మన తెలుగు పుష్పా– 2 రికార్డు బద్దలు కొడుతోంటే అదే సమయంలో మన భారతీయ మహిళా డైరెక్టర్ 80 ఏళ్ల చరిత్ర గల గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో రెండు నామినేషన్స్ సాధించి రికార్డు స్థాపించింది. బెస్ట్ డైరెక్టర్ (మోషన్ పిక్చర్) బెస్ట్ మోషన్ పిక్చర్ (నాన్ ఇంగ్లిష్) కేటగిరీల్లో ఆమె దర్శకత్వం సినిమా ‘ఆల్ వియ్ ఇమాజిన్ యాజ్ లైట్’ నామినేషన్ పొందింది. ఇంతకు ముందు ఇలాంటి ఘనత సాధించిన మన దేశపు మహిళ మరొకరు లే రు.
‘సినిమా తీయాలంటే అందరికీ ఫిల్మ్ స్కూల్ అక్కర్లేదు. కాని నాకు ఉపయోగపడింది’ అంటారు పాయల్ కపాడియా. ముంబైలో, ఆంధ్రప్రదేశ్‌లోని రిషి వ్యాలీలో బాల్యం, కౌమారం గడిచిన పాయల్ పూణె ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో డైరెక్షన్ కోర్సు చదివి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన దర్శకురాలు అయారు. 2014 నుంచి సినిమాలు తీస్తున్నా 2021లో తీసిన డాక్యుమెంటరీ ‘ఏ నైట్ ఆఫ్ నోయింగ్ నథింగ్’తో ఆమె ప్రతిభ లోకానికి పరిచయం కాసాగింది.
ఎవరికీ లేని ఘనత
ఆస్కార్ అకాడెమీ అవార్డ్స్‌తో సమానమైన ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కోసం పోటీ పడే భారతీయ సినిమాలు చాలా తక్కువ. 1994 లో చివరిసారిగా ఒక భారతీయ సినిమా నామినేషన్ పొందింది. ఆ తర్వాత ఇన్నాళ్లకు అదీ ఒక మహిళా దర్శకురాలిగా పాయల్ కపాడియా తాను తీసిన ‘ఆల్ వియ్ ఇమాజిన్ యాజ్ లైట్’తో 2024 గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో ‘బెస్ట్ డైరెక్టర్’, ‘బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్’ విభాగం కింద రెండు నామినేషన్స్ పొందారు. ఇప్పటికే కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో రెండవ ప్రతిష్టాత్మకమైన బెస్ట్ డైరెక్టర్ అవార్డును (గ్రాండ్ ప్రి) పొందిన డింపుల్ కపాడియా గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా సాధిస్తే ఆమె పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలబడిపోతుంది.
సినిమాలు చూస్తూ...
పాయల్ కపాడియా బాల్యంలో రిషి వ్యాలీలోనే సినిమాల మీద ఆసక్తి పెంచుకున్నారు. ‘మా అమ్మా నాన్నలు నాకు చిన్నప్పుడు ప్రగతికాముక సినిమాలు చూపించేవారు. రష్యన్, ఫ్రెంచ్ సినిమాలు... ఆనంద్ పట్వర్థన్ తీసిన డాక్యుమెంటరీలు చూస్తూ పెరిగాను. ఆ తర్వాత పూణెలో డైరెక్షన్ కోర్సులో చేరాక వేరు వేరు ప్రాంతాల, నేపథ్యాల నుంచి వచ్చిన బ్యాచ్‌మేట్స్ సినిమాల గురించి ఎన్నో చర్చలు సాగించేవారు. రోజూ స్క్రిప్ట్‌లు వినడమే సరిపోయేది.
అదంతా చిన్న ఎక్స్‌పోజర్ కాదు. అలాగే ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రాక్టికల్స్ ఉండేవి. అవి చేసే ముందు కష్టంగా ఉన్నా చేశాక ఏదో తెలుసుకున్నాం అనే సంతృప్తి ఉండేది. ఉదాహరణకు అందరూ తప్పనిసరిగా 4 నిమిషాల లాంగ్‌షాట్ తీయాలి మా ప్రాక్టికల్ ఫిల్మ్స్‌లో. ఎవరు ఎలా తీస్తారనేది ఒక అనుభవం. మా ్ర΄పొఫెసర్లు కూడా ఎంతో బాగా పాఠాలు చెప్పారు. అవన్నీ నేను దర్శకురాలు కావడానికి సాయం చేశాయి’ అంటారామె.
ముగ్గురు స్త్రీలు, ఒక నగరం
మూడు నాలుగేళ్లుగా రాసుకున్న స్క్రిప్ట్ ‘ఆల్ వియ్ ఇమాజిన్ యాజ్ లైట్’ను తీయడానికి కావలసిన బడ్జెట్ కోసం ఫ్రాన్స్, ఇటలీ, లగ్జంబర్గ్, ఇండియా, నెదర్లాండ్స్‌లోని ్ర΄పొడక్షన్ సంస్థలను ఆశ్రయించి వారి సహ భాగస్వామ్యంతో పూర్తి చేశారు పాయల్. కేరళ నుంచి ముంబైకి భుక్తి కోసం వచ్చిన ఇద్దరు నర్సుల కథ ఇది. వీరు పనిచేసే ఆస్పత్రిలోనే వంటమనిషిగా చేస్తున్న మహారాష్ట్ర మహిళ వీరితో కలుస్తుంది.
ఆ నర్సుల్లో ఒకామె భర్త ఆమెను విడిచిపెట్టి జర్మనీ వెళ్లిపోయి ఉంటాడు. మరో నర్సు అవివాహితగా ఉంటూనే ఒక యువకునితో రిలేషన్‌లో ఉంటుంది. ఇక వంటామె ఇరవై ఏళ్లుగా తాను ఏ చాల్ (చిన్న కొట్టం)లో అయితే నివసిస్తోందో ఆ చాల్‌ను బిల్డర్ కూల్చడానికి వస్తే దానిని సొంతం అని చెప్పుకోవడానికి ఏ పత్రమూ లేక కలిగే నిస్పృహ... ఈ ముగ్గురి జీవితం ఎక్కడకు చేరుతుంది... ఏ వెలుతురికీ ప్రస్థానం అని చూపేదే కథ.
లోతైన కథనం
పాయల్ కపాడియా ఈ కథలో ఎన్నో ΄పొరలు ఉంచి కథకు బహుముఖ పార్శా్వలు ఇవ్వడమే ప్రపంచ విమర్శకులను ఆకర్షించి అవార్డుల పంట పండేలా చేస్తోంది. ఈ కథలో మూడు పాత్రలతో పాటు ముంబై నగరం కూడా ఒక పాత్రగా ఉండటం విశేషం. ఒక నగరం పెరిగే కొద్దీ పేదవాళ్లను దూరంగా నెట్టేస్తూ ఉంటుందని ఈ సినిమా చూపుతుంది. ఒకప్పటి మామూలు ఏరియా ఖరీదైన భవంతులతో నిండిపోతే అప్పటివరకూ అక్కడ ఉన్నవారు ఎక్కడకు వెళ్లి వుంటారు? ఎవరూ ఆలోచించరు.
‘ఈ నగరం కలల నగరం అని కొందరు అనుకుంటారు. ఇది భ్రాంతుల నగరం. కలా నిజమా... తెలుసుకునే లోపే జీవితం గడిచిపోతుంది’ అనే డైలాగ్ ఇందులో ఉంది. ‘నువ్వు జీవితాన్ని తప్పించుకోలేవు’ అనే డైలాగ్ కూడా ఉంది. తప్పించుకోలేని జీవితంలో తగిన ఆనందాలు వెతుక్కోవడం ఎలాగో ప్రతి జీవికీ తెలుస్తుంది. ఈ కథలోని ముగ్గురు స్త్రీలు ఆ ఆనందాలను వెతుక్కుని వెలుతురు పొందుతారు. జనవరి 5న గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ఈవెంట్ ఉంది. చూద్దాం మన అదృష్టం.
Comments
Please login to add a commentAdd a comment