తాగునీటి చెరువులు పూర్తిగా నిండవు
- సాక్షితో కలెక్టర్ రఘునందన్‌రావు
సాక్షి ప్రతినిధి, విజయవాడ : జిల్లాలో తాగునీటి అవసరాలకు సాగర్ నుంచి వారం రోజుల పాటు నీరు వదిలినా చెరువులు పూర్తిస్థాయిలో నిండే అవకాశం లేదని కలెక్టర్ రఘునందన్‌రావు తెలిపారు. బుధవారం ఆయనను కలిసిన ‘సాక్షి ప్రతినిధి’తో పలు అంశాలపై మాట్లాడారు. ప్రస్తుతం చెరువులు నింపే కార్యక్రమం కొనసాగుతుందని, వారం రోజుల్లో అన్ని చెరువులకు తాగునీరు పూర్తిగా అందే అవకాశం మాత్రం లేదని కలెక్టర్ చెప్పారు. తాగునీటిని ఇతర అవసరాలకు ఎవరు ఉపయోగించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ప్రతి నీటి బొట్టూ ఎంతో విలువైనదన్నారు. వర్షాలు వచ్చి నీటిమట్టం పెరిగితే తాగునీటి కొరత పూర్తిస్థాయిలో తీరుతుందన్నారు. రైతులకు బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించాల్సిన విషయాన్ని ప్రస్తావించగా ప్రభుత్వం ఈ విషయంలో కసరత్తు చేస్తున్న విషయం గురించి చెప్పారు. సీఎం బ్యాంకు అధికారులతో సమావేశం నిర్వహించినందున త్వరలోనే వారి నుంచి గైడ్‌లైన్స్ వస్తాయని, వాటిని దృష్టిలో ఉంచుకుని బ్యాంకు అధికారులతో సమావేశం నిర్వహిస్తామన్నారు. వర్షాలు బాగా పడితే కృష్ణానదిలో పూర్తిస్థాయిలో నీరు వస్తే ఎటువంటి ఇబ్బందులుండవని, వ్యవసాయానికీ పూర్తిస్థాయిలో నీళ్లు అందుతాయన్నారు. వర్ష సూచన ఉన్నందున నదుల్లో నీటి మట్టం పెరిగే అవకాశం ఉందన్నారు.
రాజధాని విషయం ప్రభుత్వానిదే...
రాజధాని విజయవాడలోనే ఉంటుందనే ప్రచారం గురించి ప్రస్తావించగా అదంతా ప్రభుత్వం చూసుకునే వ్యవహారమన్నారు. ఏదైనా ఆగస్టు తరువాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. ఎందుకంటే రాజధాని ఎక్కడైతే బాగుంటుందనే అంశంపై తగిన నివేదిక ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన కమిటీ ఆగస్టులో నివేదిక ఇస్తుందని, అప్పటి వరకు వేసి చూడాల్సిందేనన్నారు. ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఎంత మొత్తం ఉన్నాయి. అదే విధంగా ప్రైవేట్ భూముల వివరాలూ సేకరించినట్లు చెప్పారు. ఈ వివరాలు ప్రభుత్వానికి అందజేసినట్లు తెలిపారు. భూ సేకరణ కొత్త చట్టం ప్రకారం జరుగుతుందని గత సంవత్సరం రూపొందించిన చట్టంలో పేర్కొన గైడ్‌లైన్స్ ప్రకారం పరిహారం ఉంటుందన్నారు. జిల్లాలో కొత్తగా 11 ప్రభుత్వ శాఖల ఏర్పాటుకు అవసరమైన భూమి వివరాలు ప్రభుత్వం అడిగి తీసుకుందని చెప్పారు.
‘మెట్రో’ అవకాశం ఉంది...
ఇక మెట్రోరైల్ విషయం ప్రస్తావించగా ఉన్నత స్థాయి కమిటీ వచ్చి పరిశీలించి వెళ్లినందున తప్పకుండా ప్రాజెక్టు వచ్చే అవకాశం ఉందన్నారు. ఆరు నెలల్లో ఫీజుబులిటీ రిపోర్టు కేంద్ర ప్రభుత్వానికి పంపించాల్సి ఉందన్నారు. మెట్రోరైల్ రావడం వల్ల నగరంలో రవాణా సులువవుతుందని చెప్పారు. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ తప్పకుండా కృష్ణా జిల్లాలోనే ఏర్పాటుచేసే అవకాశం ఉన్నట్లు వస్తున్న వార్తలను ప్రస్తావించగా ప్రభుత్వ పరిశీలనలో ఉందని చెప్పారు. కొత్తగా రాష్ట్రం ఏర్పడినందున ప్రయారిటీలు అనేవి పాలకులు నిర్ణయించేవే తప్ప తమ వద్ద ఏమి ఉండదన్నారు. వారు చెప్పినవి అమలు చేసేందుకు మాత్రమే తాము పనిచేయాల్సి ఉంటుందనే విషయాన్ని గుర్తు చేశారు.