సాక్షి, హైదరాబాద్ : జైళ‍్ల ఆధునీకరణకు చర‍్యలు తీసుకుంటామని, ఇందుకోసం కొత‍్త సంస‍్కరణలు ప్రవేశపెడతామని తెలంగాణ జైళ‍్లశాఖ డైరెక‍్టర్ జనరల్ వినయ్‌కుమార్ సింగ్ తెలిపారు. బుధవారం ఆయన చర‍్లపల్లి జైలును ఆకస్మికంగా తనిఖీ చేశారు. జైలులో యాచకులకు ఏర్పాటుచేసిన ఆనంద ఆశ్రమాన్ని పరిశీలించారు. బాత్రూములు,మరుగుదొడ్లు, గదులను తనిఖీచేశారు.
ఆశ్రమంలో మొత‍్తం 65 మంది యాచకులు ఉన్నారు. వారి కష‍్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. చంచల్‌గూడ జైలులో పురుష యాచకులకు సన‍్న బియ‍్యంతో అన‍్నం వండుతుంటే చర‍్లపల్లి జైలులో మాత్రం దొడ్డుబియ‍్యం అన‍్న వండుతున్నారని మహిళా యాచకులు ఫిర్యాదుచేశారు. ఈ సందర‍్బంగా సింగ్ మాట్లాడుతూ జనవరి 26న ఖైదీల క్షమాబిక్ష ఉండదని చెప్పారు. ఈ విషయం ప్రభుత‍్వ పరిధిలో ఉందన‍్నారు.
యాచకురాలిని కాదు...
డైరెక‍్టర్ జనరల్ వెళ్ళిపోయిన తర్వాత మహిళా యాచకురాలు సాయమ్మ కన్నీరుమున్నీరుగా విలపించింది. తాను యాచకురాలు కాదని, కూరగాయల కోసం రోడ్డుపైకి వస్తే తనను బలవంతంగా అరెస్టుచేసి చర‍్లపల్లి జైలులో ఉంచారని వాపోయింది. తనలాగే చాలామంది ఆశ్రమంలో మగ్గుతున్నారని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment