దేవినేని ఉమ కొత్త ఎత్తుగడ!
సాక్షి, విజయవాడ : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు రెండు నాలుకల ధోరణి వల్ల సీమాంధ్రలో ఆ పార్టీ ఉనికికే ప్రమాదం ఏర్పడింది. జిల్లాలో పార్టీని కాపాడుకునేందుకు పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు కొత్త ఎత్తుగడ వేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొండా ఉమామహేశ్వరరావుతో కలిసి గురువారం ఉదయం 10 గంటలకు హోటల్ డీవీ మేనర్ సమీపంలో నిరవధిక నిరాహారదీక్షకు సిద్ధమవుతున్నారు. 2009 డిసెంబర్‌లో రాష్ట్ర విభజన ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు కేంద్రమంత్రి చిదంబరం ప్రకటన చేయగానే తెలుగుదేశం పార్టీ తరుఫున ఈ ఇద్దరు నేతలు నగరంలో నిరవధిక దీక్ష చేశారు. ఇప్పుడు రాష్ట్ర విభజన ప్రకటన వచ్చిన 14 రోజులు తరువాత స్పందించడంపై ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాశంగా మారింది.
చంద్రబాబుపై వత్తిడి పెంచి ఉంటే....
గుంటూరు జిల్లా పొన్నూరులో ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, విజయవాడలో దేవినేని ఉమ నిరవధిక దీక్ష చేయడానికి ప్రాధాన్యం ఇచ్చే కంటే, చంద్రబాబుతో సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రకటన చేయించడానికి వత్తిడి పెంచే ప్రయత్నం చేసి ఉంటే బాగుండేదని పార్టీలో సీనియర్ నేతలు వ్యాఖానిస్తున్నారు. ఎపీఎన్జీవోల సంఘ నాయకులు వెళ్లి కోరినా, తెలంగాణకు అనుకూలంగా తాను ఇచ్చిన లేఖను వెనక్కు తీసుకోనని చంద్రబాబునాయుడు తేల్చి చెప్పడాన్ని వారు తప్పు పడుతున్నారు. జిల్లా నేతలు నిరవధిక దీక్షకు సిద్ధమైనా చంద్రబాబును తెలంగాణావాదిగానే ప్రజలు చూస్తారే తప్ప సమైక్యవాదిగా గుర్తించరని అంటున్నారు. ఆయన అనుసరిస్తున్న రెండు కళ్ల సిద్ధాంతం వల్లనే జిల్లాలో పార్టీ దెబ్బతింటోందనేది వారి భావన. పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యేలు దేవినేని ఉమ, ధూళిపాళ్ల నరేంద్ర వంటి వారు ఆమరణదీక్ష చేస్తుంటే కనీసం చంద్రబాబు వచ్చి వారిని పరామర్శించి, దీక్షకు తమ మద్దతు ప్రకటిస్తారా? లేదా? అన్న అంశం పార్టీలో చర్చనీ యాశంగా మారింది. చంద్రబాబు పట్టించుకోని ఈ దీక్షల వల్ల పార్టీకి ఎంత మేరకు ప్రయోజనం ఉంటుందనేది మరో ప్రశ్న.
మహాధర్నాను పట్టించుకోని చంద్రబాబు
గతంలో కృష్ణాడెల్టాకు సాగునీరు విడుదల చేయకూడదంటూ తెలంగాణకు చెందిన ఒక ఇంజినీర్ కోర్టులో కేసుదాఖలు చేశారు. దీంతో కృష్ణాడెల్టాకు సకాలంలో సాగునీరు అందక రైతులు విలవిలలాడారు. ఆ సమయంలో దేవి నేని ఉమ కృష్ణానది ఇసుక తిన్నెల్లో మహా ధర్నా నిర్వహించారు. ఈ దీక్షకు కోస్తాంధ్రా ప్రాంత తెలుగుదేశం పార్టీ నాయకులంతా వచ్చినా చంద్రబాబు మాత్రం హాజరుకాలేదు. తెలంగాణ ప్రాంత నేతల ఆగ్రహం చవిచూడాల్సి వస్తుందనే భయంతోనే ఆయన అప్పట్లో మహాధర్నాకు దూరంగా ఉన్నారని ప్రచారం జరిగింది. ఆ తరువాత ఇంద్రకీల్రాది వద్ద ఫ్లైఓవర్ నిర్మించాలన్న స్థానిక సమస్యపై ఆందోళన చేస్తే మాత్రం చంద్రబాబు వచ్చి తీవ్రంగా స్పందించారు. ఇప్పుడు కూడా చంద్రబాబు తెలంగాణప్రాంత ప్రయోజనాలను కాపాడేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప సమైక్యాంధ్ర ప్రయోజనాలను పట్టించుకోవడంలేదని ప్రజలు నుంచి విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు సీమాంధ్రపై ప్రత్యేక శ్రద్ధ చూపనంత వరకు దేవినేని ఉమామహేశ్వరరావు వంటి వారు చేసే నిరసన కార్యక్రమాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నారు.