేబినెట్ తీసుకునే నిర్ణయం ఆధారంగా ముందుకెళ్లాలని ప్రభుత్వ చక్కెర పరిశ్రమల విభాగం భావిస్తోంది. పునరుద్ధరణకు ప్రభుత్వం పచ్చజెండా ఊపే పక్షంలో యూనిట్లు తిరిగి ప్రారంభించేందుకు అవసరమైన కార్యాచరణ కూడా రూపొందిస్తోంది. నిజాం చక్కెర కర్మాగారాన్ని పునరుద్ధరిస్తామని ఎన్నికల సందర్భంగా ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచి్చన వెంటనే ఈ ఏడాది జనవరి 12న కమిటీ ఏర్పాటు చేసింది.పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు చైర్మన్‌గా, వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వైస్‌చైర్మన్‌గా ఏర్పాటైన కమిటీలో మరో ఎనిమిది మందిని సభ్యులుగా నియమించారు. పునరుద్ధరణకు సంబంధించిన విధివిధానాలు సూచిస్తూ రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని కమిటీకి గడువు విధించింది. బోధన్ చక్కెర కర్మాగారాన్ని సందర్శించిన ఈ కమిటీ చెరకు రైతులు, రైతుసంఘాల నేతలు, సంబంధిత వర్గాల నుంచి సమాచారం సేకరించి నివేదిక రూపొందించినట్టు తెలిసింది.అయితే ఎన్డీఎస్ఎల్లో 51 శాతం వాటా కలిగిన ప్రైవేట్ భాగస్వామ్య సంస్థ ఫ్యాక్టరీ తిరిగి తెరిచినా, తాము యూనిట్లు నడపలేమని చేతులు ఎత్తేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో యూనిట్లు తిరిగి తెరుచుకునే పక్షంలో ఏ తరహాలో నడపాలనే కోణంలో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. రైతులను భాగస్వాములను చేస్తూ సహకార పద్ధతిలో నడపడమా మరో సంస్థకు అప్పగించడమా అనే కోణంలోనూ నివేదికలో పొందుపరిచనట్టు సమాచారం. రుణ విముక్తికి రూ. 190 కోట్లు గతంలో ఎన్డీఎస్ఎల్ను దివాలా కంపెనీగా ప్రకటిస్తూ లిక్విడేట్ చేయాలని నేషనల్ కంపెనీ ఆఫ్ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆదేశించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం అప్పిల్లేట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించడంతో ఎన్సీఎల్టీ ఆదేశాలను పక్కన పెట్టింది. ఈ నేపథ్యంలో బ్యాంకర్ల వద్ద తీసుకున్న రుణాలను వన్‌టైమ్ సెటిల్మెంట్ కింద చెల్లించడం ద్వారా లిక్విడేషన్ గండం నుంచి బయటపడే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. ఓటీఎస్ కింద బ్యాంకులకు రూ.190 కోట్లకుగాను ఇప్పటివరకు మూడు విడతల్లో రూ.160 కోట్ల మేర చెల్లించారు. ఈ సెపె్టంబర్‌లోగా మరో రూ.30 కోట్లు చెల్లిస్తే ఎన్డీఎస్ఎల్కు బ్యాంకర్ల నుంచి రుణ విముక్తి లభిస్తుంది. కన్సల్టెన్సీ ఎంపికకు కసరత్తు ఎన్డీఎస్ఎల్ పరిధిలో బోధన్, మంభోజిపల్లి, మెట్పల్లి యూనిట్లు ఉండగా, 2015 నుంచి వీటిలో ఉత్పత్తి నిలిచిపోయింది. వీటిని తిరిగి తెరిచేందుకు అవసరమైన సలహాలు, సూచనలకు అనుభవం కలిగిన ‘కన్సల్టెంట్’సేవలను వినియోగించుకోవాలని చక్కెర విభాగం నిర్ణయించింది. పునరుద్ధరణకు రాష్ట్ర కేబినెట్ పచ్చజెండా ఊపితే కన్సల్టెంట్‌ను ఎంపిక చేసే ప్రక్రియ ప్రారంభిస్తామని అధికారులు వెల్లడించారు. రోజుకు బోధన్ యూనిట్లో 3500 టన్నులు, మెట్పల్లి, మంభోజిపల్లిలో 2500 టన్నుల చెరకు క్రషింగ్ సామర్థ్యం కలిగి ఉన్నాయి.వీటిని తిరిగి తెరిచే పక్షంలో క్రషింగ్‌కు అవసరమైన చెరకు లభ్యత ఎంత ఉందనే కోణంలో చక్కెర విభాగం అధికారులు లెక్కలు సేకరిస్తున్నారు. 2015లో యూనిట్లు మూతపడిన వాటిలో యంత్రాల స్థితిగతులపైనా అధ్యయనం జరుగుతోంది. మరోవైపు మూడు యూనిట్లు ఒకేమారు కాకుండా తొలుత మెట్పల్లి యూనిట్‌ను ప్రారంభించి, అక్కడ ఎదురయ్యే పరిస్థితులను అధ్యయనం చేసిన తర్వాత మిగతా రెండు యూనిట్లు ప్రారంభించాలనే ప్రతిపాదన కూడా కమిటీ నివేదికలో ఉన్నట్టు తెలిసింది. ప్రస్తుత పరిస్థితుల్లో చక్కెర ఉత్పత్తి కంటే ఇథనాల్ బ్లెండింగ్‌కు ఎన్డీఎస్ఎల్ యూనిట్లను ఉపయోగించుకుంటే బాగుంటుందనే కోణంలోనూ కమిటీ సూచినట్టు తెలిసింది. -
తీపి కబురు
⇒ ప్రయివేటీకరణ చెర వీడనున్న ఎన్డీఎస్ఎల్ ⇒ సీఎం సమక్షంలో ఎట్టకేలకు వీడిన సందిగ్ధత ⇒ రైతులతో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం ⇒ చెరుకు ధరపై స్పష్టత ఇచ్చిన కేసీఆర్ ⇒ టన్నుకు రూ. 340 ప్రభుత్వమే భరిస్తుందని హామీ బోధన్: బోధన్ ప్రాంత రైతులు, కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎట్టకేలకు తీపికబురు అందించారు. ‘నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్’కు ప్రయివేటు చెర విడిపించేందుకు భరోసా ఇచ్చారు. పుష్కర కాలంగా ఈ అంశం పెండింగ్‌లో ఉంది. ఎన్డీఎస్ఎల్ను ప్రభు త్వ పరం చేస్తామని, ఫ్యాక్టరీకి పూర్వ వైభవం తెస్తామ ని టీఆర్ఎస్ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చింది. ఇపుడు ఆ హామీ నెరవేరేలా ఓ అడుగు ముందుకు పడింది. సోమవారం సీఎం హైదరాబాద్‌లోని సచివాల యంలో బోధన్, కరీంనగర్ జిల్లా మెట్పల్లి, మెదక్ జిల్లాకు చెందిన ఎన్డీఎస్ఎల్ యూనిట్ల పరిధిలోని రైతులతో సమావేశమయ్యారు. నిజామాబాద్, జహీరాబాద్ ఎంపీలు కల్వకుంట్ల కవిత, బీ బీ పా టిల్, రాష్ట్ర మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, బోధన్, మెట్పల్లి, మెదక్ ఎమ్మెల్యేలు మహ్మద్ షకీల్, వి ద్యాసాగర్‌రావు, పద్మాదేవేందర్‌రెడ్డి ఇందులో పా ల్గొన్నారు. ఈ సందర్భంగా చక్కెర ఫ్యాక్టరీ భవితపై నిర్ణయం తీసుకునేందుకు రైతులతో సమావేశాలు నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. ఈ విషయా న్ని బోధన్ చెరుకు ఉత్ప త్తిదారుల సంఘం అధ్యక్షు డు కెపీ శ్రీనివాస్‌రెడ్డి ఫోన్లో ‘సాక్షి’కి తెలిపారు. కొ ద్ది రోజుల క్రితమే ఎమ్మెల్యే షకీల్ నేతృత్వంలో రైతులు ఎంపీ కవితను కలిసి చెరుకు ధర, ఫ్యాక్టరీ భవిత అంశాలపై చర్చించారు. ఆమె చొరవ తీసుకుని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. సమావేశాలు ఇలా ఫ్యాక్టరీ భవిత గురించి చర్చించేందుకు మూడు ఫ్యాక్టరీల పరిధిలో రైతులతో సమావేశాలు నిర్వహించాలని కేసీఆర్ సూచించారు. ఈ నెల 7న మెట్పల్లిలో, 10న మెదక్‌లో, 11న బోధన్‌లో సమావేశాలు నిర్వహిస్తారు. బోధన్ సమావేశానికి ఎంపీ కవిత హాజరవుతారు. ఫ్యాక్టరీని ప్రభుత్వమే నిర్వహించాలా? రైతుల భాగస్వామ్యంతో నడుపాలా అనే అంశంపై అభిప్రాయాలు సేకరించనున్నారు. పొరుగున ఉన్న మహారాష్ట్రలో సహకార పద్ధతిన నడుస్తున్న ఫ్యాక్టరీల నిర్వహణపై అధ్యయనం చే యాలని సీఎం సూచించినట్టు రైతు నాయకులు తెలిపారు. ఒక్క పైసా ఖర్చు బరువు పడకుండా ప్రభుత్వం ఫ్యాక్టరీని ఆధునీకరిస్తుందని హామీ ఇచ్చారన్నారు. 2014-15 క్రషింగ్ సీజన్‌కుగాను ఎన్డీఎస్ఎల్ యాజమాన్యం టన్నుకు రూ. 2260 ధర చెల్లిస్తామంటోంది. రైతులు రూ. 2600 చెల్లిం చాలని కోరుతున్నారు. దీనికీ సీఎం అంగీకరించి, రెండు మూడు రోజులలో జీఓ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. 12 ఏళ్లుగా నాటకీయ పరిణామాలు ఆసియాలోనే అతి పెద్ద వ్యవసాయాధార పరిశ్రమగా ఖ్యాతి పొందిన బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ నిజాం పాలకులు 1938లో నిర్మించారు. ప్రభుత్వరంగ సంస్థగా ఉండగా ఇది ఓ వెలుగు వెలిగింది. వేలాది మంది కార్మికులకు జీవనోపాధి కల్పించిం ది.రైతులకు లాభసాటి ధర అందించింది. 2002లో చంద్రబాబు దీనిని ప్రయివేటీ కరించారు. వారికే నిర్వహణ అధికారం కట్టబెట్టారు. దీంతో రైతులు, కార్మికులు తీవ్ర కష్టాల పాలయ్యారు. వందలాది మంది కార్మికులను ఉద్యోగాలు కోల్పోయారు. రై తులు లాభసాటి ధర అందక అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ప్రయివేటీకరణను రద్దు చేయాలని రైతులు, కార్మికులు దశాబ్ద కాలం నుంచీ పోరాడుతున్నారు. నిజాం షుగర్స్ పరిరక్షణ కమిటీ కన్వీనర్ ఎం అప్పిరెడ్డి, పలువురు రైతు, కార్మిక సం ఘాలు హైకోర్టును ఆశ్రయించి న్యాయ పోరాటం చేశారు. ఇపుడు ఈ పోరాటం ఫలిం చబోతోంది. 2004లో వైఎస్ఆర్ హయాంలో సభా సంఘం 2004లో అధికారంలోకి వచ్చిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నిజాం షుగర్స్ ప్రయివేటీకరణలో అవినీతి,అక్రమాల నిగ్గు తేల్చేందుకు సభా సంఘాన్ని నియమించారు. 2006 ఆగస్టు 31న ఇది నివేదిక ఇచ్చింది. ఫ్యాక్టరీని తిరిగి స్వా దీనం చేసుకోవాలని సిఫారసు చేసింది. ఆయన మరణానంతరం ఈ అంశం కోర్టు విచారణకు వ చ్చిన సందర్భంలో ఉమ్మడి రాష్ట్రం ప్రభుత్వం మీనమేషాలు లెక్కించింది. ఫ్యాక్టరీ స్వాధీనం అంశాన్ని పట్టించుకోలేదు. దాంతో విషయం మరుగున పడిపోయింది. ఎట్టకేలకు సీఎం కేసీఆర్ ఫ్యాక్టరీపై స్పష్టత ఇవ్వడంతో రైతులు, కార్మికులలో హర్షం వ్యక్తం అవుతుంది. సీఎంతో జరిగిన సమావేశంలో చెరుకు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు కెపీ శ్రీనివాస్‌రెడ్డి,ఉపాధ్యక్షుడు శివరాజ్‌పాటిల్, ప్రధాన కార్యదర్శి గోపాల్ రెడ్డి, బి. సుబ్బారావు, మారుతీపటేల్, ఆర్ విఠల్, నిజాం షుగర్స్ పరిరక్షణ కమిటీ కన్వీనర్ ఎం అప్పిరెడ్డితోపాటు మరో 30 మంది రైతులు, మెట్పల్లి, మెదక్‌కు చెందిన రైతు నాయకులు పాల్గొన్నారు. -
‘బకాయిల’పై సర్కారు సీరియస్
బోధన్, న్యూస్‌లైన్ : చెరుకు రైతులకు బకాయిల చెల్లింపులో ఫ్యాక్టరీ యాజమాన్యం జాప్యం చేయడాన్ని సర్కారు తీవ్రంగా పరిగణిస్తోంది. క్రషింగ్‌కు చెరుకు పంటను తరలించిన రైతులకు డబ్బులు చెల్లించాలని కేన్ కమిషనర్ ఆదేశించారు. పక్షంలోగా డబ్బులు చెల్లించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్(ఎన్డీఎస్ఎల్) పరిధిలో బోధన్, కరీంనగర్ జిల్లాలోని మెట్పల్లి, మెదక్ జిల్లాలోని ముంబోజిపల్లి యూనిట్లకు రైతులు చెరుకు సరఫరా చేశారు. అయితే రైతులకు బిల్లు లు చెల్లించడంలో ఫ్యాక్టరీలు నిర్లక్ష్య వైఖరిని అనుసరిస్తున్నాయి. ఈ మూడు యూనిట్ల పరిధిలో సుమారు రూ. 45 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉంది. ఒక్క బోధన్ యూనిట్ పరిధిలోనే రూ. 10.50 కోట్ల బకాయిలున్నాయి. ఈ విషయమై చెరుకు రైతులు, బోధన్‌కు చెందిన నిజాం షుగర్స్ పరిరక్షణ కమిటీ కన్వీనర్ అప్పిరెడ్డి తదితరులు మంగళవారం హైదరాబాద్‌లో రాష్ట్ర కేన్ కమిషనర్ బద్రు మల్హోత్ను కలిశారు. రైతుల బాధలు వినిపిం చారు. దీనిపై ఆయన స్పందించి అసిస్టెంట్ షుగర్ కేన్ కమిషనర్లకు ఫోన్ చేశారు. ఎన్డీఎస్ఎల్ యాజమాన్యానికి గతనెల 15వ తేదీన షోకాజ్ నోటీసులు జారీ చేశామని బోధన్ అసిస్టెంట్ కేన్ కమిషనర్ వివరించారు. మే 31 వరకు బకాయిలు చెల్లిస్తామని యాజమాన్యం హామీ ఇచ్చినా నిలబెట్టుకోలేదని పేర్కొన్నారు. తాజాగా ఆర్‌ఆర్‌ఏ ఫాం నెంబర్-1 ప్రకారం ఫ్యాక్టరీ యాజమాన్యానికి మంగళవారం నోటీసులు పంపించామన్నారు. ఈ నోటీసు ప్రకారం పదిహేను రోజుల్లోగా ఫ్యాక్టరీ స్పందించకపోతే చట్ట ప్రకారం ఫ్యాక్టరీ ఆస్తులను సీజ్ చేస్తామని పేర్కొన్నారు. క్రషింగ్ ప్రారంభం నుంచి వివాదమే 2013-14 క్రషింగ్ సీజన్ ప్రారంభం నుంచి బోధన్‌లోని శక్కర్‌నగర్ ఎన్డీఎస్ఎల్ యాజమాన్యం వివాదాస్పదంగా వ్యహరిస్తోంది. 2013 నవంబర్ ఆఖరులో క్రషింగ్ ప్రారంభమవ్వాల్సిన సమయంలో క్రషింగ్‌ను నిలపివేసింది. రైతులు ఆందోళన చేయడంతో కలెక్టర్ ప్రద్యుమ్న జోక్యం చేసుకున్నారు. దీంతో డిసెంబర్ 7వ తేదీన క్రషింగ్ ప్రారంభమై ఈ ఏడాది ఫిబ్రవరి 19వ తేదీ వరకు సాగింది. ఈ సీజన్లో లక్షా 72 వేల టన్నుల చెరుకును క్రషింగ్ చేశారు. ధర విషయంలోనూ.. మద్దతు ధర విషయంలోనూ ఫ్యాక్టరీ ఏకపక్షంగా వ్యవహరించింది. టన్ను చెరుకుకు రూ. 3,500 మద్దతు ధర ఇవ్వాలని రైతులు కోరగా 2012-13 సీజన్లో చెల్లించినట్లుగా టన్నుకు రూ. 2,600 ప్రకటించింది. గత్యంతరం లేక రైతులు ఇదే ధరకు చెరుకును విక్రయించారు. చెరుకు సరఫరా చేసిన రైతులకు 15 రోజుల్లో బిల్లులు చెల్లిస్తామని హామీ ఇచ్చినా నిలబెట్టుకోలేదు. ముందుగా చెప్పినట్లుగా రూ. 2,600 చెల్లించాల్సి ఉండగా మొదటి నాలుగు రౌండ్లలో రూ. 2,400 చొప్పునే చెల్లించింది. ఐదో రౌంట్లో రూ. 7 కోట్లు చెల్లించాల్సి ఉంది. రైతులకు మొత్తం రూ. 10.50 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ బిల్లులకోసం రైతులు మూడు నెలలుగా ఎదురు చూస్తున్నారు. ఒప్పందాలను ఉల్లంఘించింది శ్రీనివాస్ రెడ్డి, చెరుకు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు, బోధన్ ఎన్డీఎస్ఎల్ యాజమాన్యం ఒప్పం దాలను ఉల్లఘించింది. చెరుకు బిల్లులు సరఫరా చేసిన 15 రోజుల్లో డబ్బులు చెల్లిస్తామని హామీ ఇచ్చింది. చెరుకు సరఫరా చేసి నాలుగు నెలలు కావస్తున్నా బిల్లులు చెల్లించడం లేదు. తక్షణమే బకాయిలు చెల్లించాలి. ఆర్‌ఆర్‌ఏ ప్రకారం నోటీస్ ఇచ్చాం జాన్ విక్టర్, అసిస్టెంట్ కేన్ కమిషనర్, బోధన్ ఆర్‌ఆర్‌ఏ ఫాం నెంబర్-1 ప్రకారం ఎన్డీఎస్ఎల్ యాజమాన్యానికి మంగళవారం నోటీసులిచ్చాం. 15 రోజుల్లో ఫ్యాక్టరీ స్పందించాలి. లేకపోతే ఫ్యాక్టరీ ఆస్తులు సీజ్ చేస్తాం.