జిల్లా సర్వతోముఖాభివృద్ధికి పాటుపడాలి | General meeting of the public | Sakshi
Sakshi News home page

జిల్లా సర్వతోముఖాభివృద్ధికి పాటుపడాలి

Published Mon, Sep 1 2014 2:24 AM | Last Updated on Sat, Sep 2 2017 12:41 PM

జిల్లా సర్వతోముఖాభివృద్ధికి పాటుపడాలి

జిల్లా సర్వతోముఖాభివృద్ధికి పాటుపడాలి

  • జెడ్పీ తొలి సర్వసభ్య సమావేశంలో ప్రజాప్రతినిధులు
  • మచిలీపట్నం : రాష్ట్ర విభజన అనతరం తలెత్తిన ఇబ్బందుల నేపథ్యంలో కృష్ణా జిల్లా సర్వతోముఖాభివృద్ధికి ప్రతి ఒక్కరు పాటుపడాలని పలువురు ప్రజాప్రతినిధులు అభిప్రాయపడ్డారు. నవ్యాంధ్రప్రదేశ్‌లో జిల్లాకు ప్రత్యేక స్థానం లభించనుందని, అందుకు తగిన విధంగా అభివృద్ధి చేయాల్సి ఉందని పేర్కొన్నారు. మచిలీపట్నంలోని జెడ్పీ కార్యాలయంలో ఆదివారం జరిగిన జిల్లా పరిషత్ తొలి సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న పలువురు ప్రజాప్రతినిధులు జిల్లా అభివృద్ధికి చేపట్టాల్సిన అంశాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఆ వివరాలు వారి మాటల్లోనే..
     
    సమావేశాలు అర్థవంతంగా సాగాలి
    జెడ్పీ సమావేశాల్లో తీసుకునే నిర్ణయాలు జిల్లా అభివృద్ధిపై ప్రభావం చూపుతాయి. సమావేశాలు అర్థవంతంగా జరిగేలా నూతనంగా ఎన్నికైన సభ్యులు సహకరించాలి. ప్రజా సమస్యలపై చర్చించి, పరిష్కరించేందుకు జిల్లా పరిషత్ సమావేశమే వేదికగా మారాలి. అనవసర విషయాలను ప్రస్తావించి విలువైన సమయాన్ని వృథా చేయవద్దు.
     - కొనకళ్ల నారాయణరావు, బందరు ఎంపీ
     
     యూపీ పాఠశాలలు రద్దు కావు
     యూపీ పాఠశాలల్లో 6, 7 తరగతుల్లో 20 మంది కన్నా తక్కువ విద్యార్థులు ఉంటే ఆ పాఠశాలను రద్దు చేస్తారనే ప్రచారం జరిగింది. ఈ పాఠశాలలను రద్దు చేయకుండా పాఠశాల విద్యా కమిషనర్ ఉషారాణితో మాట్లాడాము. ఉపాధ్యాయులు, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు యూపీ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు కృషి చేయాలి. సిబ్బందిని నియమించాలి.             
     - కేఎస్ లక్ష్మణరావు, ఎమ్మెల్సీ
     
      పాత భవనాలు తొలగించాలి
     ప్రభుత్వ పాఠశాలల్లో సర్వశిక్షా అభియాన్ ద్వారా నూతన భవనాలు నిర్మిస్తున్నారు. వాటిని ప్రారంభించటం లేదు. శిథిలమైన పాఠశాల భవనాలను తొలగించటం లేదు. పాత భవనాలను తొలగించకపోవటంతో వాటిలోనే తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ అంశంపై అధికారులు దృష్టిసారించాలి.
     - ఉప్పులేటి కల్పన, పామర్రు ఎమ్మెల్యే
     
     ఇసుక క్వారీలు తెరిపించాలి
     ఇసుక క్వారీలు చాలా కాలంగా మూతపడి ఉండటంతో నూజివీడు నియోజకవర్గంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా నుంచి వచ్చే ఇసుకను అధిక ధరకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. జిల్లాలోని క్వారీలను తెరిస్తే తక్కువ ధరకే ఇసుక లభించే అవకాశం ఉంది. పేదలు ఇళ్లు నిర్మించుకునేందుకు ఇసుక అందుబాటులో ఉంటే కొంతమేర ఖర్చు తగ్గుతుంది.
     - మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, నూజివీడు ఎమ్మెల్యే
     
