టీడీపీకి కలెక్టర్ వెన్నుదన్ను : తాతినేని
పెనమలూరులో రోడ్ల నిర్మాణానికి కమిటీ వేశారని, ఆ కమిటీ కోసం ప్రత్యేక బ్యాంకు ఖాతాను ఏర్పాటు చేశారని, ఖాతాలో ఉన్న డబ్బును పంచాయతీ, మండలం, జెడ్పీకి జమ చేయకుండానే పనులు ఎలా చేశారని తాతినేని నిలదీశారు. యనమలకుదురు క్వారీ నుంచి రోడ్ల నిర్మాణం పేరుతో ఇసుకను తవ్వి అనేక లారీలను బయటకు పంపారని, దీనికి బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్నించారు. సీఆర్డీఏ పరిధిలో ఉన్న పెనమలూరు నియోజకవర్గంలో ప్రభుత్వం అనుమతి లేకుండా రోడ్ల నిర్మాణం ఎలా చేస్తారని అడిగారు. యనమలకుదురు క్వారీ నుంచి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా, ఆన్‌లైన్‌లో ఫిర్యాదు పంపినా ఎందుకు స్పందించలేదని కలెక్టర్‌ను ఆమె ప్రశ్నించారు.
టీడీపీకి అనుకూలంగా కలెక్టర్ వ్యవహరిస్తున్నారని, ఇది మంచి పద్దతి కాదన్నారు. యనమలకుదురు క్వారీకి అనుమతులు ఉన్నాయో, లేదో చెప్పాలని కలెక్టర్‌ను ఆమె కోరారు. పరిశీలించి చెబుతానని కలెక్టర్ చెప్పడం గమనార్హం. క్వారీల నుంచి ఇసుకను తరలించే లారీలకు జీపీఎస్ పద్ధతి అమలుచేయడం లేదని, జీపీఎస్ స్టిక్కర్లు లేని లారీల ఆధారాలు తన వద్ద ఉన్నాయంటూ పద్మావతి ఓ వీడియోను పోడియం వద్దకు వెళ్లి కలెక్టర్, జెడ్పీ చైర్‌పర్సన్‌కు చూపారు. 90 శాతం వాహనాలకు జీపీఎస్ పద్ధతిని అమలు చేస్తున్నామని, మిగిలిన 10 శాతం త్వరలో పూర్తిచేస్తామని అధికారులు తెలిపారు. దీనిపై పద్మావతిని ఉద్దేశించి గద్దె అనురాధ స్పందిస్తూ.. మీకు అభివృద్ధి జరగడమంటే ఇష్టం లేదు.. అందుకే కలెక్టర్‌పైనా వ్యాఖ్యలు చేస్తున్నారు.. మీరలా మాట్లాడకూడదు.. ఈ ఒక్క కారణంతో మిమ్మల్ని సభ నుంచి సస్పెండ్ చేయవచ్చు..’ అని పేర్కొన్నారు.