పాతగుంటూరు : ఏడాదిగా సమస్యను పరిష్కరించాలంటూ అధికారుల చుట్టూ తిరుగుతున్నాం. సమస్య పరిష్కరించాలని ప్రజావాణి కార్యక్రమానికి ఎన్నిసార్లు వచ్చినా సంబంధిత అధికారులు మాత్రం చొరవ చూపడంలేదు. తమకు న్యాయం చేయాలంటూ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందని బాధితులు అధికారులకు విన్నవించుకున్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి పలు సమస్యలపై జిల్లా అధికారులకు వినతిపత్రాలు ఇచ్చి, వారి బాధలను విన్నవించుకున్నారు. స్పందించిన జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండే ప్రజావాణిలో వచ్చిన సమస్యలను పరిష్కరించాలంటూ సంబంధితఅధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రత్తిపాడు సావిత్రీబాయి కాలనీలో 12 ఏళ్లుగా నివాసం ఉంటున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు పరిశపోగు శ్రీనివాసరావు వినతిపత్రం ఇచ్చారు. గుంటూరు ఆనందపేట 9వ లైనులో ఇళ్ల మధ్యలో సెల్ టవర్ నిర్మాణాన్ని నిలిపివేయాలని స్థానికులు ఆదంబీ, ఆషాబేగం, సదరంబీ కోరారు.
గుంటూరు శివార్లలో ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకుంటున్న వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని రిపబ్లికన్ పార్టీ నాయకుడు ఆనందకుమార్ వినతిపత్రం సమర్పించారు. కొల్లిపరలో దేవాదాయ శాఖ గ్రామకంఠంలో ఉన్న 21.20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువు భూమిని ట్రస్టు పేరుతో సభ్యులు, దేవాదాయ అధికారులు కలిసి అమ్ముకుంటున్నారని ఆ గ్రామానికి చెందిన కొల్లి శివరామిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన భర్త వాటర్ ట్యాంక్ డ్రైవర్‌గా పనిచేస్తూ, 2005లో మృతిచెందాడని, తనకు ఉద్యోగం ఇవ్వాలంటే డబ్బులు డిమాండ్ చేస్తున్నారని గుంటూరుకు చెందిన తాటి లక్ష్మీకుమారి ఫిర్యాదుచేశారు.
టీడీపీకి ఓట్లు వేయలేదని తమ పింఛన్లు అక్రమంగా తొలగించారని, తమకు పింఛన్లు ఇప్పించాలని దాచేపల్లి మండలం తంగెడకు చెందిన హనుమాయమ్మ, లాలూబీ విన్నవించారు. జిల్లాలో అర్హులైన వికలాంగుల కుటుంబాలకు నివేశన స్థలాలు వెంటనే మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు రామయ్య కోరారు.
విన్నపాలు... ఆవేదనలు...
Published Tue, Apr 21 2015 2:48 AM | Last Updated on Sun, Sep 3 2017 12:35 AM
Advertisement
Advertisement