బోధన్, న్యూస్‌లైన్ : చెరుకు రైతులకు బకాయిల చెల్లింపులో ఫ్యాక్టరీ యాజమాన్యం జాప్యం చేయడాన్ని సర్కారు తీవ్రంగా పరిగణిస్తోంది. క్రషింగ్‌కు చెరుకు పంటను తరలించిన రైతులకు డబ్బులు చెల్లించాలని కేన్ కమిషనర్ ఆదేశించారు. పక్షంలోగా డబ్బులు చెల్లించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్(ఎన్‌డీఎస్‌ఎల్) పరిధిలో బోధన్, కరీంనగర్ జిల్లాలోని మెట్‌పల్లి, మెదక్ జిల్లాలోని ముంబోజిపల్లి యూనిట్లకు రైతులు చెరుకు సరఫరా చేశారు. అయితే రైతులకు బిల్లు లు చెల్లించడంలో ఫ్యాక్టరీలు నిర్లక్ష్య వైఖరిని అనుసరిస్తున్నాయి. ఈ మూడు యూనిట్ల పరిధిలో సుమారు రూ. 45 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉంది. ఒక్క బోధన్ యూనిట్ పరిధిలోనే రూ. 10.50 కోట్ల బకాయిలున్నాయి. ఈ విషయమై చెరుకు రైతులు, బోధన్‌కు చెందిన నిజాం షుగర్స్ పరిరక్షణ కమిటీ కన్వీనర్ అప్పిరెడ్డి తదితరులు మంగళవారం హైదరాబాద్‌లో రాష్ట్ర కేన్ కమిషనర్ బద్రు మల్హోత్‌ను కలిశారు. రైతుల బాధలు వినిపిం చారు. దీనిపై ఆయన స్పందించి అసిస్టెంట్ షుగర్ కేన్ కమిషనర్లకు ఫోన్ చేశారు. ఎన్‌డీఎస్‌ఎల్ యాజమాన్యానికి గతనెల 15వ తేదీన షోకాజ్ నోటీసులు జారీ చేశామని బోధన్ అసిస్టెంట్ కేన్ కమిషనర్ వివరించారు.
మే 31 వరకు బకాయిలు చెల్లిస్తామని యాజమాన్యం హామీ ఇచ్చినా నిలబెట్టుకోలేదని పేర్కొన్నారు. తాజాగా ఆర్‌ఆర్‌ఏ ఫాం నెంబర్-1 ప్రకారం ఫ్యాక్టరీ యాజమాన్యానికి మంగళవారం నోటీసులు పంపించామన్నారు. ఈ నోటీసు ప్రకారం పదిహేను రోజుల్లోగా ఫ్యాక్టరీ స్పందించకపోతే చట్ట ప్రకారం ఫ్యాక్టరీ ఆస్తులను సీజ్ చేస్తామని పేర్కొన్నారు.
క్రషింగ్ ప్రారంభం నుంచి వివాదమే
2013-14 క్రషింగ్ సీజన్ ప్రారంభం నుంచి బోధన్‌లోని శక్కర్‌నగర్ ఎన్‌డీఎస్‌ఎల్ యాజమాన్యం వివాదాస్పదంగా వ్యహరిస్తోంది. 2013 నవంబర్ ఆఖరులో క్రషింగ్ ప్రారంభమవ్వాల్సిన సమయంలో క్రషింగ్‌ను నిలపివేసింది. రైతులు ఆందోళన చేయడంతో కలెక్టర్ ప్రద్యుమ్న జోక్యం చేసుకున్నారు. దీంతో డిసెంబర్ 7వ తేదీన క్రషింగ్ ప్రారంభమై ఈ ఏడాది ఫిబ్రవరి 19వ తేదీ వరకు సాగింది. ఈ సీజన్‌లో లక్షా 72 వేల టన్నుల చెరుకును క్రషింగ్ చేశారు.
ధర విషయంలోనూ..
మద్దతు ధర విషయంలోనూ ఫ్యాక్టరీ ఏకపక్షంగా వ్యవహరించింది. టన్ను చెరుకుకు రూ. 3,500 మద్దతు ధర ఇవ్వాలని రైతులు కోరగా 2012-13 సీజన్‌లో చెల్లించినట్లుగా టన్నుకు రూ. 2,600 ప్రకటించింది. గత్యంతరం లేక రైతులు ఇదే ధరకు చెరుకును విక్రయించారు. చెరుకు సరఫరా చేసిన రైతులకు 15 రోజుల్లో బిల్లులు చెల్లిస్తామని హామీ ఇచ్చినా నిలబెట్టుకోలేదు. ముందుగా చెప్పినట్లుగా రూ. 2,600 చెల్లించాల్సి ఉండగా మొదటి నాలుగు రౌండ్లలో రూ. 2,400 చొప్పునే చెల్లించింది. ఐదో రౌంట్‌లో రూ. 7 కోట్లు చెల్లించాల్సి ఉంది. రైతులకు మొత్తం రూ. 10.50 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ బిల్లులకోసం రైతులు మూడు నెలలుగా ఎదురు చూస్తున్నారు.
ఒప్పందాలను ఉల్లంఘించింది
శ్రీనివాస్ రెడ్డి, చెరుకు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు, బోధన్
ఎన్‌డీఎస్‌ఎల్ యాజమాన్యం ఒప్పం దాలను ఉల్లఘించింది. చెరుకు బిల్లులు సరఫరా చేసిన 15 రోజుల్లో డబ్బులు చెల్లిస్తామని హామీ ఇచ్చింది. చెరుకు సరఫరా చేసి నాలుగు నెలలు కావస్తున్నా బిల్లులు చెల్లించడం లేదు. తక్షణమే బకాయిలు చెల్లించాలి.
ఆర్‌ఆర్‌ఏ ప్రకారం నోటీస్ ఇచ్చాం జాన్ విక్టర్, అసిస్టెంట్ కేన్ కమిషనర్, బోధన్
ఆర్‌ఆర్‌ఏ ఫాం నెంబర్-1 ప్రకారం ఎన్‌డీఎస్‌ఎల్ యాజమాన్యానికి మంగళవారం నోటీసులిచ్చాం. 15 రోజుల్లో ఫ్యాక్టరీ స్పందించాలి. లేకపోతే ఫ్యాక్టరీ ఆస్తులు సీజ్ చేస్తాం.
‘బకాయిల’పై సర్కారు సీరియస్
Published Wed, Jun 4 2014 2:40 AM | Last Updated on Sat, Sep 2 2017 8:16 AM
Advertisement
Advertisement