      పారిశ్రామికంగా అభివృద్ధి జరగాలి
     జిల్లాలో పారిశ్రామికంగా అభివృద్ధి జరగాలి. బందరు పోర్టు నిర్మాణం పూర్తయితే అనుబంధ పరిశ్రమలు స్థాపించడానికి అవకాశం ఉంటుంది. ఇటీవల ఢిల్లీ వెళ్లిన సీఎం రెండు రోజుల పాటు ప్రధానమంత్రితో పాటు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసే దిశగా చర్చలు జరిపారు. పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు మా వంతు కృషి చేస్తాం.
     - కేశినేని శ్రీనివాస్(నాని), విజయవాడ ఎంపీ
     
     స్థానిక సంస్థలకు అధికారాలివ్వాలి
     స్థానిక సంస్థలు బలోపేతం కావాలంటే 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం 29 అంశాలను రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు బదలాయించాలి. పురపాలక సంఘాలకు 18 అంశాలను బదలాయించాల్సిన అవసరం ఉంది. మండలాల్లో ఉన్న ఆసుపత్రుల్లో సరైన వైద్యసేవలు అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వీటిపై జిల్లా పరిషత్ సభ్యులు దృష్టిసారించాలి.
     - బొడ్డు నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ
     
      చెరువులు అభివృద్ధి చేయండి
     తూర్పు కృష్ణా వారికే అధిక పదవులు దక్కుతున్నాయి. ఈ సారి కూడా జెడ్పీ చైర్‌పర్సన్ విషయంలో అదే జరిగింది. పశ్చిమ కృష్ణా ప్రాంతానికి ప్రతి సారీ అన్యాయం జరుగుతోంది. తిరువూరు నియోజకవర్గంలో 300 చెరువులు ఉన్నాయి. వీటిని బాగు చేస్తే నియోజకవర్గంలో వ్యవసాయానికి నీటి కరువు ఉండదు. జిల్లా పరిషత్, ప్రభుత్వం ద్వారా అయినా ఈ చెరువులను అభివృద్ధి చేయాలి.
     - కంచి రామారావు, డీసీఎంఎస్ చైర్మన్
     
     కీలక నిర్ణయాలు తీసుకోవాలి
     జిల్లాలో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలపై జెడ్పీ సమావేశాల్లో పూర్తిస్థాయిలో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోవాలి. నూతనంగా ఎన్నికైన జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు పాలనపై పట్టు సాధించాలి. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.
     - కొక్కిలిగడ్డ రక్షణ నిధి, తిరువూరు ఎమ్మెల్యే
     
     ప్రతిపక్షానికి ప్రాధాన్యత ఇవ్వాలి  
     జిల్లా పరిషత్ సమావేశాల్లో ప్రధాన ప్రతిపక్ష పాత్రను వైఎస్సార్ సీపీ పోషిస్తుంది. సంప్రదాయానికి విరుద్ధంగా స్టాండింగ్ కమిటీలను ఏర్పాటు చేశారు. జెడ్పీ చైర్‌పర్సన్ చదివిన జాబితా ఒకటి, సభ్యులకు ఇచ్చిన జాబితా మరోలా ఉంది. పారదర్శక పాలన అందిస్తామని చెబుతున్న పాలకపక్షం ప్రతిపక్షానికి సమప్రాధాన్యం కల్పించాలి. అప్పుడే ప్రజాసమస్యలపై సముచిత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది.
     - తాతినేని పద్మావతి, జెడ్పీ ప్రతిపక్ష నాయకురాలు
     
      నీటిపారుదలపై దృష్టిసారించాలి
     నీటి పారుదల, డ్రెయినేజీ వ్యవస్థలపై పాలకులు, అధికారులు దృష్టిసారించాలి. జిల్లా అభివృద్ధికి నిధులు తీసుకువచ్చేందుకు మంత్రులు కృషి చేయాలి. ప్రజాసమస్యల పరిష్కారంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ఫలాలు అందరికీ అందేలా చర్యలు తీసుకోవాలి. విద్య, ఆరోగ్యం తదితర అంశాలపైనా దృష్టిసారించాలి.                  
     - కాగిత వెంకట్రావు, పెడన ఎమ్మెల్యే
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement