పోలీసుల వైఖరిలో మార్పు తీసుకురండి | Bring a change in attitude of the police | Sakshi
Sakshi News home page

పోలీసుల వైఖరిలో మార్పు తీసుకురండి

Published Thu, Jul 31 2014 1:47 AM | Last Updated on Fri, May 25 2018 9:17 PM

పోలీసుల వైఖరిలో మార్పు తీసుకురండి - Sakshi

పోలీసుల వైఖరిలో మార్పు తీసుకురండి

  • కూచిపూడి ఘటనపై దర్యాప్తు చేయించండి
  •   ప్రజల పక్షాన పోరాటం చేస్తుంటే టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారు
  •   టీడీపీ నేత వర్ల రామయ్య ఆగడాలకు అడ్డుకట్ట వేయండి
  •   ఎస్పీకి పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన, పేర్ని నాని వినతి
  • మచిలీపట్నం : జిల్లాలో టీడీపీ నాయకుల ఆగడాలకు హద్దులేకుండా పోతోందని, వారిని అదుపులో ఉంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ పామర్రు ఎమ్మెల్యే , అసెంబ్లీలో వైఎస్సార్ సీపీ డెప్యూటీ ఫ్లోర్ లీడర్ ఉప్పులేటి  కల్పన, వైఎస్సార్ సీపీ బందరు నియోజకవర్గ సమన్వయకర్త పేర్ని నాని, జెడ్పీ ఫ్లోర్ లీడర్ తాతినేని పద్మావతి తదితరులు ఎస్పీ జి.విజయకుమార్‌ను కోరారు. బుధవారం ఎస్పీని కలిసిన వైఎస్సార్ సీపీ నాయకులు టీడీపీ నేతల అగడాలపై ఫిర్యాదుచేశారు.

    ఈ సందర్భంగా ఉప్పులేటి కల్పన మాట్లాడుతూ ప్రభుత్వం రుణమాఫీని కచ్చితంగా అమలుచేయాలని కోరుతూ ఆరు రోజుల క్రితం కూచిపూడిలోని వైఎస్సార్ విగ్రహం వద్ద వైఎస్సార్ సీపీ ఆధ్వర్యాన శాంతియుతంగా ధర్నా చేస్తుండగా, టీడీపీ నాయకులు పోటీగా ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారని తెలిపారు. తనను, వైఎస్సార్ సీపీ నాయకులను పరుషపదజాలంతో దూషించారని చెప్పారు. తాము కార్యక్రమం ప్రారంభించినప్పటి నుంచి పోలీసులు తమ వద్దే ఉన్నారని ఆమె తెలిపారు.

    తమను అకారణంగా దూషించిన టీడీపీ కార్యకర్తలపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లే సమయంలోనూ పోలీసులు వెంట వచ్చారని వివరించారు. కొద్దిసేపటి తర్వాత టీడీపీ కార్యకర్తలు ఆ పార్టీ నేత వర్ల రామయ్యతో కలసి వచ్చి తాము టీడీపీ కార్యకర్తలను కులం పేరుతో దూషించామని, చెప్పుతో కొట్టినట్లు తప్పుడు ఫిర్యాదు చేశారని ఆమె వివరించారు. ఆద్యంతం పోలీసులు తమ వెంటే ఉన్నారని, తాము ఏం చేసిందీ పోలీసులు మొత్తం చూశారని, ఈ విషయంపై సమగ్ర విచారణ చేయించాలని కోరారు.

    పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన టీడీపీ నేత వర్ల రామయ్య డీఎస్పీ, సీఐలను తనదైన శైలిలో బెదిరించారని చెప్పారు. ‘ప్రభుత్వం మాదే ఉంది. మా మాటే వినాలి..’ అంటూ పోలీసు అధికారులపై విరుచుకుపడ్డారని పేర్కొన్నారు. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో టీడీపీ నాయకులకు అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని పేర్ని నాని ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. బందరు నియోజకవర్గం శివగంగలోనూ పేదలు నివసిస్తున్న గుడిసెలు ఖాళీ చేయించేందుకు ఇనగుదురుపేట పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారని, ఈ విషయంపైనా దర్యాప్తు చేయించాలని కోరారు.

    తాతినేని పద్మావతి మాట్లాడుతూ రైతుల పక్షాన కూచిపూడిలో తాము ధర్నా చేస్తుంటే టీడీపీ నాయకులు అడ్డుకోవటమే కాకుండా తమపై తప్పుడు ఫిర్యాదుచేశారని పేర్కొన్నారు. ఎస్పీ మాట్లాడుతూ ఆయా సంఘటనలపై విచారణ చేయిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం  కూచిపూడి సంఘటనకు సంబంధించి వీడియో క్లిప్పింగ్‌లను ల్యాప్‌టాప్‌లో చూపించారు. సీడీని ఎస్పీకి అందజేశారు. ఏఎస్పీ బీడీవీ సాగర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
     
    రుణమాఫీ జాప్యం చేస్తున్నారు
     
    ఎస్పీని కలిసిన అనంతరం ఉప్పులేటి కల్పన, పేర్ని నాని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో రైతులు వివిధ బ్యాంకుల ద్వారా రూ.87వేల కోట్లను పంట రుణాలుగా తీసుకున్నారని, టీడీపీ ప్రభుత్వం మాత్రం డ్వాక్రా సంఘాల రుణాలతో కలిపి రూ.35 వేల కోట్లను మాఫీ చేస్తామని చెబుతోందని విమర్శించారు. పంట రుణాలను రీషెడ్యూలు చేస్తామని ఒకసారి, మాఫీ చేస్తామని మరోసారి కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారన్నారు.

    ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా, బ్యాంకుల్లో రైతులకు అప్పులు ఇవ్వటం లేదన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకు వైఎస్సార్ సీపీ నాయకులు సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న వైఎస్సార్ సీపీ నాయకులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తోట్లవల్లూరు ఎంపీపీ కళ్లెం వెంకటేశ్వరరెడ్డి, పెదపారుపూడి జెడ్పీటీసీ సభ్యురాలు మూల్పూరి హరీష, వైఎస్సార్ సీపీ నాయకుడు మారుమూడి విక్టర్‌ప్రసాద్, పెడన 9వ వార్డు కౌన్సిలర్ చంద్రబాబు పాల్గొన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement