ఉయ్యూరు/ పమిడిముక్కల, న్యూస్‌లైన్ : కలుషితాహారం తిని తొమ్మిది మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర కడుపునొప్పి.. వాంతులతో విలవిలలాడిపోతూ ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పాఠశాల ఉపాధ్యాయుల బాధ్యతారాహిత్యానికి నిలువుటద్దంగా మారిన ఈ ఘటన పమిడిముక్కల మండలం హనుమంతపురం (గడ్డిపాడు)లో శనివారం జరిగింది. తమ పిల్లల ఆక్రందనలు చూసిన తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు.
పేద విద్యార్థులంటే అంత చులకనా అంటూ ఉపాధ్యాయులపై మండిపడ్డారు. మధ్యాహ్నం ఘటన జరిగితే తమకు చెప్పకుండా దాస్తారా.. అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కలుషిత ఆహార ఘటన తెలుసుకున్న జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు వెంటనే స్పందించారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాల్సిందిగా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కలుషితాహారం పెట్టిన మధ్యాహ్న భోజనం ఏజెన్సీని రద్దు చేస్తూ ఘటనపై విచారణ జరపాల్సిందిగా డీఈఓ దేవానందరెడ్డిని ఆదేశించారు.
ఘటన జరిగిందిలా...
హనుమంతపురం జెడ్పీ పాఠశాలలో మొత్తం 126 మంది విద్యార్థులుండగా శనివారం మధ్యాహ్నం 78 మంది మధ్యాహ్న భోజనం తిన్నారు. ఏజెన్సీ నిర్వాహకులు అన్నం, పప్పు, చారు విద్యార్థులకు వడ్డించారు. భోజనం చేస్తున్న క్రమంలో పప్పులో బల్లి ఉండటాన్ని గమనించిన విద్యార్థులు వెంటనే సమాచారాన్ని నిర్వాహకులకు, పాఠశాల హెచ్‌ఎం సీతామహాలక్ష్మికి తెలియజేశారు. అప్పటికే చాలామంది విద్యార్థులు ఆహారం తీసుకోవడం పూర్తయింది. ఉన్న భోజన పదార్థాలను పారబోయించి వెంటనే అక్కడి వైద్య సిబ్బందికి హెచ్‌ఎం సమాచారం అందించారు. పాఠశాలకు వచ్చిన ఏఎన్‌ఎం లిల్లీరాణి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి మందులు అందించారు. పాఠశాల ముగిసేవరకు ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందీలేదని నిర్ధారించుకుని సాయంత్రం ఐదు గంటల తరువాత ఇళ్లకు పంపారు.
కడుపునొప్పితో విలవిల...
ఇంటికి చేరుకున్న విద్యార్థులు గ్రామంలో ట్యూషన్‌కు వెళ్లారు. వెళ్లిన కొద్దిసేపటికే తొమ్మిది మందికి కడుపునొప్పి వచ్చింది. దీంతో వారంతా ట్యూషన్ మాస్టర్ శ్రీనివాసరాజుకు విషయం తెలియజేశారు. కడుపునొప్పితో పాటు ఒకరి తర్వాత ఒకరికి వాంతులై కళ్లు తిరుగుతుండటంతో ట్యూషన్ మాస్టర్ విద్యార్థుల తల్లిదండ్రులు, 108కు సమాచారం అందించారు. 108 వచ్చేసరికి విద్యార్థుల పరిస్థితి విషమిస్తుందనే ఆందోళనతో వారిని వెంటనే ఆటోలో ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. క్లస్టర్ అధికారి బాలకృష్ణప్రసాద్, వైద్యులు రవిపాల్, మధుసూదనరావు, కపిలేశ్వరపురం పీహెచ్‌సీ వైద్యాధికారి బీ లలిత విద్యార్థులకు చికిత్స అందించారు.
వైద్యసేవలు అందటంతో విద్యార్థుల పరిస్థితి మెరుగుపడింది. ఆహారం కలుషిత కావటం వల్లే వారు అస్వస్థతకు గురయ్యారని ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ రవిపాల్ తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి అపాయం లేదని కపిలేశ్వరపురం వైద్యాధికారి లలిత చెప్పారు. తహశీల్దార్ బీ ఆశియ్య, టౌన్ ఎస్‌ఐ జానకీరామయ్య ఆస్పత్రికి వచ్చి వివరాలు సేకరించి సమాచారాన్ని ఉన్నతాధికారులకు తెలిపారు.
నో ప్రాబ్లమ్.. బీ కూల్..
విద్యార్థులు తీవ్ర అస్వస్థతతో విలవిలలాడుతుంటే పాఠశాల ఉపాధ్యాయుడు టేకిట్ ఈజీ అన్నట్లు వ్యవహరించటంపై ఒక్కసారిగా వారి తల్లిదండ్రులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రి బెడ్డుపై తమ పిల్లలు వామ్మో.. నాయినో.. అంటూ బాధపడుతుంటే నో ప్రాబ్లమ్.. బీ కూల్.. అంటావా అంటూ ఒక్కసారిగా ఉపాధ్యాయుడి పైకి దూసుకువెళ్లారు. మధ్యాహ్నం కలుషిత ఆహారం తింటే తమకెందుకు చెప్పలేదంటూ నిలదీశారు. దీంతో ఆ ఉపాధ్యాయుడు అక్కడ నుంచి మెల్లగా జారుకున్నాడు.
అస్వస్థతకు గురైన విద్యార్థులు వీరే..
10వ తరగతికి చెందిన జువ్వనపూడి దివ్యభారతి, గురివిందపల్లి సంధ్యారాణి, ఇంటూరి దివ్య, కొడమంచిలి లావణ్య, తంగిరాల సిరివెన్నెల, గురివిందపల్లి వినయకుమారి, కొక్కిలిగడ్డ కిన్నెర, కొడాలి శ్రావణి, 7వ తరగతికి చెందిన కలపాల మధుప్రియలు అస్వస్థతకు గురైనవారిలో ఉన్నారు. అస్వస్థతకు గురైన తొమ్మిది మంది విద్యార్థినులే. విద్యార్థుల అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు ఉప్పులేటి కల్పన, మాజీ ఎంపీపీ శొంఠి వెంకటేశ్వరరావులు విద్యార్థినులను, వారి తల్లిదండ్రులను పరామర్శించి మెరుగైన వైద్యం అందించాల్సిందిగా అధికారులను కోరారు.
9 మంది విద్యార్థుల అస్వస్థత
Published Sun, Jan 26 2014 2:14 AM | Last Updated on Tue, Sep 18 2018 7:36 PM
Advertisement