![Botsa Satyanarayana Says Amaravati Development Plan In Krishna - Sakshi](/styles/webp/s3/article_images/2020/08/13/botsa.jpg.webp?itok=0OArVLqH)
సాక్షి, అమరావతి: అన్ని ప్రాంతాల అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి స్పష్టం చేశారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి ప్రాంతం రాష్ట్రంలో అంతర్భాగమని అన్నారు. అమరావతి మెట్రోపాటిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అధారిటీ(ఏఎంఆర్‌డీఏ)పై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షించారని తెలిపారు. అమరావతిలో పెండింగ్ పనులుపై దృష్టి పెట్టాలని, తక్షణం పనులు ప్రారంభించాలని సీఎం జగన్ ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఈ ప్రాంతాన్ని లెజిస్లేటివ్ క్యాపిటల్‌గా అభివృద్ది చేయాలని గతంలో నిర్ణయించామని తెలిపారు. అసంపూర్తిగా ఉన్న భవనాలు పూర్తి చేస్తామని, వాటి వినియోగానికి తమ దగ్గర సమగ్రమైన ప్రణాళిక ఉందని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని రైతులకు తిరిగి ప్లాట్లు ఇచ్చి అభివృద్ధి చేస్తామని వ్యాఖ్యానించారు. రాష్ట్రం అభివృద్ధి చెందటం చంద్రబాబుకి ఇష్టంలేదని, ఓటమి చెందినప్పటి నుంచి ఆయన బాధ్యత విస్మరించారని మండిపడ్డారు. బాబు బాధ్యతను కూడా తాము తీసుకున్నామని తెలిపారు. (ఏఎంఆర్‌డీఏపై సీఎం జగన్ సమీక్ష)
సీఆర్డీఏ చట్టం రద్దు, పరిపాలన వికేంద్రీకరణ బిల్లును గవర్నర్ ఆమోదించాకే విశాఖపట్నంలో శంఖుస్థాపన చేయాలని భావించామని బొత్స పేర్కొన్నారు. టీడీపీ లాంటి కొన్ని దుష్టశక్తులు ఆ కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నాయని దుయ్యబట్టారు. ప్రతిపక్షాలు కోర్టు ద్వారా అడ్డంకులు సృష్టిస్తున్నాయని మండిపడ్డారు. శంఖుస్థాపన కార్యక్రమం ఎట్టిపరిస్థితుల్లో ఆగదని స్పష్టం చేశారు. శంకుస్థాపనకు ప్రధానమంత్రిని, దేశంలోని పెద్దలను అందరినీ పిలుస్తామని తెలిపారు. శుభకార్యాలు అందరికీ చెప్పి చేయడం హిందూ సాంప్రదాయమని గుర్తుచేశారు. అమరావతి నిర్మాణంలో ఉన్న భవనాలు అన్నీ పూర్తి చేస్తామని చెప్పారు. వాటిని ఏం చేయాలి, ఎందుకు వినియోగించాలనేది ప్రభుత్వం నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు. అమరావతి ప్రాంత అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యంమని రైతులకు, రియల్టర్లు గమనించాలని తెలిపారు. ఈ ప్రాంత అభివృద్ధి తమ బాధ్యత అని, ప్రభుత్వం అమరావతికి ఇచ్చిన అన్ని హామీలు నెరవేరుస్తుందని తెలిపారు. లేనిపోని అనుమానాలు పెట్టికోవద్దని, ప్రతిపక్షం మాటలు ఏమాత్రం నమ్మ వద్దని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment