మీరైనా న్యాయం చేయండి..
పాతగుంటూరు: జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు అదనపు జేసీ వెంకటేశ్వరరావు, హౌసింగ్ పీడీ సురేష్‌బాబును కలిసి తమ ఫిర్యాదులు అందజేశారు. ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్, జేసీ లేకపోవడంతో కొందరు తమ ఫిర్యాదులు అంజేయకుండానే వెనుదిరిగారు. ప్రజావాణిలో కొందరు బాధితుల సమస్యలు ఇవి..
ప్రభుత్వం తమకు ఇచ్చిన స్థలాల్లో ఇళ్లు నిర్మించుకోకుండా కొందరు వ్యక్తులు అడ్డుపడుతున్నారని తాడికొండ మండలం గరికపాడుకు చెందిన సీహెచ్ లక్ష్మి, నాగమణి, ముత్తమ్మ ఫిర్యాదు చేశారు. బెదిరించే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఎనిమిదేళ్ల కిందట కాలనీ ఏర్పడినా తమకు మంచినీటి వసతి లేదని గుంటూరు రూరల్ మండలం రామరాజు కాలనీకి చెందిన తిరుపతమ్మ, పరమేశ్వరమ్మ, మహిమూన్ అర్జీ అందజేశారు. కాలనీలో 1,200 కుటుంబాలు నివాసం ఉంటున్నాయని, అధికారులు చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదని తెలిపారు.
గత ఏడాది చివరిలో తనపై నలుగురు దాడి చేశారని, దాడి చేసినవారికి పోలీసులు దన్నుగా నిలుస్తున్నారని మేడికొండూరు మండలం పేరేచర్లకు చెందిన ఎ.వరప్రసాదరావు ఫిర్యాదు అందజేశారు. కేసు వెనక్కు తీసుకోవాలని బెదిరిస్తున్నట్లు పేర్కొన్నారు. అధికారులు స్పందించి కేసు నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
రుణమాఫీ వర్తించేలా చర్యలు తీసుకోవాలని వట్టిచెరుకూరు మండలం చింతపల్లిపాడుకు చెందిన కోమటినేని సాంబశివరావు కోరారు. 2012 సంవత్సరంలో ఐదెకరాలకు సంబంధించిన పాస్‌బుక్ పెట్టి బ్యాంకులో రూ.2.50లక్షల రుణం తీసుకున్నట్లు తెలిపారు. 95సెంట్లకు రూ.60,193 రుణం మాత్రమే తీసుకున్నట్లుగా నమోదైందని పేర్కొన్నారు. దీనిపై అధికారులను అడిగితే తమకేం సంబంధం లేదంటున్నారని చెప్పారు. చర్యలు తీసుకోవాలని కోరారు.
అటవీ భూములు ఇచ్చినా హక్కు పత్రాలు ఇవ్వలేదని భైరవపాడు సుగాలీ కాలనీకి చెందిన రమావత్ మంగ్లానాయక్, ఆర్.సాంబానాయక్ తెలిపారు. 20 ఏళ్లుగా అటవీ భూములు సాగు చేసుకుంటున్నామన్నారు. 2006వ సంవత్సరంలో కొంతమందికి అటవీ హక్కు పత్రాలు ఇచ్చారని తెలిపారు. మిగిలిన వారికి హక్కు పత్రాలు నేటికీ మంజూరు చేయలేదని, అధికారుల చుట్టూ తిరిగినా ఎవరూ స్పందించడం లేదని వాపోయారు. ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు.
తనతో సహా చిన్నకోడలు రూతమ్మను ఇంటి నుంచి బయటకు గెంటి వేసిందని తాడికొండ మండలం పొన్నెకల్లుకు చెందిన బోరుగడ్డ ఆరోగ్యం ఫిర్యాదు చేసింది. తన పెద్ద కుమారుడు అబ్రహాం, చిన్న కుమారుడు షడ్రక్ మరణించారని, ఇదే అదనుగా పెద్ద కోడలు మరియమ్మ తమను ఇంటి నుంచి బయటకు గెంటేసిందని తెలిపారు. ఆస్తికోసం ఇలా చేస్తున్నట్లు వివరించారు.