కలెక్టర్ వెల్లడి
19 లోపు పరిశీలన పూర్తి
23న అభ్యర్థులకు జాబితాల పంపిణీ
తిరువూరు, న్యూస్‌లైన్ : కొత్తగా ఓటుహక్కు కోరుతూ జిల్లాలో 75 వేల మంది దరఖాస్తు చేసుకున్నట్లు జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు తెలిపారు. గురువారం తిరువూరు వచ్చిన ఆయన స్థానిక తహశీల్దారు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. గత జనవరి 31 నాటికి ప్రకటించిన ఓటర్ల జాబితాకు అదనంగా కొత్త ఓటర్ల పేర్లు చేరుస్తామని చెప్పారు.
ఈ నెల 19 లోపు దరఖాస్తుల పరిశీలన పూర్తవుతుందన్నారు. ఈ నెల 23న అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థులందరికీ తాజా ఓటర్ల జాబితాలు అందజేస్తామన్నారు. ఓటర్ల జాబి తాలో ఫొటోలు తారుమారైనా, ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓటుహక్కున్నా నిర్దిష్ట నమూనాలో ఫిర్యాదు చేస్తేనే చర్య తీసుకోవడం సాధ్యపడుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు.
ప్రతి నియోజకవర్గంలో మోడల్ పోలింగ్ కేంద్రం...
జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో ఒక మోడల్ పోలింగ్ కేంద్రాన్ని అసెంబ్లీ ఎన్నికల్లో ఏర్పాటు చేస్తామని కలెక్టర్ రఘునందన్‌రావు తెలిపారు. ఈ మోడల్ పోలింగ్ కేంద్రంలో ఓటర్లకు వరుసలో నిలబడే అవసరం లేకుండా సీటింగ్ సదుపాయం కల్పిస్తామని చెప్పారు. త్వరగా ఓటు వేసేందుకు సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులు మోడల్ పోలింగ్ కేంద్రాన్ని ఎంపిక చేస్తారన్నారు. తిరువూరు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి వెంకటసుబ్బయ్య, సహాయ రిటర్నింగ్ అధికారి రియాజ్‌హుస్సేన్‌లతో ఎన్నికల ఏర్పాట్లపై చర్చించారు. ఓటర్లకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
పోలింగ్ కేంద్రాల పరిశీలన
తిరువూరు టౌన్ : అసెంబ్లీ ఎన్నికలకు ఏర్పాటుచేసిన తిరువూరులోని పలు పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. స్థానిక జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామగ్రి సరఫరా చేసేందుకు అవసరమైన రిసెప్షన్ కౌంటర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బస్సులు పాఠశాల ఆవరణలోకి వచ్చి వెళ్లేందుకు వీలుగా ప్రధాన గేటు వెడల్పు చేయాలని, ఇందుకు అవసరమైన నిధులను వెంటనే విడుదల చేస్తామని కలెక్టరు వెల్లడించారు. నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి వెంకటసుబ్బయ్య, సహాయ రిటర్నింగ్ అధికారి రియాజ్‌హుస్సేన్ పాల్గొన్నారు.