ప్రపంచవ్యాప్తంగా సినీ నటీనటులు ప్రతిష్టాత్మకంగా భావించే 82వ గోల్డెన్ గ్లోబ్స్ అవార్డుల వేడుక లాస్ ఏంజెల్స్‌లో ఘనంగా ప్రారంభమైంది. అయితే, అవార్డ్ కోసం భారత్ నుంచి బరిలో ఉన్న ‘ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్’ సినిమాకు నిరాశే మిగిలింది. బెస్ట్ నాన్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ మోషన్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్ కేటగిరీల్లో పోటీలో నిలిచిన ఈ చిత్రానికి రెండు విభాగాల్లోనూ నిరాశే ఎదురైంది. ఫ్రెంచ్ మ్యూజికల్ క్రైమ్ కామెడీ చిత్రం 'ఎమిలియా పెరెజ్' చిత్రం బెస్ట్ నాన్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ విభాగంలో అవార్డ్ అందుకుంది. ఇండియన్ సినిమా అవార్డ్ కోల్పోయినప్పటికీ హాలీవుడ్ మూవీలతో పోటీ పడి ఆర్హత సాధించింది. దీంతో ఈ చిత్రంపై అందరి నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి.
సినిమా రంగంలో విశేష ప్రతిభ చూపిన వారికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపునిచ్చే ఉద్దేశంతో హాలీవుడ్ ఫారిన్ ప్రెస్ అసోసియేషన్ (హెచ్. ఎఫ్. పి. ఎ) వారు ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు నాంది పలికారు. 1944 నుంచి ఈ అవార్డు కార్యక్రమాన్ని ప్రతి ఏడాది ప్రారంభంలో వారు నిర్వహిస్తున్నారు. హాలీవుడ్ సినిమాలతో పాటు అంతర్జాతీయ చిత్రాలను కూడా గుర్తించి వాటికి పురస్కారాలు ఇస్తుంటారు. ప్రస్తుతం హెచ్. ఎఫ్. పి. ఎ టీమ్‌లో సుమారు 60 దేశాలకు చెందిన 105 మంది సభ్యులున్నారు. వారందరూ ఓకే అనుకున్న తర్వాతే గోల్డెన్ గ్లోబ్స్ ఖరారు చేస్తారు. సినిమా రంగంతో పాటు టెలివిజన్ రంగంలో ప్రతిభ చూపిన వారికీ అవార్డులు ఇస్తుండటం విశేషం.
‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డ్‌ను ఆర్‌ఆర్‌ఆర్ దక్కించుకుంది. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ‘నాటు నాటు’ పాటకుగాను అవార్డు వరించింది. టాలీవుడ్ నుంచి ఈ పురస్కారం అందుకున్న తొలి వ్యక్తిగా సంగీత దర్శకుడు ఎం. ఎం. కీరవాణి రికార్డ్ క్రియేట్ చేశారు. అయితే, ఈ అవార్డు అందుకున్న తొలి భారతీయ వ్యక్తిగా సంగీత దర్శకుడు ఎ. ఆర్. రెహమాన్ కావడం విశేషం. 2009లో వచ్చిన ‘స్లమ్‌డాగ్ మిలీనియర్’ సినిమాకుగాను ‘బెస్ట్ ఒరిజినల్ స్కోర్’ విభాగంలో ఆయన ఈ అవార్డు అందుకున్నారు. అలా ఇప్పటి వరకు వారిద్దరు మాత్రమే ఈ అవార్డ్ దక్కించుకున్నారు. ఈ పుస్కారం సాధిస్తే 'ఆస్కార్' అవార్డ్ వచ్చినట్టే అని చాలామంది సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతుంటారు.
గోల్డెన్ గ్లోబ్ విజేతలు
- ఉత్తమ చిత్రం - ఎమిలియా పెరెజ్ (ఫ్రెంచ్)
- ఉత్తమ దర్శకుడు - అమెరికాకు చెందిన బ్రాడీ కార్బెట్ ( ది బ్రూటలిస్ట్)
- ఉత్తమ నటుడు - రొమానియా నటుడు సెబాస్టియన్ స్టాన్ ( ఎడిఫరెంట్ మ్యాన్)
- ఉత్తమ నటి - మెక్సికోకు చెందిన డెమి మూర్ (ది సబ్‌స్టాన్స్)
- ఉత్తమ యానిమేటెడ్ చిత్రం - ఫ్లో (ఫ్రెంచ్)
Comments
Please login to add a commentAdd a comment