హడలే‍త్తిస్తున్న డెల్టా ప్లస్‌ వేరియంట్‌.. పొరుగు రాష్ట్రం నుంచి ముప్పు | Delta Plus Variant Spread In Maharashtra | Sakshi
Sakshi News home page

హడలే‍త్తిస్తున్న డెల్టా ప్లస్‌ వేరియంట్‌.. పొరుగు రాష్ట్రం నుంచి ముప్పు

Published Sun, Jun 27 2021 8:01 AM | Last Updated on Sun, Jun 27 2021 8:07 AM

Delta Plus Variant Spread In Maharashtra - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, వాంకిడి(ఆదిలాబాద్‌): కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ ఉధృతి తగ్గి ఇప్పుడిప్పుడే జనజీవనం కుదుటపడుతున్న తరుణంలో డెల్టా ప్లస్‌ వేరియంట్‌ భయపెడుతోంది. కరోనా నుంచి పుట్టుకొచ్చిన డెల్టా ప్లస్‌ వేరియంట్‌ కేసులు పొరుగున ఉన్న మహారాష్ట్రలో పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడి వారిలో భయాందోళనలు నెలకొంటున్నాయి. మహారాష్ట్రకు జిల్లా మీదుగా నిత్యం రాకపోకలు నడుస్తున్న నేపథ్యంలో వైరస్‌ సంక్రమించే అవకాశం ఉందన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈ పరిణామాల మధ్య అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు. కనీసం మహారాష్ట్ర నుంచి వచ్చే వారిని తనిఖీ కూడా చేయడం లేదని పేర్కొంటున్నారు. 

కరోనా సెకండ్‌ వేవ్‌ సమయంలో మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన వాంకిడి మండల కేంద్రంలో చెక్‌పోస్టు ఏర్పాటు చేసి, పోలీస్, వైద్య, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. మహారాష్ట్ర నుంచి వచ్చే ప్రయాణికులకు థర్మల్‌ స్క్రీనింగ్‌ టెస్టులు నిర్వహించి, వారి పూర్తి వివరాలు నమోదు చేసుకునేవారు. అత్యవసర పరిస్థితుల్లో ఈ– పాస్‌లు ఉన్న వారిని మాత్రమే అనుమతించారు. రాష్ట్రంలో కరోనా ఉధృతి తగ్గి, కేసుల సంఖ్య స్వల్ప స్థాయికి చేరడంతో రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ ఆంక్షలను పూర్తిగా ఎత్తేసిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొని వ్యాపారాలు, వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో డెల్టా ప్లస్‌ వేరియంట్‌ కేసులు నమోదవుతున్నాయని వార్తలొస్తుండడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మహారాష్ట్రకు రాకపోకలు..
మహారాష్ట్రలో కరోనా సెకెండ్‌ వేవ్‌ కేసులు విపరీతంగా పెరగడంతో అటువైపు వెళ్లే బస్సుల రాకపోకలను నిలిపివేశారు. దీంతో పాటు మండల కేంద్రంలో ప్రత్యేక చెక్‌పోస్టు ఏర్పాటు చేసి అత్యవసర వాహనాలను మాత్రమే అనుమతించేవారు. ప్రస్తు తం కరోనా ఉధృతి సాధారణ స్థాయికి చేరగా రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ ఆంక్షలను పూర్తిగా ఎత్తివేసింది. అంతర్రాష్ట్ర సరిహద్దు వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును సైతం తొలగించారు. మహారాష్ట్రలో మండలానికి చెందిన వారి బంధువులు ఎక్కువగా ఉన్నారు. ఆర్టీసీ బస్సులు మునుపటిలా యథావిధి గా పూర్తిస్థాయిలో నడుస్తుండడం వల్ల ప్రతిరోజూ వందల మంది రాకపోకలు సాగిస్తున్నారు. వ్యాపారాల నిమిత్తం చంద్రాపూర్, నాగ్‌పూర్‌ వరకూ ప్రయాణాలు సాగిస్తుంటారు.

డెల్టా ప్లస్‌ అలజడి.. 
మహారాష్ట్రతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో డెల్టా ప్లస్‌ వేరియంట్‌ కేసులు నమోదవుతున్నట్లు, తగు జాగ్రత్తలు పాటించాలని కేంద్రం హెచ్చరించింది. ఈ రకం వైరస్‌ ఫస్ట్, సెకండ్‌ వేవ్‌ల కంటే వేగంగా విస్తరించొచ్చని, మాస్కు లేకుండా పక్క నుంచి వెళ్లినా సోకే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మండలం నుంచి మహారాష్ట్రకు అధిక సంఖ్యలో రాకపోకలు సాగుతుండడం, దేశంలోనే మ హారాష్ట్రలో ఎక్కువ కేసులు నమోదు కావడం వంటి వి ఆందోళన కలిగించే విషయాలు. లాక్‌డౌన్‌ ఎత్తివేశాక చెక్‌పోస్టును తొలగించడంతో విస్తారంగా రాకపోకలు సాగుతున్నాయి. సెకండ్‌ వేవ్‌తో అతలాకుతలమైన సామన్య ప్రజానీకం కొత్త రకం వేరియంట్‌ ఎక్కడ కమ్ముకుంటుందోనని భయందోళనకు గురవుతున్నారు. అధికారులు పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ జాగ్రత్తతో ముందస్తు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

ఆదేశాలు వస్తే ఏర్పాటు చేస్తాం
ప్రభుత్వం లాక్‌డౌన్‌ ఆంక్షలు ఎత్తేయడంతో     పై అధికారుల ఆదేశాలనుసారం చెక్‌ పోస్టును తొలగించాం. మండలంలో కరోనా వైరస్‌ అదుపులోనే ఉంది. కరోనా నిబంధనలు పాటించని, మాస్కులు ధరించని వారికి జరిమానా విధిస్తున్నాం. ప్రజలు పోలీసులకు సహకరిస్తూ, నిబంధనలు పాటించాలి. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే చెక్‌పోస్టు ఏర్పాటు చేసి తనిఖీలు చేపడతాం. 

– దీకొండ రమేశ్, ఎస్సై, వాంకిడి 

చదవండి: Delta Plus: 12 రాష్ట్రాలకు డెల్టా ప్లస్‌ వ్యాప్తి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement