ఇదీ భ్రమరావతి కథ | Un Development Capital Amaravati Special Story | Sakshi
Sakshi News home page

ఇదీ భ్రమరావతి కథ

Published Sun, Jan 12 2020 4:05 AM | Last Updated on Sun, Jan 12 2020 7:45 PM

Un Development Capital Amaravati Special Story - Sakshi

రోడ్లు లేవు.. డ్రైనేజీ వ్యవస్థ లేదు.. విద్యుత్‌ లేదు.. ఇలాంటి మౌలిక సదుపాయాలన్నీ కల్పించడం కోసం ఎకరాకు రూ. 2 కోట్లు అవసరమని లెక్క కట్టింది మీరు కాదా?  ఈ లెక్కన రాజధాని నిర్మాణం కోసం రూ.1.09 లక్షల కోట్లు అవసరం అని చెప్పింది మీరు కాదా? ఇందుకుగాను ఐదేళ్లలో కేవలం రూ.5,674 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది మీరు కాదా? ఇంకా లక్ష కోట్లకు పైగా అవసరం అని చెప్పింది మీరు కాదా? తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ.. తాత్కాలిక భవనాలు.. అని చెప్పింది మీరు కాదా?  అదే తాత్కాలిక నిర్మాణాలను ఇప్పుడు శాశ్వత భవనాలు అని చెబుతున్నది మీరు కదా? ఇప్పుడు రాజధాని నిర్మాణానికి లక్ష కోట్ల రూపాయలు అవసరం లేదంటున్నది మీరు కాదా? ఈ మాటలేంటి? ఆ రాతలేంటి? మీ ప్రచారం ఏమిటి?

సాక్షి, అమరావతి: రాజధాని నిర్మాణం కోసం  చంద్రబాబు ప్రభుత్వం అమరావతి పరిధిలో రైతులపై సామ దాన భేద దండోపాయాలు ప్రయోగించి 29 గ్రామాల్లో 34,385 ఎకరాలు సమీకరించింది. మరో 3,800 ఎకరాల కోసం భూ సేకరణ అస్త్రం ప్రయోగించేందుకు సిద్ధపడింది. ఇంకా 15 వేల ఎకరాల ప్రభుత్వ భూమిని రాజధాని కోసం కేటాయించింది. ఈ విధంగా చంద్రబాబు ప్రభుత్వం గుప్పిట పట్టిన దాదాపు 50 వేల ఎకరాల్లో గత ఐదేళ్లలో పెద్ద ఎత్తున నిర్మాణాలు సాగుతున్నాయని అందర్నీ భ్రాంతిలో ఉంచింది. అందుకోసం రకరకాల గ్రాఫిక్కులతో డిజైన్లు విడుదల చేస్తూ కనికట్టు చేసింది. ఐదేళ్లలో శాశ్వత నిర్మాణం ఒక్కటీ పూర్తి చేయలేదనేది కఠోర వాస్తవం.

అమరావతిలో కీలకమైన సీడ్‌ కేపిటల్‌ కోసం టీడీపీ ప్రభుత్వం కేటాయించింది ఎంతో తెలుసా... కేవలం 1,350 ఎకరాలే. అందులో కూడా ఐదేళ్లలో అటూ ఇటూ 100 ఎకరాల్లోనే కాస్తో కూస్తో నిర్మాణాలు చేపట్టింది. మిగిలిన 49,500 ఎకరాల భూమి నిర్జనంగా పడి ఉంది. 2019 మేలో చంద్రబాబు ప్రభుత్వం గద్దె దిగే నాటికి సీడ్‌ క్యాపిటల్‌ ప్రాంతంలో ఒక్క నిర్మాణం కూడా పూర్తి చేయలేదు. ప్రధాన భవనాలు ఏవీ పునాదుల దశ కూడా దాట లేదు. శాశ్వత సెక్రటేరియట్, సీఎం కార్యాలయం, విభాగాధిపతుల కార్యాలయాలు  పునాదులకే పరిమితమయ్యాయి. కనీసం భూమికి సమాన ఎత్తువరకు కూడా పునాదులు, పిల్లర్లను నిర్మించ లేదు. న్యాయమూర్తుల బంగ్లాలు నిర్మించే చోట భూమి చదును కూడా చేయలేదు.

ప్రధాని శంకుస్థాపన చేసిన ప్రాంతం..సంచార జాతుల నిలయం 

ఎమ్మెల్యే క్వార్టర్స్‌ నిర్మాణం చూపి రాజధాని పూర్తయిందంటారా?
ఐఏఎస్‌ అధికారుల కోసం రెండు డిజైన్లలో బంగ్లాల నిర్మాణం కూడా పునాదుల దశలోనే నిలిచిపోయింది. కేవలం ఎమ్మెల్యేల నివాస సముదాయాలు, నాలుగో తరగతి ఉద్యోగుల నివాస సముదాయాలు, సీఆర్‌డీయే కార్యాలయ భవనం మాత్రం 50 శాతం నిర్మించారు. ఆ భవనాలనే టీడీపీ తమ అనుకూల మీడియాలో గోరంతలు కొండంతలుగా చూపిస్తూ రాజధాని నిర్మించేశామని ప్రచారార్భాటం చేస్తుండటం విస్మయపరుస్తోంది. రాజధాని అంటే ఎమ్మెల్యేల నివాస సముదాయాలు, సీఆర్‌డీయే కార్యాలయమో కాదు కదా అని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. పోనీ వాటినైనా పూర్తి చేశారా అంటే అదీ లేదు.

‘అదిగో అమరావతి.. అద్భుత రాజధాని నిర్మించేశాం.. ఇక చేయాల్సిందేమీ లేదు.. అక్కడి నుంచి పరిపాలన కొనసాగించడమే..’  ఇదీ చంద్రబాబు ప్రసంగాల తీరు. అందుకు వంతపాడుతూ టీడీపీ అనుకూల మీడియా వరుస కథనాలు వండివారుస్తోంది.  ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు చంద్రబాబు అండ్‌ కో శతవిధాలా ప్రయత్నిస్తోంది.

పెచ్చులూడటం, వానొస్తే కారడం మామూలే.. 

బాబు వైఫల్యానికి  నిలువెత్తు నిదర్శనాలు 
ఒక చంద్రబాబు.. 8 శంకుస్థాపన శిలాఫలకాలు అన్నట్లుగా అమరావతి పేరిట టీడీపీ ప్రభుత్వం కనికట్టు చేసింది. ఏదో అద్భుత రాజధాని నిర్మిస్తున్నట్టుగా శంకుస్థాపనల మీద శంకుస్థాపనలు చేసింది. కానీ ఒక్కటి కూడా పూర్తి కాకపోవడంతో ఆ శిలాఫలకాలన్నీ టీడీపీ ప్రభుత్వ వైఫల్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయి. రాజధాని నిర్మాణానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో 2015 అక్టోబర్‌ 22న ఉద్దండరాయునిపాలెంలో శంకుస్థాపన చేయించారు. సింగపూర్‌ స్టార్టప్‌ ఏరియాకు సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ 2017 మే 15న శంకుస్థాపన చేశారు. పరిపాలన నగరం కోసం 2016 అక్టోబరు 28న అప్పటి ఆర్థిక మంత్రి ఆరుణ్‌ జైట్లీతో శంకుస్థాపన చేయించారు. సీడ్‌ యాక్సస్‌ రోడ్డు, ఎక్స్‌ప్రెస్‌ రోడ్లు, హెల్త్‌ సిటీ, ఎన్‌ఆర్‌టీ భవనం... ఇలా పలు నిర్మాణాలకు చంద్రబాబు స్వయానా భూమి పూజ, శంకుస్థాపన చేయడం గమనార్హం. ఇప్పుడు ఆయా నిర్జన ప్రాంతాల్లో చుట్టూ శిలాఫలకాలు పడి ఉన్నాయి తప్ప ఒక్క చోట పూర్తిగా ఒక్క నిర్మాణం కూడా పూర్తి చేయలేదు.

లింగాయపాలెంలో సమాధులను తలపిస్తున్న శిలాఫలకాలు

సచివాలయం, శాసనసభ నుంచి మురుగు నీటిని బయటకు పంపే వ్యవస్థ ఏర్పాటు చేయలేదు. దీంతో ఆయా భవనాల నుంచి ఎప్పటికప్పుడు మురుగు నీటిని ట్యాంకర్ల ద్వారా సేకరించి, బయటకు తీసుకెళ్లాల్సిన దుస్థితి దాపురించింది. ఈ ప్రక్రియలో కాస్త ఆలస్యమైతే డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. చుట్టుపక్కల పరిసరాల్లోదుర్వాసన వెదజల్లుతోంది.

రైతుల ప్లాట్లను గాలికొదిలేశారు..  
‘నేను ఒక్క పిలుపు ఇస్తే రైతులు 33 వేల ఎకరాలు ఇచ్చారు’ అని చంద్రబాబు నిస్సిగ్గుగా అసత్యాలు వల్లిస్తారు. ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని భూములు ఇవ్వమన్న రైతులను బెదిరించడం, పంటలు తగులబెట్టించడం మాయని మచ్చలుగా మిగిలిపోయాయి.  అమరావతిలో రైతులకు 64,710 ప్లాట్లను కేటాయించారు. వాటిలో 39,299 ప్లాట్లు రిజస్టర్‌ చేశారు. కానీ ఐదేళ్లలో ఆ ప్లాట్లకు కనీసం రోడ్లు కూడా వేయలేదు. డ్రైనేజీ, లైట్లు, పార్కులు, ఇతర పనుల ఊసే లేదు.

వానొస్తే.. చెరువే..

ఒక్క రోడ్డూ పూర్తి చేయలేదు 
విజయవాడ నుంచి కానీ, హైదరాబాద్‌ నుంచి కానీ వచ్చే వారు తాత్కాలిక సెక్రటేరియట్, అసెంబ్లీకి వెళ్లాలంటే సరైన రోడ్డే లేదు. పోనీ అమరావతిలోఅయినా రోడ్లు ఉన్నాయా అంటే అవీ లేవు. రూ.14 వేల కోట్లతో 320 కిలోమీటర్ల మేర 34 రోడ్లకు ప్రణాళిక రూపొందించారు. సీడ్‌ యాక్సెస్‌ రోడ్డుతోపాటు ఆరు వరుసలతో 7 ఎక్స్‌ప్రెస్‌ రోడ్లు, 27 ఇతర రోడ్లు నిర్మిస్తామన్నారు. 24 రోడ్ల నిర్మాణానికి కాంట్రాక్టులు ఇచ్చారు. కానీ ఒక్కటీ పూర్తి చేయలేదు. జాతీయ రహదారితో రాజధానిని అనుసంధానించే సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు కూడా అసంపూర్తిగానే మిగిలిపోయింది. ఇతర రోడ్ల గురించి చెప్పాల్సిన పనే లేదు. మట్టి రోడ్లు.. గుంతలు.. అడ్డదిడ్డంగా జారిపోయిన మట్టితో దర్శనమిస్తున్నాయి. వర్షాలు పడి గుంతల్లోని నీళ్లలో పడి ఐదుగురు ప్రాణాలు కోల్పోయినప్పటికీ అప్పటి టీడీపీ ప్రభుత్వం స్పందించలేదు.

ఇది కాలువ కాదు.. ఎక్స్‌ప్రెస్‌ రోడ్డట..

సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు దుస్థితి..

అవినీతికి అడ్డదారి...‘తాత్కాలికం’ 
చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లపాటు తాత్కాలిక కట్టడాలతోనే ప్రజల్ని మభ్యపెట్టేందుకు యత్నించింది తప్ప శాశ్వత కట్టడాల మీద ఏమాత్రం శ్రద్ధ చూపించలేదు. తాత్కాలిక సెక్రటేరియట్, తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక హైకోర్టు... ఇలా అన్నీ తాత్కాలికమే. వాటి నిర్మాణంలోనూ యథేచ్ఛగా అవినీతి. నాసిరకంగా తూతూ మంత్రంగా పనులు పూర్తి. రూ.180 కోట్లతో తాత్కాలిక సచివాలయం కడతామని పనులు ప్రారంభించి అంచనాలు అంతకంతకు పెంచుకుంటూ చివరకు దాదాపు రూ.800 కోట్లు వెచ్చించారంటే ఏ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారో ఊహించుకోవచ్చు. చిన్నపాటి వర్షం పడితేనే అసెంబ్లీ భవనం, ప్రతిపక్ష నేత చాంబర్‌లో వర్షపు నీరు కారడం ఆ నిర్మాణాల నాణ్యతలోని డొల్లతనానికి నిదర్శనం. అసెంబ్లీ భవనానికి సరైన డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయలేదు కదా.. కనీసం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సందర్శకుల కోసం విడివిడిగా టాయిలెట్లు కూడా నిర్మించకపోవడం విడ్డూరమే. కనీస సౌకర్యాలు కూడా లేకుండా హైకోర్టు నిర్మించారని స్వయానా హైకోర్టు న్యాయమూర్తే వ్యాఖ్యానించారు.

ఈ తాత్కాలిక భవనాలకు మరమ్మతులు చేయడం నిత్యకృత్యమే

బోర్డు మాత్రమే ఉంది.. జడ్జీల బంగ్లాలు లేవు..  

నవ నగరాలు ఏవీ? 
అమరావతిలో నవ నగరాల పేరిట చంద్రబాబు ప్రభుత్వం ప్రచారంలోకి తీసుకువచ్చిన కట్టుకథలు అన్నీ ఇన్నీ కావు. 1,700 ఎకరాల్లో గవర్నమెంట్‌ సిటీ, 3,346 ఎకరాల్లో జస్టిస్‌ సిటీ, 5,227 ఎకరాల్లో ఫైనాన్స్‌ సిటీ, 6,617 ఎకరాల్లో హెల్త్‌ సిటీ, 4,197 ఎకరాల్లో స్పోర్ట్స్‌ సిటీ, 8,647 ఎకరాల్లో నాలెడ్జ్‌ సిటీ, 6,657 ఎకరాల్లో ఎలక్ట్రానిక్స్‌ సిటీ, 5,167 ఎకరాల్లో మీడియా సిటీ, 5,220 ఎకరాల్లో టూరిజం సిటీ నిర్మిస్తామని గ్రాఫిక్కులతో ఊరూ వాడా ఊదరగొట్టింది. కానీ చంద్రబాబు గద్దె దిగేనాటికి అక్కడ ఒక్క సిటీ కాదు కదా.. కనీసం వీధి కూడా నిర్మించలేకపోయింది.

పశువుల మేతకు ఆవాసం..

గత ఐదేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం అమరావతి ప్రాంతంలో కనీసం ఒక్క రోడ్డును కూడా పూర్తి స్థాయిలో నిర్మించలేకపోయింది. ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులు, ఉద్యోగులు, ఇతరత్రా పనుల మీద వచ్చే సందర్శకులు రాజధానికి వచ్చిపోయేందుకు సరైన రోడ్డు కూడా లేదు. అమరావతికి వెళ్లేందుకు కరకట్ట మీదుగా సింగిల్‌ రోడ్డుపై ప్రయాణం అంటేనే హడలిపోవాల్సిందే. రెండు వాహనాలు ఎదురెదురుగా వస్తే ఇబ్బంది పడాల్సిందే. ద్విచక్ర వాహనచోదకులు, కాలినడకన వెళ్లేవాళ్ల పరిస్థితి దయనీయం.  ఏమాత్రం కాస్త పక్కకు జరిగినా ఆసుపత్రి పాలుకావాల్సిందే. ఇక వర్షం వచ్చిందా.. పరిస్థితి దైవాధీనం.

రాజధానినిర్మించి ఉంటే అద్దె భవనాల్లో ఆఫీసులెందుకు
అమరావతి నిర్మించేశామని చంద్రబాబు చెబుతున్న మాటలే నిజమైతే 90 శాతానికిపైగా ప్రభుత్వ కార్యాలయాలు విజయవాడ, గుంటూరులలో అద్దె భవనాల్లో ఎందుకు నిర్వహిస్తున్నట్లు? ఈ ప్రశ్నకు బాబు అండ్‌ కో ఎవరూ సమాధానం చెప్పరు. రూ.1.09 లక్షల కోట్లతో రాజధాని నిర్మాణానికి ప్రణాళిక రూపొందించింది. నిధులు లేకపోయినప్పటికీ కేవలం కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు దండుకునేందుకు రూ.56 వేల కోట్లతో టెండర్లు పిలిచారు. వాటిలో రూ.42,170 కోట్లతో 62 పనులను కేటాయించారు. కానీ ఐదేళ్ల తర్వాత ఖర్చు చేసింది కేవలం రూ.5,674 కోట్లు మాత్రమే. బాబు లెక్కన రాజధాని పూర్తి చేయాలంటే ఇంకా రూ.లక్ష కోట్లకుపైగా కావాలి. నిర్మాణానికి మరో 20 ఏళ్లు పడుతుంది. అప్పటికి ఆ అంచనా వ్యయం ఎన్ని లక్షల కోట్లకు చేరుకుంటుందో ఊహకే అందదు. విలువైన భూములను అస్మదీయులకు పప్పూ బెల్లాలు పంచినట్టు ఇచ్చేసింది. మొత్తం 130 సంస్థలకు 1,293 ఎకరాలను కేటాయించింది. ప్రభుత్వ రంగ సంస్థలకు ఎకరా రూ.4 కోట్లు చొప్పున, టీడీపీ పెద్దల సన్నిహితులకు మాత్రం ఎకరా రూ.50 లక్షల చొప్పున ధారాదత్తం చేయడం అవినీతికి పరాకాష్ట. – బొత్స సత్యనారాయణ, పురపాలక శాఖ మంత్రి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement